Minister Tummala Nageshwar Rao: మంత్రి తుమ్మల ఆకస్మిక తనిఖీలు
ABN , Publish Date - Nov 13 , 2025 | 05:04 AM
రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ, విత్తన ధ్రువీకరణ అథారిటీ, హాకా, చేనేత- జౌళీ శాఖ ప్రధాన కార్యాలయాల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు...
సమయపాలన పాటించని అధికారులపై ఆగ్రహం
చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ
హైదరాబాద్, నవంబరు 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ, విత్తన ధ్రువీకరణ అథారిటీ, హాకా, చేనేత- జౌళీ శాఖ ప్రధాన కార్యాలయాల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సమయపాలన పాటించని అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జనరల్ మేనేజర్, మేనేజర్ స్థాయి అధికారులు సైతం సమయానికి రాకపోవడమేంటని నిలదీశారు. విధి నిర్వహణలో అలసత్వాన్ని సహించేది లేదని, సమయ పాలన పాటించని అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల కమిషనర్లు, మేనేజింగ్ డైరెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సేవ కోసం నియమితులైన అధికారులు, ఉద్యోగులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, నిర్ణీత సమయానికి కార్యాలయాల్లో ఉండాలని సూచించారు. తనిఖీల సందర్భంగా రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకెట అన్వే్‌షరెడ్డితో తుమ్మల మాట్లాడారు. సబ్సిడీ విత్తనాల పంపిణీ, కార్పొరేషన్ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించారు.
‘పంట నష్టం’లో పొరపాట్లకు తావు లేకుండా..
పంట నష్టం నివేదికలో పొరపాట్లకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తుమ్మల తెలిపారు. పంట నష్టం వివరాలను గ్రామపంచాయతీ కార్యాయాల్లో నోటీస్ బోర్డులపై అంటించి, ఏమైనా అభ్యంతరాలు వస్తే స్వీకరిస్తామని వెల్లడించారు. పంట నష్టం సర్వేపై ఫిర్యాదులొచ్చిన చోట మరోసారి పరిశీలంచాలని ఆదేశించినట్లు తెలిపారు. రైతుస్వరాజ్య వేదిక ప్రతిఽనిధులు, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులతో సచివాలయంలో మంత్రి తుమ్మల సమావేశమయ్యారు. రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులు లేవనెత్తిన అంశాలపై అధికారులతో సమాధానాలు చెప్పించారు. రైతుల సమస్యలను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. కేంద్రం నుంచి తగిన సహాయం అందకపోవడంతో పత్తి రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. సోయాబీన్ రంగు మారినా కొనుగోలు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు.