Minister Joopalli Krishna Rao: నా మాటలు వక్రీకరించారు
ABN , Publish Date - Sep 13 , 2025 | 05:22 AM
ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలో తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. గాంధీభవన్‌లో ఏర్పాటు...
హైదరాబాద్, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలో తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ మేరకు వివరణ ఇచ్చారు. ‘‘పోటీ చేసిన సందర్భంలో ఎవరు గెలుస్తరో తెలియదు. గెలిచిన పార్టీ అధికారంలోకి వస్తుందో రాదో తెలియదు. అధికారంలోకి వచ్చినా హమీలను నెరవేరుస్తామో లేదో తెలియదు. కాబట్టి నేను ఎలాంటి హామీలు ఇవ్వను. నిజాయితీగా కష్టపడి పనిచేస్తాను. నేను ఎన్నికల ప్రచారంలో ఏనాడూ హామీలు ఇవ్వలేదు. గెలిచిన తర్వాత అన్ని పనులూ చేశాను. నేను చేసిన పనులు చూసే ప్రజలు నన్ను ఆరు సార్లు గెలిపించారు’’ అని మాత్రమే తాను చెప్పానన్నారు. సందర్భాన్ని వదిలేసి బీఆర్‌ఎస్ పార్టీ సోషల్ మీడియా అసత్య ప్రచారం చేస్తోందని జూపల్లి ఆరోపించారు. ఎవరెంత అసత్య ప్రచారం చేసినా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పదేళ్లు అధికారంలో ఉండడం ఖాయమని చెప్పారు. ప్రభుత్వం రేపో, మాపో కూలిపోతుందంటూ కేటీఆర్ ఏ ప్రాతిపదికన అన్నారని ఆయన ప్రశ్నించారు. ఎవరూ ఏ పార్టీలోనూ చేరలేదని, ఎవరైనా పార్టీ మారితే స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని అన్నారు. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీకి సున్నా వచ్చిందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ కనుమరుగవుతుందని జూపల్లి జోస్యం చెప్పారు.