Minister Seethakka: వన దేవతల కీర్తిని చాటిచెప్పడమే లక్ష్యం
ABN , Publish Date - Sep 22 , 2025 | 06:30 AM
సమ్మక్క-సారలమ్మ తల్లుల కీర్తిని భావితరాలకు అందించాలనే లక్ష్యంతో మేడారంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని మంత్రి సీతక్క అన్నారు.
2 వేల మంది కార్మికులతో అభివృద్ధి పనులు: సీతక్క
ములుగు/తాడ్వాయి, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): సమ్మక్క-సారలమ్మ తల్లుల కీర్తిని భావితరాలకు అందించాలనే లక్ష్యంతో మేడారంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఆమె ఆదివారం పర్యటించారు. సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం మేడారంలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. దేవస్థానం ప్రాంగణ పరిసరాలను పరిశీలించి అభివృద్ధి పనులపై కలెక్టర్ దివాకర, ఎస్పీ శబరీశ్‌తో పాటు వివిధ శాఖల అధికారులతో చర్చించారు. సెక్టార్ల వారీగా అభివృద్ధి పనుల బాధ్యతలను అధికారులకు అప్పగించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గిరిజన దేవస్థానం ప్రపంచ ప్రఖ్యాతి పొందాలన్న సంకల్పంతో ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడుతోందని తెలిపారు. 2వేల మంది కార్మికులతో పనులు ప్రారంభిస్తున్నామని, వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.