kumaram bheem asifabad- కొత్త పాలకవర్గంపై కోటి ఆశలు
ABN , Publish Date - Dec 20 , 2025 | 10:13 PM
పల్లెపోరు ముగిసింది. సోమవారం నుంచి కొత్త పాలకవర్గాలు అధికారికంగా కొలువుదీరనున్నాయి. కొత్త సర్పంచులపై ప్రజలెన్నో ఆశలు పెట్టుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులను గ్రామాభివృద్ధికి వినియోగించి సమస్యలను పరిష్కరిస్తారని ఆసక్తి తో ఎదురుచూస్తున్నారు.
- పలు చోట్ల పంచాయతీలకు సొంత భవనాలు కరువు
వాంకిడి, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): పల్లెపోరు ముగిసింది. సోమవారం నుంచి కొత్త పాలకవర్గాలు అధికారికంగా కొలువుదీరనున్నాయి. కొత్త సర్పంచులపై ప్రజలెన్నో ఆశలు పెట్టుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులను గ్రామాభివృద్ధికి వినియోగించి సమస్యలను పరిష్కరిస్తారని ఆసక్తి తో ఎదురుచూస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారంపై పాలకులు దృష్టిసారించాలని ప్రజలు కోరుకుంటున్నారు. సోమవా రం నుంచి అధికారికంగా పాలకవర్గ సభ్యులు కొలువుదీరనున్నారు. అధికారులు, పాలకవర్గాలు సమన్వయంతో పనిచేస్తే పల్లెలు త్వరగా అబివృద్ధి చెందుతాయి. గ్రామాలను పట్టిపీడిస్తున్న సమస్యలు దూరమై ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఇప్పటికే చాలా గ్రామాల్లో మురుగు కాల్వల నిర్మాణం, అంతర్గత రహదారులు, విద్యుత్తు దీపాలు, మరుగుదొడ్ల నిర్మాణాలు లేక పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. పల్లెల్లో నీరు కలుషితం కావడంతో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. పలు గ్రామాలకు వాగులు, ఒర్రెలపై వంతెనల నిర్మాణాలు లేక వర్షాకాలంలో ప్రజలుఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం - 2018 అమల్లోకి వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీలకు మరింత అధికారం, బాధ్య తలు చేకూరాయి. దీంతో కొత్త పాలకవర్గాలపై ప్రజలు కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు.
- వనరులపై దృష్టి సారించాలి..
పంచాయతీ పాలకవర్గాలు ఆదాయాన్ని సృష్టించడంపై దృష్టి సారించాలి. ఆదాయాన్ని పెంచె మార్గాలు అన్వేషించాలి. ప్రభుత్వ నిధులు కాకుండా స్వయంగా వనరులు రాబట్టేందుకు ప్రయత్నించాలి. అప్పుడే గ్రామాబివృద్ధి సాధ్యమవుతుంది. పంచాయతీ స్థలాల్లో వ్యాపార సముదాయాలు నిర్మించి అద్దేకు ఇవ్వడంవల్ల ఆదాయం పెరుగుతుంది. ఇంటి, కుళాయి, సంత వేళం ద్వారా వచ్చిన ఆదాయాన్ని గ్రామాబివృద్ధికి ఉపయోగించాలి. ఏశాఖద్వారా నిధులు మంజూరి అవుతున్నాయో ఆ నిధులను దుర్వినియోగం కాకుండా సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడే పంచాయతీల్లో నెలకొన్న సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంటుంది.
- వీటిపైనా దృష్టి అవసరం..
పల్లెల్లో ఎక్కువ మంది వ్యవసాయంపైనే ఆధా రపడి జీవిస్తుంటటారు. పంట సాగుకు నీటి సదుపాయాలు, విత్తనం, ఎరువులు, రుణం, విద్యు త్తు సౌకర్యాలు రైతులకు అందేలా చూడాలి. ప్రభు త్వం బాలలు, బాలింతలు, గర్భిణులకు పోషకాహా రం అందించడానికి నిర్వహిస్తున్న అంగన్‌వాడీ కేంద్రాలు, సమర్ధవంతంగా నడిచేలా పర్యవేక్షించాలి. పల్లెల్లోని సహజ వనరుల సంరక్షణ పంచాయతీ బాధ్యత. ముఖ్యంగగా జల, అటవీ వనరులను సంరక్షించుకోవాలి. ఇందుకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయాలి.
- నిధులులేక ముందుకు సాగక..
జిల్లాలోని 15 మండలాల్లోని 335 గ్రామ పంచాయతీలు ఉండగా ఇందులో 173 పాతవి, 162 కొత్తవి ఉన్నాయి. కానీ కొత్తవాటికి భవనాలు లేక ప్రస్తుతానికి పాఠశాల భవనాల్లో కొనసాగుతున్నా యి. పాతవి కొన్ని శిథిలావస్థకు చేరుకున్నాయి. కొత్తవాటికి భవనాలు మంజూ కాగా, కొన్ని అసంపూర్తి ధశలో, మరికొన్ని పనులు సాగుతున్నా యి. కొన్ని చోట్ల ఇప్పటివరకు పనులు మొదలు పెట్టని దుస్థితి ఉంది. ఫలితంగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవడంలో ఇబ్బందులు తప్పడంలేదు. గినిజన ప్రాంతాల్లో గ్రామాల్లో ఎస్టీ సబ్‌ప్లాన్, ఇతర సంక్షేమశాఖ ఆధ్వర్యంలో 51, ఇంతర ప్రాంతాల్లో జాతీయ ఉపాధిహామీ పథకం కింద 131 పంచాయతీలకు కొత్త భవనాలు మంజూ రయ్యాయి. ఒక్కో దానికి రూ. 20 లక్షల చొప్పున నిధులు కేటాయించారు. బిల్లులు సకాలంలో రాకపో వడంతో భవన నిర్మానాలు నత్తనడకన సాగుతున్నా యి.
పంచాయతీలకు ఆదాయ వనరులు ఇలా..
- కేంద్ర, రాష్ట్ర ఆర్థిక సంఘాల నిధులు, ఇంటిపన్ను, నల్లా పన్ను
- ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు
- జిల్లా, మండల పరిషత్తు నిధులు
- వార సంతల నిర్వహణ
- ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ నిధులు
- ఉపాధిహామీ పథకం నిధులు
- పర్‌క్యాపిటా గ్రాంట్
- పంచాయతీ పనితీరు ఆధారంగా ప్రత్యేక నిధులు