Medaram Yatra Development Work: యుద్ధ ప్రాతిపదికన మేడారం పనులు
ABN , Publish Date - Nov 13 , 2025 | 04:42 AM
మేడారం మహా జాతర అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని రాష్ట్ర గృహనిర్మాణ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు...
డిసెంబరు నెలాఖరుకు పనులన్నీ పూర్తి చేయాలి.. జనవరి 15 నాటికి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి
గడువులోగా పనులు పూర్తి చేస్తేనేకాంట్రాక్టర్లకు బిల్లులు
నాణ్యతలో తేడా వస్తే ఉపేక్షించేది లేదు: పొంగులేటి
మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వాలి: కొండా సురేఖ
దేవుళ్లపై రాజకీయం చేస్తున్న ప్రతిపక్షాలు: సీతక్క
సమ్మక్క, సారలమ్మ దీవెనతోనే మంత్రినయ్యాను: అడ్లూరి
వరంగల్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మేడారం మహా జాతర అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని రాష్ట్ర గృహనిర్మాణ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. పనులన్నీ డిసెంబరు 31 నాటికి పూర్తయ్యేలా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలన్నారు. జనవరి 15లోగా జాతరలో భక్తులకు అన్ని సౌకర్యాలు అందుబాటులోకి రావాలని ఆదేశించారు. 24 గంటలు షిప్టుల వారీగా పనులు జరుగుతూనే ఉండాలని, అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. బుధవారం సహచర మంత్రులు కొండా సురేఖ, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి మేడారంలో మహా జాతర పనులను మంత్రి పొంగులేటి పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మేడారం జాతర పనులను రాబోయే 200 ఏళ్ల వరకు ఉపయోగపడేలా చేపట్టామన్నారు. ప్రస్తుతం జాతరకు రెండు మూడు కోట్ల మంది భక్తులు వస్తున్నారని, పది కోట్ల మంది భక్తులు వచ్చినా ఇబ్బంది లేనివిధంగా సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. 25 రోజుల కిందట పనులు మొదలు పెట్టామని, మాస్టర్ ప్లాన్‌లో మరికొన్ని పనులను ఈ నెల 22 తరువాత చేరుస్తామని అన్నారు. జాతర అభివృద్ధి పనులకు కావాల్సిన 19 ఎకరాల భూసేకరణను అధికారులు త్వరగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. జంపన్నవాగుపై చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, నాలుగు అధునాతన జంతు వధశాలలను ఏర్పాటు చేయాలని సూచించారు.
గడువులోగా పూర్తిచేస్తేనే బిల్లులు..
గడువులోగా పనులు పూర్తి చేస్తేనే బిల్లులు ఇస్తామని మంత్రి పొంగులేటి అన్నారు. గత ప్రభుత్వం తరహాలో జాతర నాటికి కూడా పనులు చేస్తూ పోతే కుదరదని స్పష్టం చేశారు. నాణ్యతలో తేడా వస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పనుల పరిశీలనకు ఈ నెల 22న మళ్లీ వస్తామన్నారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ మేడారం జాతరకు జాతీయ హోదా తెచ్చే బాధ్యతను కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ తీసుకోవాలన్నారు. గత ప్రభుత్వాలు ఏనాడూ జాతరను పట్టించుకోలేదని ఆరోపించారు. రాబోయే తరాలకు కూడా సౌకర్యాలు కల్పించేలా సీఎం రేవంత్‌రెడ్డి మేడారం జాతరను అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. కాగా, ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారంతో దేవుళ్లపై రాజకీయం చేస్తున్నాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క విమర్శించారు. వారం, పది రోజుల తరువాత గద్దెల వద్ద ఒక రూపం వస్తుందన్నారు. మేడారంలోని సమ్మక్క, సారలమ్మ తల్లుల ఆశీర్వాదంతోనే తాను మంత్రినయ్యానని గిరిజన సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. మేడారంలో అభివృద్ధి పనులను పరిశీలించేందుకు వచ్చిన మంత్రులకు గిరిజన పూజారులు, దేవస్థానం అధికారులు స్వాగతం పలికారు. మంత్రులు గద్దెల వద్దకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా, అభివృద్ధి పనులు పరిశీలిస్తున్న సమయంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ కాలుజారి ప్రహరీ కోసం తీసిన పునాదిలో పడిపోయారు. పక్కనే ఉన్నమంత్రులు సీతక్క, సురేఖతోపాటు వ్యక్తిగత సిబ్బంది వెంటనే ఆమెను పైకి లేపారు. స్వల్పంగా గాయాలు కావడంతో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు.
మంత్రుల మధ్య విభేదాలకు పుల్‌స్టాప్!
మేడారం జాతర పనుల పరిశీలనకు మంత్రులు పొంగులేటి, సీతక్క, అడ్లూరి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో రాగా, సురేఖ వరంగల్ నుంచి కారులో కాస్త ఆలస్యంగా వచ్చారు. దీంతో పొంగులేటి ఆమెకు ఎదురెళ్లి అక్కా.. అంటూ ఆప్యాయంగా పలకరించి ఆహ్వానించారు. ఆ తరువాత కూడా వారు ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. దీంతో వారిద్దరి మధ్య తలెత్తిన విభేదాలకు ఫుల్‌స్టాప్ పడినట్లేనన్న చర్చ జరుగుతోంది.