Minister Jupalli Challenges: కాంగ్రెస్‌కు మళ్లీ అధికారంపై చర్చకు సిద్ధమా?
ABN , Publish Date - Sep 30 , 2025 | 05:27 AM
కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తదో రాదోనని తానన్నట్లు అసత్య ప్రచారం చేస్తున్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో మీడియా సాక్షిగా బహిరంగ చర్చకు రావాలని రాష్ట్ర ...
కేటీఆర్‌కు మంత్రి జూపల్లి సవాల్
కేటీఆర్‌కు ధైర్యం ఉంటే నిజం చెప్పాలని సూచన
హైదరాబాద్, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తదో రాదోనని తానన్నట్లు అసత్య ప్రచారం చేస్తున్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో మీడియా సాక్షిగా బహిరంగ చర్చకు రావాలని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ చేశారు. ‘ఆయన వ్యాఖ్యల్లో పస లేదు. అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఆ వ్యాఖ్యలపై చర్చకు సిద్ధమా..? నేను మీడియాతో వస్తా.. నేడు.. రేపు.. ఎల్లుండి.. ఎప్పుడు ఎక్కడికి రావాలో చెప్పండి’ అని సోమవారం రవీంద్ర భారతిలో మీడియాతో చెప్పారు. ‘నువ్వు చేసిన వ్యాఖ్యలు వాస్తవమని తేలితే నేను ఎమ్మెల్యే పదవికి, మంత్రి పదవికి రాజీనామా చేస్తా అని సవాల్ విసిరారు. నిజం మాట్లాడే ధైర్యం ఉంటే కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. కొల్లాపూర్‌లో 7సార్లు పోటీ చేస్తే 6సార్లు విజయం సాధించిన తాను.. ఏనాడూ హామీలివ్వలేదని, అభివృద్ధి చేసుకుంటూ వెళ్తానని, ప్రజలు అవసరాలు తీర్చడమే తన విశ్వసనీయత అని పేర్కొన్నారు. తాను అబద్దాలు చెప్పనని, హామీలివ్వకుండా అభివృద్ధి చేసి చూపుతానన్న జూపల్లి.. కేటీఆర్ మాత్రం తప్పుడు హామీలు, అబద్దాలతో రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని మండి పడ్డారు. వచ్చే పదేళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్‌దే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేసేందుకు ప్రయత్నించిందన్నారు. కానీ, 2023లో రేవంత్ రెడ్డి విసిరిన పంజాకు బీఆర్‌ఎస్ ఓటమి పాలైందని, స్థానిక ఎన్నికల్లో మరోసారి రేవంత్ పంజా సత్తా ఏమిటో కేటీఆర్‌కు తెలిసొస్తుందని చెప్పారు.