Share News

Medical Negligence Alleged: ఆస్పత్రి నిర్లక్ష్యానికి యువతి నిండు ప్రాణం బలి

ABN , Publish Date - Sep 16 , 2025 | 05:57 AM

కడుపునొప్పి అని ఆస్పత్రికి వెళితే ఆ యువతి ప్రాణాలే పోయాయి. ఆపెండిసైటిస్‌ ఆపరేషన్‌ చేయాలని చెప్పిన వైద్యుడు శస్త్రచికిత్స నిర్వహించాక కొన్ని గంటలకే...

Medical Negligence Alleged: ఆస్పత్రి నిర్లక్ష్యానికి యువతి నిండు ప్రాణం బలి

  • నాచారంలోని శ్రీసత్య ల్యాప్రోస్కోపిక్‌ మల్టీస్పెషాలిటీఆస్పత్రిలో అపెండిసైటిస్‌ ఆపరేషన్‌ నిర్వహణ

  • కొద్దిసేపటికే లంగ్స్‌లో నీరు, రక్తం.. నెత్తుటి వాంతులు

  • సమాచారం ఇచ్చినా స్పందించని వైద్యులు, నిర్వాహకులు

  • కార్పొరేట్‌ ఆస్పత్రికి తరలింపు.. చికిత్స పొందుతూ మృతి

  • శ్రీసత్య ఆస్పత్రి ఎదుట బాఽధిత కుటుంబసభ్యుల ఆందోళన

తార్నాక, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): కడుపునొప్పి అని ఆస్పత్రికి వెళితే ఆ యువతి ప్రాణాలే పోయాయి. ఆపెండిసైటిస్‌ ఆపరేషన్‌ చేయాలని చెప్పిన వైద్యుడు శస్త్రచికిత్స నిర్వహించాక కొన్ని గంటలకే ఆమె ఆరోగ్యం వికటించింది. చివరికి ఊపిరితిత్తుల్లోకి నీరు, రక్తం చేరి.. రక్తపువాంతులు కావడంతో బాధితురాలు గుండెపోటుతో మృతిచెందింది. ఆస్పత్రి నిర్వాహకులు, శస్త్రచికిత్స చేసిన వైద్యుడి నిర్ల్యక్షంతో 20 ఏళ్లకే ప్రాణాలు కోల్పోయిందా యువతి. మృతురాలు రేణికుంట శైలజ (20). యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం చల్లూరు గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థిని. శనివారం (13న) ఆమెకు కడుపునొప్పి రావడంతో కుటుంబసభ్యులు నాచారంలోని శ్రీసత్య ల్యాప్రోస్ర్కోపిక్‌ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యుడు శ్రీనివాస్‌ గౌడ్‌, ఆమెకు అపెండిసైటిస్‌ ఆపరేషన్‌ చేయాల్సి ఉంటుందని చెప్పారు. అడ్మిట్‌ చేసుకొని.. ఆదివార ం ఉదయం 11:30కు శస్త్రచికిత్స పూర్తిచేశారు. అయితే ఆరోజు సాయంత్రం 5:30 వరకు ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నా ఒక్కసారిగా విపరీతమైన దగ్గు మొదలైంది. ఆపై రక్తపువాంతులు చేసుకోవడంతో కుటుంబసభ్యులు కంగారుపడి ఆస్పత్రి నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లారు. ఆ సమయంలో ఆస్పత్రిలో వైద్యులెవరూ అందుబాటులో లేరు. శైలజ పరిస్థితి విషమిస్తోందని సమాచారం ఇచ్చినా ఆపరేషన్‌ చేసిన వైద్యుడు శ్రీనివాస్‌ గౌడ్‌ గానీ, ఇతర వైద్యులు గానీ అక్కడికి రాలేదు. ఆమె పరిస్థితి మరింత విషమిస్తుండటంతో ఆస్పత్రి సిబ్బందే వైద్యం మొదలుపెట్టారు. అయితే ఆమె పరిస్థితి మెరుగుపడకపోగా మరింత విషమించింది. దీంతో చేతులెత్తేసిన సిబ్బంది, మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించి.. అంబులెన్స్‌ ఏర్పాటు చేశారు. అయితే అంబులెన్స్‌లో ఎలాంటి కనీస వైద్య సౌకర్యాలు, ఆక్సిజన్‌ కూడా లేకపోవడంతో బాధితురాలు శ్వాస తీసుకోవడం కూడా కష్టమైంది. ఆపై సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. ఆమె పరిస్థితి క్లిష్టంగా ఉందని చెప్పి చేర్చుకునేందుకు నిర్వాహకులు నిరాకరించారు. దాంతో.. సోమవారం తెల్లవారుజామున 6గంటల సమయానికి కుటుంబసభ్యులు ఆమెను మెడికవర్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటి నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ఆమెను బతికించేందుకు వైద్యులు ప్రయత్నించారు. కానీ ఊపిరితిత్తుల్లోకి నీరు, రక్తం చేరడంతో పాటు పలుమార్లు గుండెపోటుకు గురవడంతో రాత్రి 8గంటలకు శైలజ మృతిచెందింది. తొలుత.. ఆమెకు శస్త్రచికిత్స చేసిన వైద్యులు నిర్ల్యక్షంగా వ్యవహరించడం, పరిస్థితి విషమించినప్పుడు కనీసం మంచి ఆస్పత్రికి కూడా రిఫర్‌ చేయకపోవడంతోనే ఆమె మృతిచెందినట్లు కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు నాచారంలోని శ్రీసత్య ఆస్పత్రి ఎదుట సోమవారం అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. శైలజ మృతికి కారణమైన వైద్యుడిని అరెస్టు చేయాలని, ఆయన లైసెన్సును రద్దు చేయాలని, ఆస్పత్రిని సీజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Sep 16 , 2025 | 05:57 AM