Security Arrangements: మెస్సీ ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్ ఉప్పల్‌లో భద్రతా ఏర్పాట్ల పరిశీలన
ABN , Publish Date - Dec 08 , 2025 | 04:11 AM
ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 13న జరగనున్న ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ ఫుట్‌బాల్ మ్యాచ్ ఏర్పాట్లను ఆదివారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.....
హైదరాబాద్ /హైదరాబాద్ సిటీ/ఉప్పల్, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 13న జరగనున్న ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ ఫుట్‌బాల్ మ్యాచ్ ఏర్పాట్లను ఆదివారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, అడీషినల్ డీజీ విజయ్‌కుమార్‌తో కలిసి పరిశీలించారు. ఈ మ్యాచ్‌లో ప్రపంచ దిగ్గజ ఫుట్‌బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ సారథ్యంలోని జట్టు, సీఎం రేవంత్‌రెడ్డి జట్టుతో తలపడనుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ మ్యాచ్‌కు అంతర్జాతీయస్థాయి ఏర్పాట్లు చేస్తున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజలందరూ మ్యాచ్ సమాయానికి ముందుగానే స్టేడియంకు చేరుకుని పోలీసులకు సహకరించాలని కోరారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడేందుకు మెస్సీ రాష్ట్రానికి రావడం ఎంతో కీర్తి ప్రతిష్ఠలను తెచ్చిపెడుతుందన్నారు. మెస్సీ రాక తెలంగాణ రైజింగ్ ఉత్సవాలకు మరింత ఊపునిస్తుందన్నారు. ఈ సందర్భంగా స్టేడియం వద్ద భద్రతా ఏర్పాట్లను రాచకొండ సీపీ సుధీర్‌బాబు మంత్రులకు వివరించారు. దేశం నలుమూలల నుంచి భారీగా అభిమానులు వచ్చే అవకాశం ఉన్నందునా.. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు మంత్రులు దిశానిర్దేశం చేశారు.