Millet Products: ఆహారంలో చిరుధాన్యాలు భాగం కావాలి
ABN , Publish Date - Apr 11 , 2025 | 05:23 AM
భారతదేశంలో చిరు ధాన్యాల (మిల్లెట్స్) ఉద్యమం పెరిగిపోతున్న నేపథ్యంలో, అవి ఆరోగ్యానికి అనుకూలమైనవి అని డాక్టర్ సంగీతా రెడ్డి పేర్కొన్నారు. మిల్లెట్ మార్వెల్స్ సంస్థతో కలిసి, 18 రకాల ఉత్పత్తులు విడుదల చేసినట్లు తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ ప్రకటించింది

అపోలో హాస్పిటల్స్ జాయింట్ ఎండీ డాక్టర్ సంగీత రెడ్డి
మిల్లెట్ మార్వెల్స్‌తో కలిసి చిరుధాన్యాల వ్యాపారంలోకి తెనాలి డబుల్ హార్స్
18 రకాల ఉత్పత్తుల విడుదల
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): భారతదేశంలో ఇప్పుడు చిరు ధాన్యాల(మిల్లెట్స్) ఉద్యమం జరుగుతోందని, ప్రతి ఒక్కరూ రోజూ తినే ఆహారంలో చిరుధాన్యాలను భాగం చేసుకోవాలని అపోలో ఆస్పత్రుల జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతా రెడ్డి పిలుపునిచ్చారు. చిరు ధాన్యాల్లో పోషకాలు అధికంగా ఉంటాయని, జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతాయని తెలిపారు. తెనాలి డబుల్ హార్స్ గ్రూప్, మిల్లెట్ మార్వెల్స్ అనే సంస్థతో కలిసి చిరుధాన్యాల వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో నూడిల్స్, గ్రెయిన్స్, రెడీ టు కుక్, రెడీ టు సర్వ్ అంటూ నాలుగు విభాగాల్లో 18 రకాల ఉత్పత్తులను విడుదల చేసింది. ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన డాక్టర్ సంగీతా రెడ్డి మాట్లాడుతూ.. మన పూర్వీకులు చిరుధాన్యాలనే ఆహారంగా తీసుకునే వారని, ఇప్పుడు అదే అలవాటును మనం కొనసాగించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అమెరికా నుంచి తాను తెప్పించిన క్వినోవాను చూసి తన అత్తగారు తైదలు, కొర్రలు లాగానే ఉన్నాయన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. చిరు ధాన్యాల స్వీకరణ సంస్కృతిని దేశానికి తిరిగి తీసుకురావడం అత్యవసరం అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 2023ను మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించారని, దానికి ఐదారేళ్ల ముందే డాక్టర్ భరత్ మిల్లెట్ మార్వెల్స్‌ను స్థాపించారని చెప్పారు. చిరు ధాన్యాల్లో ఫైబర్, సూక్ష్మ పోషకాలు అధికంగా ఉంటాయని, చిరుధాన్యాలను తీసుకోవడం అలవాటుగా మార్చుకోవాలని సూచించారు. సంక్రమణేతర వ్యాదుల సునామీ రాబోతున్న వేళ ఇది తప్పనిసరన్నారు. తన తండ్రి, అపోలో ఆస్పత్రుల చైర్మన్ డాక్టర్ ప్రతాప్ రెడ్డి 92 ఏళ్ల వయస్సులో ఉన్నారని, నిత్యం ఆహారంలో ఏదో ఒక పూట చిరు ధాన్యాలను తీసుకుంటారని చెప్పారు. ప్రతి రోజూ ఒకే తరహా చిరుధాన్యం కాకుండా మారుస్తూ తినడం వల్ల మెరుగైన ఫలితాలు చూడవచ్చని తెలిపారు.
ఇక, తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ సీఎండీ మోహన్ శ్యామ్ మాట్లాడుతూ.. మిల్లెట్ మార్వెల్స్‌తో కలిసి మిల్లెట్స్ వ్యాపారంలోకి 18 ఉత్పత్తులతో ప్రవేశించామని ప్రకటించారు. ఇందులో ఆరు రకాల నూడిల్స్, ఆరు రకాల గ్రెయిన్స్. రెడీ టు కుక్, రెడీ టు ఈట్ విభాగాలలో ఆరు రకాల ఉత్పత్తులను విడుదల చేశామని తెలిపారు. త్వరలో ఆర్గానిక్ ఉత్పత్తుల రంగంలో అడుగుపెడతామని చెప్పారు. ఈ-కామర్స్‌తో పాటు సూపర్ మార్కెట్‌లు, కిరాణా దుకాణాల్లో ఈ ఉత్పత్తులు రూ.85 ప్రారంభ ధరతో లభిస్తాయని చెప్పారు. మిల్లెట్ మార్వెల్స్ వ్యవస్థాపకులు డాక్టర్ భరత్ రెడ్డి మాట్లాడుతూ మిల్లెట్ మార్వెల్ కల ఈ రోజు నిజమైందని అన్నారు. చిరు ధాన్యాలు ప్రతి ఒక్కరికీ చేరువ కావాలనే లక్ష్యంతో మిల్లెట్ మార్వెల్స్ స్థాపించామని, కానీ దానిని ముందుకు తీసుకెళ్లేందుకు తమ శక్తి సరిపోలేదని చెప్పారు. కానీ దానిని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు తెనాలి డబుల్ హార్స్ వచ్చిందని అన్నారు. ఈ విభాగంలో మరిన్ని ఆవిష్కరణలు చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అనంధిత్ రెడ్డి, ఐఐఎంఆర్ డైరెక్టర్ దయాకర్, సినీ నిర్మాత దిల్ రాజు, తెనాలి డబుల్ హార్స్ సీఈవో యజుర్వేద్, సీఓఓ పుట్టా శేఖర్ తదితరులు పాల్గొన్నారు.