Minister Damodara Rajanarsimha: పూర్తిగా తగ్గుముఖం పట్టిన సీజనల్ వ్యాధులు
ABN , Publish Date - Oct 14 , 2025 | 02:55 AM
రాష్ట్రంలో గతేడాదితో పొల్చితే ఈసారి సీజనల్ వ్యాధుల ప్రభావం తక్కువగా ఉండటం అభినందనీయమని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర...
ఆయా కేసులు తగ్గడం అభినందనీయం: మంత్రి దామోదర
హైదరాబాద్, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గతేడాదితో పొల్చితే ఈసారి సీజనల్ వ్యాధుల ప్రభావం తక్కువగా ఉండటం అభినందనీయమని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖాన్ల పనితీరు, సీజనల్ వ్యాధుల నియంత్రణపై సోమవారం సచివాలయంలో ఆ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. గత రెండేళ్లతో పోల్చితే, ఈ ఏడాది డెంగీ, మలేరియా, టైఫాయిడ్ తదితర కేసులు గణనీయంగా తగ్గాయని హెల్త్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జెడ్ చొంగ్తూ, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, డాక్టర్ రవీంద్ర నాయక్ మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. మొత్తంగా చూసినప్పుడు కేసుల సంఖ్య తగ్గినప్పటికీ, గ్రేటర్ హైదరాబాద్, మరో నాలుగైదు జిల్లాల్లో స్వల్పంగా పెరిగాయన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత వ్యాధులు విజృంభించే ప్రమాదం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.