Share News

Medical Student Loses Life: రోడ్డు దాటుతుండగా కారు ఢీ.. వైద్య విద్యార్థిని మృతి

ABN , Publish Date - Dec 16 , 2025 | 04:08 AM

హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి.. సోమవారం ఉదయం 7 గంటల సమయం.. ఎంబీబీఎస్‌ రెండో సంవత్సరం చదువుతున్న ఐశ్వర్య మహబూబ్‌నగర్‌లోని కాలేజీకి వెళ్లేందుకు బయల్దేరింది..

Medical Student Loses Life: రోడ్డు దాటుతుండగా కారు ఢీ.. వైద్య విద్యార్థిని మృతి

  • హయత్‌నగర్‌ ఆర్టీసీ కాలనీ వద్ద ఘటన

  • హైదరాబాద్‌-విజయవాడ హైవేపై ఫుట్‌ బ్రిడ్జిలు లేకపోవడమే కారణం

హయత్‌నగర్‌, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి.. సోమవారం ఉదయం 7 గంటల సమయం.. ఎంబీబీఎస్‌ రెండో సంవత్సరం చదువుతున్న ఐశ్వర్య మహబూబ్‌నగర్‌లోని కాలేజీకి వెళ్లేందుకు బయల్దేరింది.. తండ్రితో కలిసి హయత్‌నగర్‌ ఆర్టీసీ కాలనీ వద్ద రోడ్డు దాటుతోంది.. ఎల్బీనగర్‌ వైపు నుంచి అతివేగంగా దూసుకొచ్చిన కారు ఆ తండ్రీకూతుళ్లను బలంగా ఢీకొట్టింది. రోడ్డుపై ఎగిరిపడిన ఐశ్వర్య అక్కడికక్కడే మృతి చెందింది. తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. మెదక్‌ జిల్లా చిత్కుల్‌ గ్రామానికి చెందిన యంసాని పాండు 25 ఏళ్ల క్రితం కుటుంబంతో కలిసి హైదరాబాద్‌ వచ్చారు. హయత్‌నగర్‌లోని వినాయకనగర్‌ కాలనీ, రోడ్డు నంబరు 18లో అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఆయనకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు లండన్‌లో ఉం టుండగా.. కుమార్తె ఐశ్వర్య (19) ఎంబీబీఎస్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. సెలవులు ఉండడంతో గత గురువారం ఇంటికి వచ్చిం ది. సోమవారం తిరిగి కళాశాలకు వెళ్లేందుకు ఇంట్లో నుంచి తండ్రితో కలిసి బయలుదేరింది. ఇక్కడి నుంచి ఆమె మహబూబ్‌నగర్‌ వెళ్లాలంటే ఆరు వరుసల జాతీయ రహదారిని, రెండు సర్వీస్‌ రోడ్లను దాటి రోడ్డు అవతలి వైపునకు రావాలి. అలా వస్తున్న క్రమంలోనే ప్రమాదం జరిగింది. విజయవాడ వైపు అతి వేగంగా వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఐశ్వర్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఎడమ కాలు విరిగిన ఆమె తండ్రిని స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చేతికి అందిన కూతురు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. నిజానికి, వనస్థలిపురం ఆటో నగర్‌ నుంచి హయత్‌ నగర్‌ వరకూ రోడ్డుకు ఇరువైపులా పదుల సంఖ్యలో కాలనీలు ఉన్నాయి. వాటిలోని విద్యార్థులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ప్రతి రోజూ ఆరు వరుసల విజయవాడ హైవేను, రెండు సర్వీసు రోడ్లను అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో దాటాల్సి వస్తోంది. ముఖ్యంగా భాగ్యలత కాలనీ, ఆర్టీసీ కాలనీ వంటి ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు ఉదయం, సాయంత్రం రోడ్డు దాటాల్సి వస్తోంది. ఇది హైవే కావడంతో వాహనాలు అత్యంత వేగంగా వస్తున్నాయి. ఒకవేళ ఎనిమిది వరుసల రోడ్డు దాటినా సాఫీగా అటు వైపునకు చేరుకోవడానికి లేదు. రోడ్డు దాటకుండా ఇనుప కంచెలు పక్కాగా ఏర్పాటు చేయడమే ఇందుకు కారణం. దాంతో, పిల్లలు, పెద్దలు, మహిళలు అంతా ఆ బారికేడ్లను ఎక్కి దిగాల్సి వస్తోంది. ప్రజలు ఇంత ప్రయాస పడుతున్నా.. పత్రికల్లో కథనాలు వచ్చినా అవసరమైన చోట్ల అధికారులు ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు నిర్మించలేదు. ఆటోనగర్‌లో ఒకటి, హయత్‌నగర్‌ దాటాక మరొకటి నిర్మిస్తున్నా.. నిత్యం ప్రజలు ఎక్కువగా రోడ్డు దాటే భాగ్యలత కాలనీ, ఆర్టీసీ కాలనీల్లో ఎటువంటి ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు నిర్మించలేదు. ఇక ఈ ప్రాంతంలో యూ టర్న్‌ తీసుకోవాలన్నా నరకమే. రోడ్డు దాటాలన్నా, యూటర్న్‌ తీసుకోవాలన్నా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు వాపోతున్నారు. ఈ క్రమంలోనే రోడ్డు ప్రమాదాలు జరిగి, నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిని దాటేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.

Updated Date - Dec 16 , 2025 | 04:08 AM