Minister Ponguleti Srinivas: సర్వీస్ రోడ్ల నిర్మాణ సమస్యలను పరిష్కరిస్తాం
ABN , Publish Date - Sep 26 , 2025 | 07:08 AM
గ్రీన్‌ఫీల్డ్ హైవేలో సర్వీస్ రోడ్ల నిర్మాణపరంగా ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని రాస్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి...
భూసేకరణ పరిహారం సకాలంలో రైతులకు చెల్లింపు..
గ్రీన్‌ఫీల్డ్ హైవే పనుల పరిశీలనలో మంత్రి పొంగులేటి
ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అవినీతిని ఉపేక్షించేది లేదు
వైరా, కల్లూరు, కూసుమంచి, హైదరాబాద్, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): గ్రీన్‌ఫీల్డ్ హైవేలో సర్వీస్ రోడ్ల నిర్మాణపరంగా ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని రాస్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రైతులకు హామీ ఇచ్చారు. నేషనల్ హైవే ప్రాజెక్టు పరిధిలో భూములను కోల్పోయే రైతుల భాధను ప్రభుత్వం సున్నితంగా పరిగణిస్తోందని.. రైతుల భూ హక్కులకే మొదటి ప్రాధాన్యం ఉంటుందని హామీ ఇచ్చారు. భూములు కోల్పోయిన రైతులను ఇబ్బందులు పెట్టకుండా అందుబాటులో ఉన్న స్థలంలో అప్రోచ్ రోడ్డు నిర్మించాలని హైవే అధికారులను కోరారు. భూసేకరణకు సంబంధించిన పరిహారాన్ని సకాలంలో రైతులకు అందించాలన్నారు. గురువారం సాయంత్రం మంత్రి.. వైరా, తల్లాడ, పెనుబల్లి మండలాల పరిధిలో గ్రీన్‌ఫీల్డ్ హైవే రోడ్డు నిర్మాణపనులు పరిశీలించారు. కల్లూరు మండలం ముత్తగూడెం వద్ద ఎంట్రీ నుంచి వైరా ఎగ్జిట్ వరకు ఆయన ప్రయాణించి పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతి 5 కి.మీలకు ఒక అధికారిని నియమించి ఎన్‌హెచ్ డ్రెయినేజీ వ్యవస్థను పరిశీలిస్తామని.. రైతుల సమస్యలు పరిష్కరించిన తర్వాతే ఎన్‌వోసీ జారీ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. గ్రీన్‌ఫీల్డ్ హైవేలో నిర్మాణంలో భాగంగా ముత్తగూడెం, రేజర్ల, పెనుబల్లి, లింగాల, కల్లూరు, వైరా ప్రాంతాల్లో గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి అనంతరం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో సమీక్షించారు. కాగా, బతుకమ్మ వేడుకల సందర్భంగా ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పెరికశింగారంలో 54అడుగుల భారీ బతుకమ్మను పేర్చారు.
ఇందుకు ఏడుక్వింటాళ్ల బంతి, టేకు, తంగేడు, గునుగు పూలను వినియోగించారు. ఈ బతుకమ్మ పేర్చేందుకు 25 మంది పదిగంటల పాటు శ్రమించారు. పెరికశింగారంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. మరోవైపు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, చెల్లింపుల విషయంలో అవినీతికి పాల్పడినా.. నిరుపేదలైన లబ్ధిదారుల నుంచి పైసా వసూలు చేసినా సహించబోమని హెచ్చరించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్థిదారుల నుంచి లంచం డిమాండ్ చేసిన సంగారెడ్డి జిల్లాలోని పంచాయితీ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆయన ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా మాజిద్‌పూర్ గ్రామ కార్యదర్శిపై పూర్తి విచారణకు ఆదేశించామన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా తాండూరు మండలంలో ఇందిరమ్మ కమిటీసభ్యుడిపై క్రిమినల్ కేసు నమోదు చేశామని తెలిపారు.. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో పేదలను ఇబ్బందిపెట్టి డబ్బుల వసూళ్లకు పాల్పడితే ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే చర్యలు తీసుకుంటామని ఆ ప్రకటనలో మంత్రి చెప్పారు. కాల్ సెంటర్‌కు వచ్చి న ఫిర్యాదును తక్షణం ఆయా జిల్లా కలెక్టర్, ఎస్పీకి పంపడంతోపాటు, సచివాలయంలోని తన కార్యాలయానికి కూడా పంపించాలని అధికారులకు సూచించామని వివరించారు. లంచమడిగితే టోల్ ఫ్రీ నం. 18005995991కు కాల్ చేసి ఫిర్యాదు చేస్తే 24 గంటల్లో చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.