Minister Ponguleti: రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు
ABN , Publish Date - Oct 30 , 2025 | 05:03 AM
రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార...
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
రహ్మత్‌నగర్‌లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం
బోరబండ, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 4 లక్షలకు పైగా ఇళ్లు మంజూరు చేశామని, వాటిలో 3 లక్షలకు పైగా ఇళ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా రహ్మత్ నగర్ డివిజన్ కార్మికనగర్‌లో మంత్రి పొంగులేటి బుధవారం పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణ ప్రాంతాల్లోని పేదలకు ప్రయోజనం కలిగేలా ఇందిరమ్మ ఇళ్ల నిబంధనలను సడలించినట్లు తెలిపారు. గత పదేళ్లుగా పేదల కోసం ఒక్క చిన్న ఇల్లు కూడా కట్టని కేసీఆర్.. కమీషన్లపై ఆశతో కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను కట్టారని ఆరోపించారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలో అర్హులైన పేదలందరికీ పట్టాలిచ్చి ఇండ్లు కట్టిస్తామని ప్రకటించారు. అంతేగాక గత ప్రభుత్వ హయాం నుంచి అసంపూర్తిగా ఉండిపోయిన డబుల్ బెడ్రూం ఇండ్లను పూర్తిచేసి పేదలకు ఇస్తామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రె్‌సలో చేరిన 400 మందికి ప్రాతినిధ్యం వహిస్తున్న చేపల కృష్ణ, ఆనందరావు, ఫిలిం ఫెడరేషన్ నాయకుడు బసాడ కృష్ణ, లక్ష్మి తదితరులకు కాంగ్రెస్ కండువాలు కప్పి మంత్రి పార్టీలోకి స్వాగతించారు. ఓవైపు వర్షం పడుతున్నా మంత్రి తన ప్రచారాన్ని కొనసాగించారు. భారీవర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా పెద్దఎత్తున ప్రజలు తరలి వచ్చి నృత్యాలు, బాణాసంచాతో మంత్రి పొంగులేటికి స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బాలు నాయక్, బీర్ల ఐలయ్య, వేముల వీరేశం, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, కార్పొరేషన్ల చైర్మన్లు మల్‌రెడ్డి రాంరెడ్డి, ఒబేదుల్లా కొత్వాల్, పటేల్ రమేష్ రెడ్డి, జెరిపెటీ జైపాల్, మందుముల పరమేశ్వర్ రెడ్డి, డివిజన్ కార్పొరేటర్ సి.ఎన్.రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, పెద్దసంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.