Minister Komatireddy: డీసీసీ అధ్యక్షుడిగా కైలాష్ సరికాదు
ABN , Publish Date - Nov 26 , 2025 | 04:38 AM
నల్లగొండ డీసీసీ అధ్యక్షుడిగా పున్న కైలాష్ నేత సరికాదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. డీసీసీ బాధ్యతల నుంచి కైలా్‌షను తప్పించి, సమర్థులకు అవకాశం ఇవ్వాలని కోరారు. డీసీసీ అధ్యక్షుడిగా తాజాగా నియమితులైన.....
అతడిని తప్పించండి.. సమర్థులకు అవకాశమివ్వండి.. తనను, తన కుటుంబ సభ్యులను దుర్భాషలాడారు
ఆ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు
సీఎం, పీసీసీ చీఫ్, ఏఐసీసీ నేతలకు మంత్రి కోమటిరెడ్డి ఫిర్యాదు.. మంత్రివర్గ సమావేశంలోనూ ప్రస్తావన
నల్లగొండ, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నల్లగొండ డీసీసీ అధ్యక్షుడిగా పున్న కైలాష్ నేత సరికాదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. డీసీసీ బాధ్యతల నుంచి కైలా్‌షను తప్పించి, సమర్థులకు అవకాశం ఇవ్వాలని కోరారు. డీసీసీ అధ్యక్షుడిగా తాజాగా నియమితులైన కైలాష్ తనను, తన కుటుంబ సభ్యులను అవమానించే రీతిలో అకారణంగా దుర్భాషలాడిన వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని వెంకటరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, పీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌గౌడ్‌కు లేఖలు రాశారు. ఆ వీడియోలను, వాటి సమాచారాన్ని సైతం పెన్‌డ్రైవ్‌ల ద్వారా అందజేశారు. కైలాష్ గతంలో తనను ఇలాగే దూషించినా తాను ఏమీ అనలేదని, ఇప్పుడు బాధ్యత కలిగిన పదవిలోకి వచ్చిన తర్వాత కూడా అసభ్యకర పదజాలంతో ఉన్న వీడియోలను వైరల్ చేయించడం తనకు ఆవేదన కలిగించిందని వెంకటరెడ్డి పేర్కొన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నారు. కైలా్‌షపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, అతడిని డీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పించి, సమర్థులకు అవకాశం ఇవ్వాలని సీఎంకు రాసిన లేఖలో కోరారు. తన రాజకీయ జీవితంలో ఏనాడూ ఎవరిపైనా వ్యక్తిగతంగా కక్ష సాధింపు ధోరణికి పాల్పడలేదని, అయిదుసార్లు ఎమ్మెల్యేగా, ఒక పర్యాయం ఎంపీగా గెలిచానని, తెలంగాణ కోసం నాడు మంత్రి పదవిని త్యజించానని పేర్కొన్నారు. మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ వెంకటరెడ్డి ఈ అంశాన్ని ప్రస్తావించి ఆవేదన వ్యక్తం చేయగా సీఎం, ఇతర మంత్రులు సముదాయించినట్లు తెలిసింది. కాగా, మంత్రి ఫిర్యాదును సీఎం, పీసీసీ చీఫ్ సీరియ్‌సగా తీసుకున్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. డీసీసీ బాధ్యతల విషయంలో ఏం చేయాలనే అంశంపై జిల్లా ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని స్థానికంగా చర్చ సాగుతోంది. పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన సందర్భంలో డీసీసీ అధ్యక్ష వ్యవహారంపై రాజకీయ రచ్చ రేగడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మంత్రి వెంకటరెడ్డి స్వయంగా ఫిర్యాదు చేయడంతో ఈ విషయంపై మాట్లాడేందుకు, ప్రస్తావించేందుకు ఇతర నేతలెవరూ సుముఖత చూపలేదు. సీఎం, పార్టీ అధిష్ఠానమే నిర్ణయం తీసుకుంటుందని పేర్కొంటున్నారు. ఈ విషయమై కైలా్‌షను ‘ఆంధ్రజ్యోతి’ సంప్రదించగా తాను మంగళవారం ఉదయం మంత్రి వెంకటరెడ్డిని కలిసి క్షమాపణ కోరానని తెలిపారు. పెద్ద మనసుతో తనను క్షమించాలని, నల్లగొండ జిల్లాలో ఆయన సూచనలు, సలహాల మేరకు పనిచేస్తానని తెలిపానని చెప్పారు.