Tummala Nageswara Rao: కపాస్ కిసాన్‌తో రైతులకు ఇబ్బంది కలగొద్దు
ABN , Publish Date - Oct 13 , 2025 | 07:49 AM
పత్తి కొనుగోళ్లకు సంబంధించి సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఇటీవల ప్రారంభించిన కపాస్ కిసాన్ యాప్‌తో రైతులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని...
ప్రతీ కొనుగోలు కేంద్రంలో ఓ డేటా ఎంట్రీ ఆపరేటర్‌ని పెట్టండి
అధికారులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశం
టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి పత్తి కొనుగోళ్లు ప్రారంభించాలని సూచన
హైదరాబాద్, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): పత్తి కొనుగోళ్లకు సంబంధించి సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఇటీవల ప్రారంభించిన ‘కపాస్ కిసాన్ యాప్’తో రైతులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. పత్తి రైతులు తమ వివరాలను కపాస్ కిసాన్ యాప్‌లో నమోదు చేసుకోవడం తప్పనిసరి చేసిన నేపథ్యంలో.. రైతులకు సాయం చేసేందుకు ప్రతీ కొనుగోలు కేంద్రంలో ఓ డేటా ఎంట్రీ ఆపరేటర్‌ను నియమించాలని సూచించారు. మార్కెటింగ్ శాఖ అధికారులతో ఆదివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి తుమ్మల.. కపాస్ కిసాన్ యాప్ అంశంలో కీలక సూచనలు చేశారు. మొబైల్ నెంబర్లు మార్చిన రైతులకు యాప్‌లో లాగిన్ అవ్వడానికి ఎదురయ్యే ఇబ్బందులపై దృష్టి పెట్టాలని తుమ్మల ఈ సందర్భంగా సూచించారు. అయితే, ఆధార్ నెంబరు, ఓటీపీ ద్వారా యాప్‌లో లాగిన్ అయ్యే అవకాశం కల్పించాలని, డేటాబేస్ లో లేని రైతులకు కొత్తగా రిజిస్ట్రేషన్ సదుపాయం కల్పించాలని సీసీఐ అధికారులను ఇప్పటికే కోరామని మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి మంత్రికి తెలియజేశారు. అలాగే, కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుకింగ్, కౌలు రైతుల నమోదు ప్రక్రియపై వ్యవసాయ శాఖ అధికారులకు శిక్షణ ఇచ్చామని అధికారులు తెలిపారు. టోల్ ఫ్రీ నెంబరు- 1800 599 5779 ఏర్పాటు చేసి ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తామని చెప్పారు. అయితే, కపాస్ కిసాన్ యాప్‌లో రిజిస్ట్రేషన్‌కు సంబంధించి రైతుల సందేహాలను నివృత్తి చేయడంతోపాటు వారికి అవసరమైన సాయం అందించేందుకు ప్రతీ కొనుగోలు కేంద్రంలో ఓ డేటా ఎంట్రీ ఆపరేటర్ నియమించాలని అధికారులను మంత్రి తుమ్మల ఈ సందర్భంగా ఆదేశించారు. అలాగే, ఈ నెల పదో తేదీతో ముగిసిన సీసీఐ జాబ్ వర్క్ టెండర్లలో 328 జిన్నింగ్ మిల్లులు పాల్గొన్నాయని, టెక్నికల్ టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయ్యిందని మార్కెటింగ్ శాఖ అధికారులు వెల్లడించారు. టెండర్ల ప్రక్రియను త్వరగా పూర్తిచేసి పత్తి కొనుగోళ్లు ప్రారంభించాలని, కనీస మద్దతు ధరకు రైతుల నుంచి పత్తి కొనుగోలు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.