Midday Meal Workers Threaten Strike: సమస్యలు పరిష్కరించకుంటే.. డిసెంబరులో సమ్మె
ABN , Publish Date - Nov 25 , 2025 | 04:41 AM
సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించకుంటే డిసెంబరు చివరి వారం నుంచి సమ్మెకు దిగుతామని మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.....
ప్రభుత్వానికి ‘మధ్యాహ్న భోజన’ కార్మికుల హెచ్చరిక
ఖైరతాబాద్, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించకుంటే డిసెంబరు చివరి వారం నుంచి సమ్మెకు దిగుతామని మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఏఐటీయూసీఈ అనుబంధ తెలంగాణ మధ్యాహ్న భోజ న పథకం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు సోమవారం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ప్రాథమిక విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోల్‌సకు అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీఈ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎండీ యూసుఫ్, ఎం నరసింహ.. మధ్యాహ్న భోజన పథక యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.ప్రేమ్‌పావని, రవీందర్ మాట్లాడుతూ.. కార్మికులు సొంత డబ్బుతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెడుతుంటే, వారికి ప్రభుత్వం ఇస్తున్న చాలీచాలని రూ.3 వేల గౌరవ వేతనాన్ని కూడా పెండింగ్‌లో పెట్టడం సరికాదన్నారు. మధ్యాహ్న భోజన సరుకులను సర్కారే ఇవ్వాలని, లేదంటే ప్రతి విద్యార్ధికి మెనూ చార్జీగా రూ.25 చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీ మేరకు వంట కార్మికులకు రూ.10 వేల వేతనం చెల్లించాలని కోరారు.