Share News

Minister Sridhar Babu: టెక్నాలజీతోనే సక్సెస్‌

ABN , Publish Date - Nov 14 , 2025 | 04:36 AM

విద్యార్థులు కెరీర్‌లో విజయం సాధించాలంటే టెక్నాలజీలో మంచి ప్రావీణ్యం సంపాధించాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు....

Minister Sridhar Babu: టెక్నాలజీతోనే సక్సెస్‌

  • విద్యార్థులు టెక్నాలజీలో ప్రావీణ్యం సంపాదించాలి.. శ్రీధర్‌బాబు పిలుపు

  • టీ-సాట్‌ రాష్ట్రస్థాయి పోటీల విజేతలకు బహుమతుల ప్రదానం

హైదరాబాద్‌, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు కెరీర్‌లో విజయం సాధించాలంటే టెక్నాలజీలో మంచి ప్రావీణ్యం సంపాధించాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. సమాజంలో అత్యంత వేగంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా కొత్త విషయాలు నేర్చుకుంటూ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు టీ-సాట్‌ నిర్వహించిన ‘రాష్ట్ర స్థాయి వార్షిక పోటీలు-2025’లో విజేతలకు గురువారం హైదరాబాద్‌లోని టీ-సాట్‌ కార్యాలయంలో బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. విద్యార్థులు టీ-సాట్‌ సాంకేతికతను ఉపయోగించుకుని తమ భవిష్యత్‌కు గట్టి పునాదులు వేసుకోవాలని సూచించారు. టీ-సాట్‌ పోటీల్లో విజేతలుగా నిలిచిన 99మంది.. తాము ఒక్కొక్కరు సుమారు 2,200 మంది విద్యార్థుల నాలెడ్జికి సమానమని భావించాలని సూచించారు. డిజిటల్‌ విద్యలో టీ-సాట్‌ నెట్‌వర్క్‌ అందిస్తున్న సాంకేతికతను ప్రభుత్వ పాఠశాలలు, మారుమూల ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. తద్వారా రాష్ట్ర ప్రభుత్వ కలలను ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నిజం చేయాలని పిలుపునిచ్చారు. టీ-సాట్‌ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పక్షాన మంత్రి శ్రీధర్‌బాబు.. టీ-సాట్‌కు సంపూర్ణ మద్దతు అందచేస్తూ, తెలంగాణ విద్యార్థులు, యువతకు చేయూత అందిస్తున్నారని కొనియాడారు. ‘రాష్ట్ర స్థాయి వార్షిక పోటీలు 2025’ పేరుతో నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్‌ పోటీలు గురువారం ముగిశాయి. క్విజ్‌లో ప్రథమ స్థానంలో రాజన్న సిరిసిల్ల జోన్‌, ద్వితీయ స్థానంలో కాళేశ్వరం జోన్‌ నిలవగా, మూడవ స్థానంలో బాసర జోన్‌ నిలిచింది. ప్రత్యేక విజేతగా జోగులాంబగద్వాల జోన్‌ను ప్రకటించారు. ఒక్కో జోన్‌ నుంచి ఐదుగురు విద్యార్థులతో కూడిన ఒక టీం చొప్పున రాష్ట్రంలోని ఏడు జోన్లకు చెందిన 35 మంది విద్యార్థులకు క్విజ్‌ పోటీలు జరిగాయి. వక్తృత్వ (బాలవ్యక్త) పోటీల్లో ప్రథమ విజేతగా జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన 10వ తరగతి విద్యార్థి కె. కేశవర్ధన్‌ నిలిచాడు. రెండవ స్థానంలో మేడ్చల్‌ మల్కాజ్‌గిరికి చెందిన కె.వి.యశస్విని, మూడవ స్థానంలో నిర్మల్‌ జిల్లాకు చెందిన వంగా వెంకటకృష్ణ నిలిచారు. వ్యాస రచన పోటీల్లో ప్రథమ బహుమతి నిజామాద్‌ జిల్లాకు చెందిన టి.హర్షితకు లభించింది. రెండవ బహమతి నారాయణపేటకు చెందిన ఎం.కీర్తనకు, మూడవ బహుమతి మేడ్చల్‌ జిల్లాకు చెందిన డి.తేజస్వినికి లభించింది. విజేతలకు టీ-సాట్‌ పార్టిసిపేషన్‌ సర్టిఫికేట్లను అందచేశారు.

Updated Date - Nov 14 , 2025 | 04:37 AM