Share News

Minister Ponguleti : అంగుళం కూడా అన్యాక్రాంతం కానివ్వం

ABN , Publish Date - Dec 16 , 2025 | 04:38 AM

హౌసింగ్‌ బోర్డు భూముల పరిరక్షణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని అధికారులను రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణశాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు....

Minister Ponguleti : అంగుళం కూడా అన్యాక్రాంతం కానివ్వం

  • హౌసింగ్‌ బోర్డు భూములు పరిరక్షిస్తాం: మంత్రి పొంగులేటి

హైదరాబాద్‌, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): హౌసింగ్‌ బోర్డు భూముల పరిరక్షణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని అధికారులను రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణశాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. అంగుళం భూమి కూడా అన్యాక్రాంతం కావడానికి వీల్లేదని స్పష్టం చేశారు. సచివాలయంలో సోమవారం హౌసింగ్‌ బోర్డు భూముల లీజు వివాదాలు, కోర్టు కేసులు, ఒప్పందాలు, అద్దెలు తదితర అంశాలపై సుదీర్ఘంగా సమీక్షించారు. లీజు భూములు, దుకాణాల క్రమబద్ధీకరణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి పొంగులేటి ఆదేశించారు. లీజు అగ్రిమెంట్‌ పునరుద్ధరించుకోని సంస్థలకు బోర్డు తరపున లేఖలు రాసి వాటి క్రమబద్ధీకరణకు అవకాశం ఇవ్వాలని సూచించారు. దుకాణ యజమానులు ఆయా దుకాణాలను కొనుగోలు చేయడానికి ముందుకొస్తే వాటి విక్రయానికవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని, దుకాణాల నిర్వహణకు అనువుగా లేకుంటే వేలంలో ఆ స్థలం విక్రయించాలని తెలిపారు. హౌసింగ్‌ బోర్డు భూములపై గల కోర్టు వివాదాల్లో బోర్డుకు ఆ భూములు చెందేలా న్యాయ పోరాటం చేయాలన్న మంత్రి పొంగులేటి.. అందుకు అధికారులు సమర్థులైన న్యాయవాదులను నియమించుకోవాలన్నారు. గతంలో కేటాయించిన ఇళ్ల పక్కనే వందగజాల్లోపు స్థలాలను సదరు ఇంటి యజమాని కొనుక్కోవడానికి ఆసక్తి చూపితే విక్రయించాలని సూచించారు. దీంతోపాటు ఇంటికోసం కేటాయించిన స్థలం రిజిస్ట్రేషన్‌ చేయించుకోని వారూ పక్కన స్థలం కొనుగోలు చేస్తే మొత్తం ఒకే దఫా రిజిస్ట్రేషన్‌ చేసుకునేలా చూడాలన్న మంత్రి పొంగులేటి.. దీనిపై పూర్తిస్థాయి నివేదికనిస్తే క్యాబినెట్‌లో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో పాల్గొన్న అధికారులు మాట్లాడుతూ.. నిజాం హయాం నుంచి 115 సంస్థలకు హౌసింగ్‌ బోర్డు భూములను లీజుకిచ్చారని, వాటిలో కొన్ని సంస్థలు, ఇళ్లు, వాణిజ్య సముదాయాలు, పాఠశాలలు, దేవాలయాలున్నాయన్నారు. ఏడు స్థలాలపై కోర్టు కేసులు, అద్దె బకాయిలున్నాయని చెప్పారు. వివిధ ప్రాంతాల్లో బోర్డుకు 301 దుకాణాలుండగా, 2007లో నాటి సర్కారు అవకాశం ఇవ్వడంతో 14 మంది దుకాణాలు కొనుగోలు చేశారని మంత్రి పొంగులేటికి అధికారులు వివరించారు. మిగతా 287 దుకాణాల్లో 62 ఖాళీగా ఉన్నాయన్నారు. హౌసింగ్‌ బోర్డు నిబంధన ప్రకారం ప్రతి ఏటా దుకాణా దారు 10ు అద్దె పెంచుతూ లీజు పునరుద్దరించుకోవాల్సి ఉంటుంది. కానీ, ఆ నిబంధనను అమలు చేయకపోవడంతో దుకాణ యజమానుల నుంచి రూ.కోట్లలో అద్దె రావాల్సి ఉందని కలెక్టర్‌కు వివరించారు.

Updated Date - Dec 16 , 2025 | 04:38 AM