Agriculture Minister Tummala Nageswara Rao: సమర్థంగా రైతువేదికల వినియోగం
ABN , Publish Date - Nov 26 , 2025 | 04:42 AM
గత ప్రభుత్వం రైతు వేదికలను నిర్మించి, నిరూపయోగంగా వదిలేసింది. ప్రజా ప్రభుత్వం ఆ రైతు వేదికల్లో దృశ్య, శ్రవణ మాద్యమాలను ఏర్పాటుచేసి....
విత్తన చట్టం ముసాయిదాపై వివరించాం: తుమ్మల
హైదరాబాద్, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): ‘గత ప్రభుత్వం రైతు వేదికలను నిర్మించి, నిరూపయోగంగా వదిలేసింది. ప్రజా ప్రభుత్వం ఆ రైతు వేదికల్లో దృశ్య, శ్రవణ మాద్యమాలను ఏర్పాటుచేసి సమర్థంగా వినియోగిస్తోంది. రైతులను భాగస్వాములను చేస్తోంది’ అని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మంగళవారం సచివాలయం నుంచి రైతునేస్తం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 30 వేల మంది రైతులు రైతునేస్తం కార్యక్రమంలో పాల్గొన్నారని, ప్రభుత్వ పథకాలు, విత్తన చట్టం ముసాయిదాపై వివరించినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నదని ఆరోపించారు. ఈ సందర్భంగా జాతీయ ఆహార భద్రత మిషన్ పథకం ద్వారా వరి విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. 16 జిల్లాల్లోని రైతులకు 50ు సబ్సిడీపై 5,500 క్వింటాళ్ల వరి విత్తనాలను అందించారు. కాగా, రాష్ట్రంలో ప్రారంభంకాని జిన్నింగ్ మిల్లులను వెంటనే ప్రారంభించాలని, పత్తి కొనుగోళ్లు ఎప్పటికప్పుడు చేపట్టాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, జిన్నింగ్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు రవీందర్‌రెడ్డితో ఆయన మాట్లాడారు. జిన్నింగ్ మిల్లర్లు సమ్మె విరమించి కొనుగోళ్లు ప్రారంభిస్తామని చెప్పినప్పటికీ.. పూర్తిస్థాయిలో మిల్లులు తెరవలేదని అన్నారు. పత్తి రైతులకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని తుమ్మల ఆదేశించారు.
5 మార్కెట్ కమిటీలకు కొత్త పాలకవర్గాలు
రాష్ట్రంలో ఐదు మార్కెట్ కమిటీలకు కొత్త పాలకవర్గాలు నియమించినట్లు మంత్రి తుమ్మల తెలిపారు. సిద్దిపేట జిల్లా తొగుట, దౌల్తాబాద్, మిరుదొడ్డి, దుబ్బాక, చేగుంట మార్కెట్లకు చైర్మన్లు, వైస్‌చైర్మన్లతో పాటు సభ్యులను నియమించినట్లు వెల్లడించారు.