Tourism and Cultural Minister Jupalli Krishna Rao: మరింత జోరుగా.. ఉత్సాహంగా!
ABN , Publish Date - Nov 04 , 2025 | 03:12 AM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రచార జోరు పెంచారు...
ప్రచారంలో దూసుకెళ్తున్న మంత్రి జూపల్లి
హైదరాబాద్, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రచార జోరు పెంచారు. బస్తీలు, కాలనీలు, గేటేడ్ కమ్యూనిటీ ప్రాంతాల్లో సోమవారం తిరుగుతూ ఆరు గ్యారంటీలను వివరిస్తూ ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. ఇంటింటికెళ్లిన మంత్రి జూపల్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పలు కాలనీలు, బస్తీల్లో ప్రజలు తమకు ఘన స్వాగతం పలుకుతున్నారని ఆయన తెలిపారు. రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అధోగతి పాల్జేసిందని, పలు అరాచకాలకు పాల్పడిన బీఆర్‌ఎ్‌సకు మరోసారి ఓటుతో బుద్ది చెప్పాలని జూపల్లి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపిస్తే జూబ్లీహిల్స్‌లో చేపట్టనున్న అభివృద్థి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. సుల్తాన్ నగర్ లోని కల్పతరు రెసిడెన్సీ వాసులను కలిసి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించాలని కోరారు. స్సోర్ట్స్ లాంజ్‌కెళ్లి జిమ్‌లో వ్యాయమం చేసి, అక్కడి వారితో కలిసి షటిల్ ఆడారు. అటుపై ఎర్రగడ్డ డివిజన్‌లో రాజీవ్ నగర్ కాలనీ, జయంతి నగర్, కళ్యాణ్ నగర్ వెంచర్-3ల్లో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తమ ప్రజా ప్రభుత్వం అభివృద్థి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని వివరించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపిేస్త అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తామని పేర్కొన్నారు. మంత్రి జూపల్లి వెంట డెయిరీ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి తదితరులున్నారు.