Minister Sridhar Babu: దండుపాళ్యం పాలన ఎవరిదో అందరికీ తెలుసు
ABN , Publish Date - Oct 19 , 2025 | 03:53 AM
దండుపాళ్యం పాలన అంటే ఎవరిదో రాష్ట్ర ప్రజలందరికీ బాగా తెలుసని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బీఆర్‌ఎ్‌సపై ద్వజమెత్తారు...
నిరాశతోనే ‘కేబినెట్’పై నిరాధారమైన ఆరోపణలు
గత 20 నెలల్లో రాష్ట్రానికి రూ.3.2 లక్షల కోట్ల పెట్టుబడులు
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
హైదరాబాద్, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): ‘దండుపాళ్యం’ పాలన అంటే ఎవరిదో రాష్ట్ర ప్రజలందరికీ బాగా తెలుసని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బీఆర్‌ఎ్‌సపై ద్వజమెత్తారు. అందుకే కర్రు కాల్చి వాత పెట్టారని ఎద్దేవా చేశారు. అధికారం లేదన్న అసహనం, నిరాశతో ‘కేబినెట్’పై ప్రతిపక్షాలు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఈమేరకు ఆయన శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. మంత్రుల మధ్య కుమ్ములాటలు, కేబినెట్ సమావేశంలో వర్గాలుగా విడిపోయి గొడవలు పడ్డారంటూ కట్టుకథల్ని సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కేబినెట్ సమష్టిగా రాష్ట్రాభివృద్ధి కోసం పని చేస్తోందని స్పష్టం చేశారు. తాము పాలనను గాలికొదిలేస్తే గత 20 నెలల్లో రూ.3.2 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేవా అని ప్రశ్నించారు. మంత్రులంతా వ్యక్తిగత పంచాయతీలు పెట్టుకుంటే ‘‘ఎలీ లిల్లీ’’ వంటి అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు తెలంగాణకు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు. మీ అంతర్గత కుమ్ములాటలను కప్పిపుచ్చుకోవడానికి మాపై బురద చల్లడం మానుకోవాలని బీఆర్‌ఎస్ నేతలకు సూ చించారు. ‘‘మీ అహంకారపూరిత వ్యవహారశైలి, పా లనా వైఫల్యాల చరిత్రను దాచుకునేందుకు ఇలాం టి నిరాధారమైన ఆరోపణలతో మైండ్ గేమ్ ఆడుతున్నారు. విజ్ఞులైన తెలంగాణ ప్రజలు మీ కుతంత్రాలను నమ్మరు.’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
6 నెలల్లో రూ.12,864 కోట్ల ఎఫ్‌డీఐలు
పారిశ్రామికాభివృద్ధి విషయంలోనూ తమపై దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి శ్రీధర్‌బాబు విమర్శించారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎ్‌ఫడీఐ) ఆకర్షణలో తెలంగాణ ముందంజలో ఉందని.. గత ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లోనే రాష్ట్రానికి రూ.12,864 కోట్ల ఎఫ్‌డీఐలు వచ్చాయని వెల్లడించారు. 2023-24లో ఇదే కాలంతో పోలిస్తే ఇవి 33 శాతం ఎక్కువ కావడం గమనార్హమన్నారు. దేశంలోనే టాప్-3 అర్బన్ ఎఫ్‌డీఐ కేంద్రాల్లో హైదరాబాద్ ఒకటిగా నిలిచిందని తెలిపారు. ‘2023-24లో పరిశ్రమల జీఎస్ వీఏ రూ.2.46 లక్షల కోట్లు కాగా.. అది 2024-25లో 12.6 శాతం పెరిగి రూ.2.77 లక్షల కోట్లకు చేరుకుందని వెల్లడించారు.