Khammam District: అనుచరుడి పాడె మోసిన మంత్రి పొంగులేటి
ABN , Publish Date - Dec 21 , 2025 | 07:20 AM
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన తన అనుచరుడు యడవల్లి రాంరెడ్డి(55)కి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కన్నీటి వీడ్కోలు పలికారు.
కూసుమంచి, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన తన అనుచరుడు యడవల్లి రాంరెడ్డి(55)కి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కన్నీటి వీడ్కోలు పలికారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు యడవల్లి రాంరెడ్డి బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా..శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. రాంరెడ్డి కుమారుడు జాంబియా దేశంలో ఉండటంతో ఆయన రావడం ఆలస్యమైంది. దీంతో మంత్రి పొంగులేటి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. తొలి నుంచి తన ప్రధాన అనుచరుడిగా ఉన్న రాంరెడ్డి పాడెను మోశారు. కార్యకర్తలు, నాయకులతో కలిసి శ్మశాన వాటిక వరకు నడిచి భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడారు. నిబద్ధత కలిగిన నాయకుడిని పార్టీ కోల్పోయిందని అన్నారు. తన రాజకీయ ప్రయాణంలో రాంరెడ్డి పాత్ర మరచిపోలేనిదని, ఆయన కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.