Minister Ponguleti: జర్నలిస్టులకు న్యాయం చేసేలా జీవోను సవరిస్తాం
ABN , Publish Date - Dec 31 , 2025 | 05:00 AM
అక్రెడిటేషన్ కార్డుల విషయంలో డెస్క్ జర్నలిస్టులు ఎలాంటి అపోహలకు గురికావద్దని, అందరికీ న్యాయం జరిగేలా జీవో 252ను సవరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు.
త్వరలోనే జర్నలిస్టు సంఘాలతో సమావేశమవుతాం
టీడబ్ల్యూజేఎఫ్, డీజేఎ్‌ఫటీ ప్రతినిధులతో మంత్రి పొంగులేటి
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ/రాంనగర్, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): అక్రెడిటేషన్ కార్డుల విషయంలో డెస్క్ జర్నలిస్టులు ఎలాంటి అపోహలకు గురికావద్దని, అందరికీ న్యాయం జరిగేలా జీవో 252ను సవరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. అక్రెడిటేషన్ కార్డులకు, మీడియా కార్డులకు ఎలాంటి తేడా లేదని, ప్రభుత్వ పరంగా అందే ప్రతీ ప్రయోజనం.. మీడియా కార్డు దారులకూ వర్తిస్తుందని స్పష్టం చేశారు. సచివాలయంలో మంగళవారం టీడబ్ల్యూజేఎఫ్, డీజేఎ్‌ఫటీ ప్రతినిధులు మంత్రి పొంగులేటిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ జీవో.. జర్నలిస్టుల్లో విభజన తెచ్చేలా ఉందని, అక్రెడిటేషన్ల సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉందని వివరించారు. ఈ మేరకు స్పందించిన మంత్రి.. జీవో 252పై డెస్క్ జర్నలిస్టులు ఆందోళన చెందొద్దని, తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే అన్ని జర్నలిస్టుల సంఘాలతో సమావేశం నిర్వహిస్తామని, ఆ సమావేశానికి డెస్కు జర్నలిస్టులనూ ఆహ్వానిస్తామని తెలిపారు. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని జర్నలిస్టులకు మరింత ప్రయోజనం చేకూరేలా జీవో 252లో మార్పులు చేస్తామని స్పష్టం చేశారు. మంత్రిని కలిసిన వారిలో టీడబ్ల్యూజేఎఫ్ ఉపాధ్యక్షుడు రాజశేఖర్, డీజేఎ్‌ఫటీ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఉపేందర్, ఎస్‌కే మస్తాన్ తదితరులున్నారు. అలాగే, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ, తెలంగాణ జర్నలిస్టు సంఘాల జేఏసీ కన్వీనర్ మామిడి సోమయ్య నేతృత్వంలో వేర్వేరు బృందాలు సైతం మంత్రి పొంగులేటికి వినతిపత్రాలు సమర్పించాయి..