Minister Komatireddy: కృష్ణా జలాలపై కేసీఆర్ అసత్య ప్రచారం
ABN , Publish Date - Dec 29 , 2025 | 01:53 AM
కృష్ణా జలాలపై మాజీ సీఎం కేసీఆర్ అసత్య ప్రచారాలు చేస్తున్నాడని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు.
ముందు కూతురు కవిత లెక్కలకు సమాధానం చెప్పాలి
రేవంత్‌రెడ్డే మళ్లీ సీఎం అవుతారు
నల్లగొండ యువ చైతన్య ర్యాలీలో మంత్రి కోమటిరెడ్డి
నల్లగొండ, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కృష్ణా జలాలపై మాజీ సీఎం కేసీఆర్ అసత్య ప్రచారాలు చేస్తున్నాడని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. తాను అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ఏపీ రాష్ట్ర సీఎం జగన్‌కు వత్తాసు పలికి తెలంగాణకు అన్యాయం చేశాడని మండిపడ్డారు. 24 నెలలుగా ఫాంహౌ్‌సకే పరిమితమైన కేసీఆర్‌కు దమ్ముంటే అసెంబ్లీకి రావాలని సవాల్ చేశారు. రెండేళ్ల తర్వాత తమ ప్రభుత్వ లెక్కలు చూస్తానంటున్న కేసీఆర్.. ముందు ఆయన కూతురు కవిత అడిగిన లెక్కలకు సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీపీసీసీ ఉపాధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నల్లగొండలో భారీ యువ చైతన్య ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కోమటి రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ అధికారంలో ఉన్న పదేళ్లు ఎస్‌ఎల్‌బీసీని పట్టించుకోలేదని, తమ ప్రభుత్వం రెండేళ్లలో పూర్తి చేస్తుందన్నారు. రాష్ట్రంలో మూడేళ్ల తర్వాత మళ్లీ రేవంత్ రెడ్డే సీఎం అవుతారని స్పష్టం చేశారు. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం త్యాగాలు చేశారని, 3 సార్లు ప్రధాని పదవి చేపట్టే అవకాశం వచ్చినా సోనియా గాంధీ దేశ శ్రేయస్సు కోసం విలువైన సలహాలిచ్చారని కోమటి రెడ్డి చెప్పారు. సోనియాగాంధీ ఆలోచన నుంచి వచ్చిన ఉపాధి హామీ పథకంలో మహత్మాగాంధీ పేరును తొలగించాలని చూడటం అత్యంత దుర్మార్గమని విమర్శించారు. కాగా, ఎన్జీ కళాశాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో పాదయాత్రగా మొదలైన ప్రదర్శన.. రామగిరి, బస్టాండ్ మీదుగా క్లాక్ టవర్ కూడలి వరకూ సాగింది.