Share News

Medaram Jathara Renovation: వడివడిగా మేడారం పునర్నిర్మాణం

ABN , Publish Date - Dec 27 , 2025 | 04:10 AM

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన ‘మేడారం’ జాతర నిర్వహణకు అవసరమైన వసతుల కల్పన, అభివృద్ధి పనులు 80-90ు పూర్తయ్యాయి...

Medaram Jathara Renovation: వడివడిగా మేడారం పునర్నిర్మాణం

  • జనవరి 5కల్లా తుది దశకు అభివృద్ధి పనులు.. గ్రానైట్‌ పిల్లర్లపై ఆదివాసీ చరిత్ర

  • వేగంగా గద్దెలూ జంపన్న వాగు సుందరీకరణ

  • అధికారులకు కుంభమేళా నిపుణుల బృందం సూచనలు

  • గద్దెల సమీపంలోనే వాహన పార్కింగ్‌

  • ప్రత్యేక ఆకర్షణ కానున్న డ్రోన్‌షో

హైదరాబాద్‌/ ములుగు, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన ‘మేడారం’ జాతర నిర్వహణకు అవసరమైన వసతుల కల్పన, అభివృద్ధి పనులు 80-90ు పూర్తయ్యాయి. జనవరి ఐదో తేదీ నాటికి పనులన్నీ పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం శ్రమిస్తోంది. జనవరి 28-31 తేదీల మధ్య సమ్మక్క-సారలమ్మ జాతర జరగనుంది. గద్దెల విస్తరణ, ఆలయ ప్రాంగణం చుట్టూ గ్రానైట్‌ రాతి ప్రాకార నిర్మాణం, స్వాగత తోరణాల ఏర్పాటు పనులు వడివడిగా సాగుతున్నాయి. గద్దెల చుట్టూ నిర్మిస్తున్న 32 గ్రానైట్‌ ఫిల్లర్లపై ఆదివాసీ సంస్కృతి, ఆచారాలు, చరిత్రను చిత్రీకరించారు. మార్బుల్‌ శిలలతో గద్దెలూ జంపన్నవాగు సుందరీకరణ, డ్రైనేజీ వ్యవస్థలు, ఫ్లడ్‌ మేనేజ్‌మెంట్‌, 60 అడుగుల నుంచి నాలుగు లైన్లకు రోడ్ల విస్తరణ, క్యూ లైన్లు, సత్రాలు, వాచ్‌ టవర్లు, గ్రీనరీ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. జనవరి మొదటి వారం నుంచి భక్తులు పుణ్య స్నానాలు చేయడానికి వీలుగా జంపన్న వాగులో నీటి ప్రవాహం సాగేలా చర్యలు తీసుకోనున్నారు. మరోవైపు జాతర సజావుగా సాగేందుకు మహా కుంభమేళాలో భాగస్వాములైన నిపుణుల బృందం మేడారానికి చేరుకుని.. జాతర జరిగే ప్రాంతం, అక్కడికి దారి తీసే మార్గాలు, జాతర రద్దీ ఉండే ఉప ఆలయాలను సందర్శించి.. అధికారులకు తగు సూచనలు చేసింది. ఈసారి జాతరకొచ్చే భక్తులకు పార్కింగ్‌ సమస్య తలెత్తకుండా గద్దెల సమీపంలోనే ఏకకాలంలో వేల వాహనాల పార్కింగ్‌కు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈసారి జాతర జరిగే 4 రోజులూ డ్రోన్‌షో ప్రత్యేక ఆకర్షణ కానున్నది. డ్రోన్‌షో ఎక్కడ నిర్వహించాలో 1,2 రోజుల్లో నిర్ణయం తీసుకుంటారు. జాతరపై సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు డాక్యుమెంటరీ కూడా రూపొందిస్తున్నారు. జాతర ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయని ములుగు జిల్లా కలెక్టర్‌ దివాకర ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు. జనవరి 5 తర్వాత కూడా అదనపు పనులు చేయాల్సి వస్తే వెంటనే పూర్తి చేస్తామన్నారు.


ప్రత్యేక ఆకర్షణగా వన దేవతల గద్దెల విస్తరణ: మంత్రి సీతక్క

జనవరిలో జరిగే మేడారం జాతరలో వన దేవతల గద్దెల విస్తరణ ప్రత్యేక ఆకర్షణ కానున్నదని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమం, పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ధనసరి సీతక్క పేర్కొన్నారు. ఇందుకోసం సర్కారు రూ.101 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. ప్రతిసారి మాదిరే తాత్కాలిక ఏర్పాట్లతోపాటు రూ.251 కోట్ల నిధులతో శాశ్వత నిర్మాణాలతో అభివృద్ధి చేపట్టిందన్నారు. సమ్మక్క-సారలమ్మ దేవస్థానం పునర్నిర్మాణ పనుల పరిశీలనకు శుక్రవారం హైదరాబాద్‌ నుంచి వచ్చిన మీడియా బృందానికి చేపట్టిన కార్యక్రమాలను ఆమె వివరించారు. పునర్నిర్మాణ పనుల్లో ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేశామన్నారు. 4 వేల టన్నుల గ్రానైట్‌పై ఆదివాసీ చరిత్ర సంస్కృతిని తెలిపేలా 7,000 బొమ్మలతో సమ్మక్క-సారలమ్మ జాతర నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. 200 ఏళ్లపాటు చెక్కు చెదరకుండా, నాణ్యతా ప్రమాణాలతో రాజీ పడకుండా పనులు చేపడుతున్నామని మంత్రి సీతక్క చెప్పారు. పలు దఫాలు గిరిజన పూజారులతో సమావేశమై, పూజరుల సంఘాన్ని ఒప్పించి పునరుద్ధరణ పనులు చేపట్టామన్నారు. ఒకే వరుసలో వన దేవతలుండటంతో భక్తుల దర్శనానికి సులువుగా ఉంటుందన్నారు. సమ్మక్క తల్లిది బండారి గోత్రమని, తమ ఆదివాసీల సంప్రదాయం ప్రకారం ప్రతి పని కుడి నుంచి ఎడమవైపు సాగుతుందన్న మంత్రి సీతక్క.. నవ గ్రహాలూ కుడి నుంచి ఎడమ వైపు తిరుగుతాయన్నారు. ‘స్వస్తిక్‌’ ఏర్పాటుపైనా ప్రకృతి సిద్దాంతాన్ని ఆచరించామన్నారు. వచ్చే నెలలో జరిగే జాతరకు కోటి మందికి పైగా వస్తారని అంచనా వేస్తున్నట్లు ఆమె తెలిపారు. మంత్రుల బృందం నిత్యం పరిశీలిస్తూ అధికారులకు సూచనలతో పనులు ముమ్మరం చేస్తున్నామన్నారు. గతంలో పాదయాత్రలో మేడారానికి వచ్చిన రేవంత్‌రెడ్డి.. ప్రజలకిచ్చిన వాగ్దానం మేరకు అధికారంలోకి రాగానే ఆలయ పునర్నిర్మాణ పనులు చేపట్టి.. మాట నిలుపుకున్నారని మంత్రి సీతక్క వివరించారు.

Updated Date - Dec 27 , 2025 | 04:10 AM