Minister Seethakka: రైతులకు పరిహారం ఇప్పించడమే పాపమా?
ABN , Publish Date - Sep 18 , 2025 | 06:28 AM
చిత్తశుద్ధితో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం బీఆర్‌ఎస్ నేతలకు అలవాటుగా మారిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మండిపడ్డారు...
ములుగు కలెక్టర్‌పై బీఆర్‌ఎస్ నేత వెకిలి మాటలెందుకు?
ఆ నాయకుడిని వారించకుండా కేటీఆర్ నవ్వడం పైశాచికం
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆగ్రహం
ములుగు, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): చిత్తశుద్ధితో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం బీఆర్‌ఎస్ నేతలకు అలవాటుగా మారిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మండిపడ్డారు. ములుగు నియోజకవర్గానికి చెందిన ఓ బీఆర్‌ఎస్ నాయకుడు హైదరాబాద్‌లో జరిగిన ఆ పార్టీ సమావేశంలో ములుగు కలెక్టర్ దివాకర్‌ను ఉద్దేశించి వెకిలిగా మాట్లాడితే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారించకపోగా నవ్వారని, ఇది పైశాచికమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘జిల్లాలో నకిలీ విత్తనాల కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారం ఇప్పించడమే కలెక్టర్ చేసి పాపమా’’ అని ప్రశ్నించారు. ములుగులో సీతక్క మాట్లాడారు. విత్తన కంపెనీలో దళారిగా పనిచేసే బీఆర్‌ఎస్ నాయకుడు నర్సింహమూర్తి.. కేటీఆర్ ముందుకు పోయి బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కలెక్టర్‌ను రాష్ట్రంలో ఉండనీయొద్దని, అందుకు తన మొత్తం ఆస్తిని పార్టీకి రాసిస్తానని అనడం ఆ పార్టీ నాయకుల మనస్తత్వాన్ని తెలియజేస్తోందన్నారు. ‘‘కేటీఆర్ మీ వెంట ఉన్నదెవరు.. రైతు ప్రయోజకులా... దళారులా’’ అని ప్రశ్నించారు.