Share News

Minister Duddilla Siddharth: సమకాలీన నైపుణ్యాలే విజయ రహస్యం

ABN , Publish Date - Dec 11 , 2025 | 05:20 AM

యువత కేవలం సంప్రదాయ విద్యపైనే కాకుండా, ప్రపంచ అవసరాలకు సరిపోయే విధంగా నైపుణ్యాలు పెంపొందించుకోవాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు సూచించారు...

Minister Duddilla Siddharth: సమకాలీన నైపుణ్యాలే విజయ రహస్యం

  • ‘పాత్‌ వే టు తైవాన్‌’ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): యువత కేవలం సంప్రదాయ విద్యపైనే కాకుండా, ప్రపంచ అవసరాలకు సరిపోయే విధంగా నైపుణ్యాలు పెంపొందించుకోవాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు సూచించారు. సవాళ్లను అధిగమించి నిరంతరం నేర్చుకునే వారికే కెరీర్‌లో శాశ్వత విజయం దక్కుతుందని అన్నారు. బుధవారం టీ-వర్క్స్‌ ప్రాంగణంలో ‘పాత్‌ వే టు తైవాన్‌’ పేరుతో అంతర్జాతీయ ఉపాధి కల్పన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. తైవాన్‌ ప్రభుత్వ సంస్థ ‘టాలెంట్‌ తైవాన్‌’, టీ వర్క్స్‌ మధ్య కీలక అవగాహన ఒప్పందం కుదిరింది. టీ- వర్క్స్‌ సీఈఓ జోగిందర్‌ తనికెళ్ల, టాలెంట్‌ తైవాన్‌ ప్రతినిధి ఈడెన్‌ లియోన్‌ ఈ ఒప్పందంపై సంతకాలు చేసారు. ఈ సందర్భంగా యువతనుద్దేశించి మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడారు. తైవాన్‌లో కేవలం 2.2కోట్ల జనాభా ఉన్నప్పటికీ.. సెమీకండక్టర్ల తయారీ, టెక్నాలజీ రంగాల్లో ప్రపంచ అగ్రగామిగా ఉందని అన్నారు. ప్రతిభావంతుల వేటలో తైవాన్‌ కంపెనీలు దేశం మొత్తం మీద తెలంగాణాను ఎంపిక చేసుకున్నందుకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. తైవాన్‌ కు చెందిన రియల్‌ టెక్‌, లాజిటెక్‌ వంటి ఎనిమిది ప్రముఖ కంపెనీలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యాయి.

Updated Date - Dec 11 , 2025 | 05:20 AM