Lionel Messi: మెస్సీ వర్సెస్ సీఎం రేవంత్
ABN , Publish Date - Dec 11 , 2025 | 05:12 AM
ఫుట్‌బాల్ దిగ్గజం.. అర్జెంటీనాకు చెందిన లియోనెల్ మెస్సీ.. ది గోట్ ఇండియా టూర్-2025లో భాగంగా హైదరాబాద్ వస్తున్నారు....
13న ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్.. 20 నిమిషాల మ్యాచ్.. ఆఖరి 5 నిమిషాల్లో బరిలోకి రేవంత్, మెస్సీ
హైదరాబాద్, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): ఫుట్‌బాల్ దిగ్గజం.. అర్జెంటీనాకు చెందిన లియోనెల్ మెస్సీ.. ది గోట్ ఇండియా టూర్-2025లో భాగంగా హైదరాబాద్ వస్తున్నారు. డిసెంబరు 13వ తేదీ, శనివారం నాడు హైదరాబాద్ వస్తున్న మెస్సీ.. ఉప్పల్ స్టేడియంలో ఆ రోజు నిర్వహిస్తున్న ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తలపడనున్నారు. మెస్సీ హైదరాబాద్ పర్యటనకు సంబంధించిన వివరాలను ఆ టూర్ ప్రమోటర్ పార్వతిరెడ్డి బుధవారం విలేకరులకు వెల్లడించారు. మెస్సీ హైదరాబాద్‌కు వస్తున్న సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో 13వ తేదీన సింగరేణి ఆర్‌ఆర్-9, అపర్ణ జట్ల మధ్య ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్ ఉంటుందన్నారు. ఇందులో సింగరేణి జట్టు తరఫున రేవంత్ రెడ్డి, అపర్ణ జట్టు తరఫున మెస్సీ ఆడుతున్నారని వెల్లడించారు. రాత్రి ఏడు గంటలకు మొదలయ్యే మ్యాచ్ 20 నిమిషాల పాటు జరుగుతుందని, మ్యాచ్ చివరి ఐదు నిమిషాల్లో సీఎం రేవంత్, సాకర్ దిగ్గజం మెస్సీ తమ జట్ల తరఫున బరిలోకి దిగుతారని చెప్పారు. మ్యాచ్ అనంతరం ఇరు జట్లకు ‘ది గోట్ కప్’ను అందజేస్తామని తెలిపారు. మెస్సీతో పాటు స్టార్ ఆటగాళ్లు.. అర్జెంటీనాకు చెందిన రొడ్రిగో డి పాల్, ఉరుగ్వేకు చెందిన లూయీస్ సువారెజ్ కూడా ‘ది గోట్ కప్’ మ్యాచ్‌కు హాజరవుతారని ఆమె చెప్పారు. ఉప్పల్ స్టేడియంలో జరిగే ఈ ఫుట్‌బాల్ మ్యాచ్‌ను చూడాలనుకునే వారి కోసం డిస్ట్రిక్ట్ యాప్‌లో టికెట్లు అందుబాటులో ఉంచామని పార్వతిరెడ్డి తెలియజేశారు. టికెట్ ప్రారంభ ధర రూ.1,300 అని కార్పొరేట్ బాక్సుల్లోని టికెట్ల ధర రూ.22 వేల నుంచి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఆఫ్‌లైన్ విధానంలో టికెట్ల విక్రయం లేదని, ఆన్‌లైన్‌లో మాత్రమే కొనుగోలు చేయాలని ప్రేక్షకులకు సూచించారు. మ్యాచ్‌ను సోనీ లైవ్ ద్వారా స్ట్రీమింగ్ చేస్తున్నామని ప్రకటించారు. ఇక, 13వ తేదీ సాయంత్రం 5.30 గంటల నుంచి ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ నేతృత్వంలో స్టేడియంలో సంగీత విభావరి ఉంటుందని ఆమె తెలియజేశారు. ఈ ఫుట్‌బాల్ మ్యాచ్‌కు ప్రముఖ క్రికెటర్లతో పాటు, పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరవుతారని పార్వతి రెడ్డి చెప్పారు. టీమిండియా స్టార్ క్రికెటర్, హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ సిరాజ్‌ను మ్యాచ్‌కు ఆహ్వానించనున్నామని తెలిపారు. కాగా, మ్యాచ్‌కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని, పాస్‌లు ఉన్నవారిని మాత్రమే స్టేడియంలోకి అనుమతిస్తామని రాచకొండ సీపీ సుధీర్‌బాబు బుధవారం విలేకరులకు వెల్లడించారు.
ఆ 20 మందికి మెస్సీ సూచనలు
మెస్సీ హైదరాబాద్‌కు వస్తున్న సందర్భంగా ‘పుట్‌బాల్ చిల్డ్రన్ క్లినిక్’ కింద ఫుట్‌బాల్‌పై ఆసక్తితోపాటు ప్రతిభ కలిగిన రాష్ట్రానికి చెందిన 20 మంది పిల్లలను, నలుగురు కోచ్‌లను నిర్వాహకులు ఎంపిక చేశారు. అండర్ ప్రివిలేజ్డ్ విభాగంలో 10 మందిని, టాలెంటెడ్ విభాగంలో ఐదుగురిని, బై సర్టిఫికెట్స్ విభాగంలో ఐదుగురిని కలిపి మొత్తం 20 మంది పిల్లలను ఈ కార్యక్రమానికి ఎంపిక చేశారు. ఈ పిల్లలు, కోచ్‌లతో ప్రత్యేకంగా ముఖాముఖి అవ్వనున్న మెస్సీ, రొడ్రిగో, సువారెజ్.. వారికి ఆటకు సంబంధించి సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు.
మెస్సీ టూర్ ఇలా..
మెస్సీ శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వస్తారు. నాలుగు గంటలకు ఫలక్‌నుమా ప్యాలెస్ చేరుకుంటారు. కొద్దిసేపు విశ్రాంతి అనంతరం 4.30-5.10 గంటల వరకు మీట్ అండ్ గ్రీట్‌లో పాల్గొంటారు. 5.30 గంటలకు ఉప్పల్ స్టేడియం చేరుకుంటారు. 7.15గంటలకు సీఎం రేవంత్, మెస్సీ తమ జట్ల తరఫున బరిలోకి దిగుతారు.