Hyderabad Metro: మెట్రో ఆస్తుల బదిలీ తర్వాతే రెండో దశ డీపీఆర్‌కు ఆమోదం
ABN , Publish Date - Oct 12 , 2025 | 03:07 AM
ఎల్ అండ్ టీ నుంచి మొదటి దశ మెట్రో నిర్వహణను పూర్తిగా తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం వాటికి ఆస్తుల లెక్కలను తేల్చే పనిలో పడింది....
నెలాఖరులోగా ఆస్తుల మదింపు పూర్తి
ప్రత్యేక ఆడిటర్‌తో లెక్కలు తీస్తున్న ప్రభుత్వం
త్వరలో కేంద్రానికి ఆస్తుల బదిలీ పత్రం
హైదరాబాద్ సిటీ, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): ఎల్ అండ్ టీ నుంచి మొదటి దశ మెట్రో నిర్వహణను పూర్తిగా తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం వాటికి ఆస్తుల లెక్కలను తేల్చే పనిలో పడింది. ఇప్పటికే సదరు సంస్థతో టేకోవర్ ఒప్పందం కుదుర్చుకున్న ప్రభుత్వం ఆస్తుల మదింపు చర్యలను వేగవంతం చేసింది. ఇటీవల ప్రత్యేక ఆడిటర్‌ను నియమించింది. ఈ నెలాఖరులోగా మొదటి దశ మెట్రో వివరాలన్నీ సమగ్రంగా సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రెండో దశ మెట్రో మొదలు పెట్టాలంటే మొదటి దశను సొంతం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 162.5 కిమీ పరిధిలో 8 కారిడార్లతో రెండో దశను నిర్మాణానికి సిద్ధమైన ప్రభుత్వం.. రూ.43,848 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించింది. పార్ట్-ఏ కింద 5 కారిడార్లు, పార్ట్-బీ కింద 3 కారిడర్లను చేపట్టనుంది. వాటి సమగ్ర ప్రాజెక్టు నివేదికలను(డీపీఆర్) అనుమ తి కోసమే కొద్ది నెలల క్రితమే పంపినా మెట్రో మొదటి, రెండో దశ అనుసంధానంలో సమస్యతో ఇప్పటివరకు కేంద్రం డీపీఆర్‌ను పక్కనబెట్టింది. మొదటి దశను టేకోవర్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఆస్తుల బదిలీకి చట్టబద్ధమైన పత్రాన్ని కేంద్రానికి అందించాకేడీపీఆర్‌కు అనుమతి లభిస్తుందంటున్నారు. డీపీఆర్‌కు ఆమో దం లభిస్తేనే మెట్రో రెండో దశ మొదలవుతుంది. అందుకే, పభుత్వం యుద్ధప్రాతిపదికన అవసరమైన చర్యలు తీసుకుంటోంది.
వినియోగించుకోని భూములపై ఆరా
మొదటి దశ మెట్రోను నిర్మించిన ఎల్ అండ్ టీకి నాటి ప్రభు త్వం వివిధ ప్రాంతాల్లో 269 ఎకరాలిచ్చింది. డిపోల నిర్మాణానికి 212 ఎకరాలు వాడుకున్నారు. రవాణా ఆధారిత అభివృద్ధి(టీఓడీ) కోసం మిగిలిన 57 ఎకరాలు ఇచ్చారు. వాటిని వాణిజ్య అవసరాలకు వాడుకొని, వచ్చిన ఆదాయాన్ని మెట్రో నిర్వహణకు ఉపయోగించాలని సూచించారు. ఎల్ అండ్ టీ 18 ఎకరాలే ఇప్పటిదాకా వినియోగించుకుంది. మాదాపూర్, ఎర్రమంజిల్, పంజాగుట్ట, మూసారంబాగ్ దగ్గర మాల్స్ కట్టింది. మిగిలిన 39 ఎకరాలపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఆ భూములు ఎక్కడున్నాయి? వాటి విలువ ఎంత? వాటిలో ఏ వాణిజ్య వ్యాపారాలు చేసుకునే అవకాశం ఉంటుంది ? తదితర అంశా లపై అధ్యయనం చేస్తోంది. మెట్రోతో ఒప్పందంలో భాగంగా ఇప్పటికే సదరు సంస్థకు ఎంత మొత్తం ఇవ్వాలనే దానిపై స్పష్టత వచ్చింది. ఈ నేపథ్యంలో సంస్థ ఆస్తుల విలువను మదింపు చేస్తున్నారు. నెలాఖరులోగా మదింపు పూర్తి కావాలని, నివేదిక ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.