Minister Ponnam Prabhakar: ఆర్టీసీకి రూ.7,980 కోట్ల చెల్లింపు
ABN , Publish Date - Nov 14 , 2025 | 04:30 AM
మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటి వరకు మహిళలు 237 కోట్ల జీరో టికెట్లు ఉపయోగించుకున్నారని, అందుకు సంబంధించి ఆర్టీసీకి సర్కారు...
సంస్థకు అదనపు ఆదాయ మార్గాలను చూడండి
ఆర్టీసీ ఉన్నతాధికారులతో మంత్రి పొన్నం సమీక్ష
హైదరాబాద్, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటి వరకు మహిళలు 237 కోట్ల జీరో టికెట్లు ఉపయోగించుకున్నారని, అందుకు సంబంధించి ఆర్టీసీకి సర్కారు రూ.7,980 కోట్లు చెల్లించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మహాలక్ష్మి పథకంతో సంస్థ క్రమంగా లాభాల బాటలోకి వస్తున్నప్పటికీ.. టికెట్‌తో పాటు అదనపు ఆదాయ మార్గాలపై దృష్టి సాధించాలని అధికారులకు సూచించారు. ఆర్టీసీ ఉన్నతాధికారులతో సచివాలయంలో మంత్రి పొన్నం గురువారం సమీక్ష నిర్వహించారు. టికెట్‌పై ప్రకటనలతో ఆదాయాన్ని పెంచాలని అధికారులకు సూచించారు. నష్టాల్లో కొనసాగుతున్న డిపోలు లాభాల బాట పట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేసేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని సంస్థ ఎండీ నాగిరెడ్డికి సూచించారు. హైదరాబాద్‌లో బస్సుల సంఖ్యను పెంచేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ఫోర్త్ సిటీలో బస్ టెర్మినల్ నిర్మాణం, బస్ సౌకర్యాలపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. డిసెంబరు చివరిలోపు 84 ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ, 114 సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కానుందని తెలిపారు. మేడారం జాతర సమీపిస్తుండటంతో ములుగు బస్ ేస్టషన్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు.
మహాలక్ష్మి నిధుల చెల్లింపుపై మంత్రి అబద్ధాలు..
ఆర్టీసీ సమీక్షలో మంత్రి పొన్నం కార్మికుల సమస్యలను విస్మరించడం బాధాకరమని ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బాబు, వెంకన్న ఆరోపించారు. కాంగ్రెస్ హామీ ప్రకారం.. కార్మిక సంఘాల పునరుద్ధరణ ఏమైందని ప్రశ్నించారు. మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి ప్రతి నెలా ఇవ్వాల్సిన రూ.350కోట్లతో పాటు రూ.900 కోట్ల పాత బకాయిలను మంత్రి ఎప్పుడు ఇప్పిస్తారో చెప్పకుండా.. మొత్తం సొమ్ము ఇచ్చామని అబద్ధం చెప్పడం వారి స్థాయికి తగదని విమర్శించారు. పదవీ విరమణ చేసిన కార్మికులకు బకాయిలు చెల్లించాలని ఆర్టీసీ బోర్డు మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు కోరారు.