Minister Jupally Krishna Rao: అనధికార బార్లపై మీ నిఘా ఏమైంది
ABN , Publish Date - Sep 14 , 2025 | 05:33 AM
ఒక్క బార్ కోసం లైసెన్స్ తీసుకుని మూడు బార్లను నిర్వహిస్తుంటే మీ నిఘా ఏమైంది. మద్యం దుకాణదారులు సిటింగ్ రూముల నిర్వహణలో...
ముంబై పోలీసులు ఇక్కడికొచ్చి డ్రగ్స్‌పట్టుకునే వరకు మీరేం చేస్తున్నారు?
ఎక్సైజ్ అధికారులకు మంత్రి జూపల్లి ప్రశ్నలు
పరిశ్రమలు, రైస్ మిల్లులపై నిఘాకు ఆదేశం
హైదరాబాద్, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): ‘ఒక్క బార్ కోసం లైసెన్స్ తీసుకుని మూడు బార్లను నిర్వహిస్తుంటే మీ నిఘా ఏమైంది. మద్యం దుకాణదారులు సిటింగ్ రూముల నిర్వహణలో నిబంధనలు పాటించకున్నా.. మీరెందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు.. చర్యలెందుకు తీసుకోవట్లేదు..? అక్కడ గంజాయి.. ఇక్కడ డ్రగ్స్ దొరికాయని రోజుకో కేసు పెడుతున్నారే.. మరి ఎన్ని కేసుల్లో నిందితులకు శిక్షలు పడ్డాయి’అని మంత్రి జూపల్లి కృష్ణారావు ఎక్సైజ్‌శాఖ అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. శనివారం హైదరాబాద్‌లోని ఎక్సైజ్ భవన్‌లో మంత్రి సమీక్ష జరిపారు. డ్రగ్స్ మాఫియాను గుర్తించడంలో ఎక్సైజ్ నిఘా వర్గాలు వైఫల్యం చెందాయని మండిపడ్డారు. చర్లపల్లి ఘటనపై స్పందిస్తూ.. ముంబై పోలీసులు వచ్చి ఇక్కడ డ్రగ్స్ పట్టుకునే వరకు మీరేం చేశారని నిలదీశారు. ప్రజల ప్రాణాలను కాపాడటం ప్రభుత్వ బాధ్యతని.. ఇందులో అలసత్వం వహించొద్దని జూపల్లి వ్యాఖ్యానించారు. నల్లబెల్లం తయారీ కేంద్రాలు, నాచారం, చర్లపల్లి వంటి పారిశ్రామిక ప్రాంతాల్లోని పరిశ్రమలను తనిఖీ చేయాలని ఆదేశించారు. ఫామ్‌హౌ్‌సలు, ఖాళీగా ఉన్న, మూతపడిన రైస్ మిల్లులపై ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. గంజాయి, సింథటిక్ డ్రగ్స్ తయారీ, రవాణాపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని చెప్పారు. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్‌లకు ఆయుధాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. దసరా తర్వాత కొత్త మద్యం దుకాణాలకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. ఎక్సైజ్‌శాఖ శాఖ పట్టుకున్న బెల్లాన్ని రైతులకు సేంద్రియ ఎరువుల తయారీకి ఇవ్వడానికి మార్గదర్శకాలు రూపొందించాలన్నారు. నాన్ డ్యూటీపెయిడ్ లిక్కర్‌ను ధ్వంసం చేయకుండా.. వినియోగించుకోవడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు.