Medha High School: మత్తుమందు తయారు చేసిన..మేధ హైస్కూల్ సీజ్
ABN , Publish Date - Sep 15 , 2025 | 04:23 AM
అల్ర్పాజోలం మత్తుమందు తయారీకి కేంద్రంగా మారిన ఓల్డ్ బోయినపల్లి మేధ హైస్కూల్‌ను విద్యా శాఖ అధికారులు ఆదివారం సీజ్ చేశారు..
బోయినపల్లి, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): అల్ర్పాజోలం మత్తుమందు తయారీకి కేంద్రంగా మారిన ఓల్డ్ బోయినపల్లి మేధ హైస్కూల్‌ను విద్యా శాఖ అధికారులు ఆదివారం సీజ్ చేశారు. పాఠశాలకు అన్ని అనుమతులు రద్దు చేసి, మూసివేయనున్నామని.. ఇందులోని విద్యార్థులను ఇతర పాఠశాలల్లో చేర్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. మేధ హైస్కూల్ నిర్వాహకుడు జయప్రకాశ్‌గౌడ్, మరికొందరు కలిసి అల్ర్పాజోలం తయారు చేసి, కల్లు కాంపాండ్లకు విక్రయిస్తున్నట్టుగా గుర్తించిన ఈగల్(నార్కోటిక్స్) బృందం.. శనివారం దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్కూల్‌ను అధికారులు సీజ్ చేశారు. సోమవారం పోలీసు, విద్యాశాఖల ఉన్నతాధికారులు ఈ పాఠశాలను, అల్ర్పాజోలం తయారు చేస్తున్న గదులను పరిశీలించనున్నారు. అనుమతులు, సరైన పత్రాలు లేకుండా మేధ పాఠశాలకు భవనాన్ని అద్దెకు ఇచ్చిన యజమానిపైనా కేసు నమోదు చేయాలని అధికారులు భావిస్తున్నట్టు తెలిసింది. మరోవైపు మేధ స్కూల్ యాజమాన్యం తమకు మూడు నెలలుగా జీతాలు ఇవ్వలేదని పాఠశాల సిబ్బంది చెబుతున్నారు.