Minister Konda Surekha: మేడారంలో సమీక్షపై నో కామెంట్
ABN , Publish Date - Oct 15 , 2025 | 04:07 AM
ములుగు జిల్లా మేడారంలో జరిగిన మంత్రుల సమీక్షపై మాట్లాడేదేమీ లేదని, మంత్రులకు ఇతర కార్యక్రమాలుంటాయని దేవాదాయ...
వరంగల్‌సిటీ/హైదరాబాద్, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): ములుగు జిల్లా మేడారంలో జరిగిన మంత్రుల సమీక్షపై మాట్లాడేదేమీ లేదని, మంత్రులకు ఇతర కార్యక్రమాలుంటాయని దేవాదాయ, పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. మంగళవారం హనుమకొండ డీసీసీ భవన్‌లో వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ అధ్యక్షతన డీసీసీల నియమాకంపై సమావేశం నిర్వహించారు. ఏఐసీసీ పరిశీలకులు నవజ్యోతి పట్నాయక్‌తో పాటు మంత్రి కొండా సురేఖ హాజరయ్యారు. ఈ సందర్భంగా మేడారంలో జరిగిన మంత్రుల సమీక్షకు ఆమె హాజరుకాకపోవడంపై విలేకరులు ప్రశ్నించగా.. మంత్రి కొండా సురేఖ పైవిధంగా స్పందించారు. మంత్రులు అన్నాక అనేక కార్యక్రమాలుంటాయని, అందుకే వెళ్లలేకపోయానన్నారు. తమ మధ్య ఎలాంటి వైరం లేదని స్పష్టం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో డీసీసీ అధ్యక్షుల నియమాకం ఏఐసీసీ ఆధ్వర్యంలో పారదర్శకంగా జరుగుతుందని చెప్పారు.
మంత్రి సురేఖ ఓఎస్డీ తొలగింపు
మంత్రి సురేఖ దగ్గర ఓఎస్డీగా పనిచేస్తున్న సుమంత్‌ను తొలగిస్తూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. బోర్డులో ఓఎస్డీగా కాంట్రాక్టు పద్ధతిలో నియామకమైన సుమంత్‌ను డిప్యూటేషన్‌పై మంత్రి దగ్గర నియమించారు. ఆయన్ను ఆ పోస్టు నుంచి తొలగిస్తున్నట్టు బోర్డు సభ్య కార్యదర్శి గుగులోత్ రవి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మేడారం పనుల టెండర్ల వ్యవహారంలో మంత్రుల మధ్య ఏర్పడిన విభేదాల కారణంగా ఓఎస్డీపై వేటు పడినట్లు చర్చ జరుగుతోంది.