Share News

Minister Duddilla Sridhar Babu: దమ్ముంటే నిరూపించు చూద్దాం

ABN , Publish Date - Nov 23 , 2025 | 06:03 AM

హైదరాబాద్‌ ఇండ స్ట్రియల్‌ ల్యాండ్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ పాలసీపై బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు చేసిన విమర్శలను ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తిప్పికొట్టారు.

Minister Duddilla Sridhar Babu: దమ్ముంటే నిరూపించు చూద్దాం

  • మేము ఏ ప్రభుత్వ భూమినీ అమ్మకానికి పెట్టలేదు

  • 9,292 ఎకరాల్లో ప్లాట్లు వేసింది 4,740 ఎకరాల్లోనే

  • అవి పూర్తిగా ప్రైవేట్‌ భూములే

  • మీ ఫ్రీహోల్డ్‌ జీవోల వెనుక ఉన్న లక్షల కోట్ల మతలబేంటి?: దుద్దిళ్ల

హైదరాబాద్‌, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ ఇండ స్ట్రియల్‌ ల్యాండ్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ పాలసీపై బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు చేసిన విమర్శలను ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తిప్పికొట్టారు. దమ్ముంటే ఆధారాలతో నిరూపించాలని శనివారం ఒక ప్రకటనలో సవాల్‌ విసిరారు. ‘అబద్ధాలు ప్రచారం చేయడం బీఆర్‌ఎస్‌ నాయకులు కేటీఆర్‌, హరీశ్‌రావుకు వెన్నతో పెట్టిన విద్య. వారు పదేపదే చేస్తున్న రూ.5 లక్షల కోట్ల కుంభకోణం ఆరోపణలు పూర్తిగా నిరాధారం, అవాస్తవం. దమ్ముంటే ఆధారాలను బయటపెట్టి మాట్లాడాలి. లేదంటే ఈ ప్రచారం పచ్చి అబద్ధం, రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నదని ఒప్పుకుని రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్‌ చేశారు.

మీరు తెచ్చిన జీవోల్లో మతలబేంటి?

తిమ్మిని బమ్మిని చేయడంలో కేటీఆర్‌, హరీశ్‌రావును మించినవారు మరొకరు లేరని శ్రీధర్‌బాబు మండిపడ్డారు. ‘మీరు 2023 ఆగస్టులో తెచ్చిన ఫ్రీహోల్డ్‌ జీవోల (19, 20, 21) వెనుక ఉన్న రూ. లక్షల కోట్ల మతలబు గురించి ముందు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పండి. పారదర్శకంగా రాష్ట్ర ఖజానాకు రూ.4 వేల కోట్ల నుంచి రూ.5 వేల కోట్ల వరకు ఆదాయాన్ని సమకూర్చేందుకు మేము ప్రయత్నిస్తుంటే... కుంభకోణాలు అలవాటైన బీఆర్‌ఎస్‌ నేతలకు మింగుడు పడటం లేదు.


సరిగ్గా గత అసెంబ్లీ ఎన్నికలకు నాలుగు నెలల ముందు.. ప్రభుత్వం నుంచి తీసుకున్న లీజు భూములకు ప్రీహోల్డ్‌ హక్కులు ఇచ్చి 100 - 200 శాతం ఛార్జీలు విధించి మీరు వసూలు చేద్దామనుకున్న రూ.లక్షల కోట్ల సంగతేంటి? ప్రభుత్వంతో సంబంధం లేని సీఎం రేవంత్‌రెడ్డి సోదరులపై ఆరోపణలు చేేస్త రాష్ట్ర ప్రజలు నమ్ముతారనే భ్రమ నుంచి ముందు బయటకు రండి’ అని మంత్రి శ్రీధర్‌ బాబు సూచించారు. రాష్ర్టానికి పెట్టుబడులు రాకుండా, యువతకు ఉద్యోగాలు దక్కకుండా బీఆర్‌ఎస్‌ నేతలు అడ్డుకుంటున్నారని విమర్శించారు. వాస్తవాలను దాచిపెట్టి ప్రభుత్వం 9,292 ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టిందని తమపై దుష్ప్రచారం చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ భూముల్లో పరిశ్రమలకు ప్లాటింగ్‌ చేసిన ప్రాంతం (ఫ్రీహోల్డ్‌ ప్రాపర్టీ) 4,740 ఎకరాలేనని, ఇవి పూర్తిగా ప్రైవేట్‌ వ్యక్తులకు చెందిన భూములని స్పష్టం చేశారు. మిగిలిన భూములు రోడ్లు, డ్రైనేజీ లాంటి మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించామని తెలిపారు. ఇప్పటికైనా బీఆర్‌ఎస్‌ నేతలు నిజనిజాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు.

Updated Date - Nov 23 , 2025 | 06:03 AM