Highway Attack on Truck Drivers: అర్ధరాత్రి హైవేపై దొంగల హల్‌చల్!
ABN , Publish Date - Sep 30 , 2025 | 04:24 AM
అర్ధరాత్రి హైవే 161వ నంబర్ జాతీయ రహదారిపై దోపిడీ దొంగలు హల్‌చల్ చేశారు. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీ డ్రైవర్లనే లక్ష్యంగా చేసుకొని కత్తులతో...
ఆగి ఉన్న లారీల డ్రైవర్లే లక్ష్యంగా దాడులు
కత్తులతో బెదిరించి డబ్బులు దోచుకొని పరారీ..
అడ్డుకున్న ఓ డ్రైవర్‌కు కత్తిపోట్లు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
పటాన్‌చెరు. సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): అర్ధరాత్రి హైవే (161వ నంబర్ జాతీయ రహదారి)పై దోపిడీ దొంగలు హల్‌చల్ చేశారు. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీ డ్రైవర్లనే లక్ష్యంగా చేసుకొని కత్తులతో బెదిరించి వారి వద్ద దొరికిన కాడికి దోచుకుని ఉడాయించారు. ఈ క్రమంలోనే ప్రతిఘటించిన ఓ లారీ డ్రైవర్‌ను కత్తితో పొడవగా.. అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆదివారం రాత్రి సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పోలీ్‌సస్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ వనస్థలిపురం ప్రాంతానికి చెందిన లారీ డ్రైవర్ నూర్ షేక్.. సూరత్‌కు వెళ్లి వస్తుండగా రుద్రారం సమీపంలో లారీ ఆగిపోయింది. అయితే అతడి సమాచారంతో మేనేజర్ దేశ్‌ముఖ్ రాఘవేందర్ ఓ మెకానిక్‌ను తీసుకొచ్చి మరమ్మతులు చేయించాడు. ఇదే క్రమంలో రాఘవేందర్ లారీ క్యాబిన్‌లో నిద్రపోగా.. బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు అతడిపై దాడి చేసి రూ.5 వేలు లాక్కొని ఉడాయించారు. ముత్తంగి ఔటర్ వంతెన కింద లారీ ఆపిన మంచిర్యాలకు చెందిన లారీ డ్రైవర్ ఎండీ వసీంపై అనంతరం దాడికి పాల్పడ్డారు. అతడితో పాటే ఉన్న గుమస్తా తోటరాజు వద్ద రూ.15 వేలు నగదు లాక్కొని పరారయ్యారు. అంతకుముందుకు కొండాపూర్ వెంకటేశ్వర ఫంక్షన్ హాలు ఎదురుగా లారీ ఆపిన డ్రైవర్ ఆసిఫ్ (36)పై డబ్బుల కోసం ఆ ముగ్గురు దుండగులే దాడి చేశారు. అతడు ప్రతిఘటించడంతో కత్తితో పక్కటెముకల్లో పొడిచి పరారయ్యారు. తీవ్రగాయాలైన ఆసి్‌ఫను హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ సోమవారం సాయంత్రం మృతి చెందాడు. కాగా, వరుస దోపిడీలకు పాల్పడిన ముగ్గురు దుండగులను పటాన్‌చెరు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.