Medak Candidates Secure Top Rank: పట్టుపట్టి సాధించారు!
ABN , Publish Date - Sep 29 , 2025 | 03:44 AM
బీటెక్ చదివి ఐటీ ఉద్యోగం చేసి, పోటీపరీక్షలపై దృష్టి సారించి పట్టుదలతో ఉద్యోగం సాధించిన వ్యక్తి ఒకరు.. డిప్యూటీ తహసీల్దారుగా పనిచేస్తూనే మరోసారి...
గ్రూప్ 2లో 2, 3 ర్యాంకులు సాధించిన ఉమ్మడి మెదక్ జిల్లావాసులు
సిద్దిపేట కల్చరల్/నారాయణఖేడ్ సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): బీటెక్ చదివి ఐటీ ఉద్యోగం చేసి, పోటీపరీక్షలపై దృష్టి సారించి పట్టుదలతో ఉద్యోగం సాధించిన వ్యక్తి ఒకరు.. డిప్యూటీ తహసీల్దారుగా పనిచేస్తూనే మరోసారి గ్రూప్-2 పరీక్షలు రాసి మెరుగైన ఉద్యోగం సాధించిన ప్రతిభావంతుడు మరొకరు!! ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన వీరిద్దరూ ఎన్నో కష్టాలను తట్టుకుని గ్రూప్-2 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 2, 3 ర్యాంకులు సాధించి సత్తా చాటారు. వీరిలో రెండో ర్యాంకరు వడ్లకొండ సచిన్ గ్రూప్-1, గ్రూప్-3 పరీక్షల్లోనూ అద్భుత ప్రతిభ కనబరిచి కొలువులు సాధించడం గమనార్హం. సిద్దిపేట వాసి సచిన్ ఢిల్లీలోని బీఎమ్‌ఎల్ యూనివర్సిటీలో బీటెక్ పూర్తయ్యాక 2019లో ఓ ఐటీ కంపెనీలో చేరి ఏడాది ఉద్యోగం చేశారు. కొవిడ్ లాక్‌డౌన్‌లో ఇంటి నుంచి పని చేస్తున్నప్పుడు సివిల్స్‌పై దృష్టి సారించారు. ఆ పరీక్షల కోసం సొంతంగానే సిద్ధమయ్యారు. 2021, 22లో రెండుసార్లు సివిల్స్ రాసినా క్వాలిఫై కాలేదు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నోటిఫికేషన్లు రావడంతో గ్రూప్స్‌కు దరఖాస్తు చేశారు. గ్రూప్ 3 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 23వ ర్యాంకు సాధించారు. గ్రూప్ 1 ఫలితాల్లో 360వ ర్యాంకు సాధించి ఎంపీడీవో పోస్టుకు ఎంపికై, ఈ నెల 27న నియామకపత్రం కూడా అందుకున్నారు. ఆదివారం విడుదలైన గ్రూప్ 2 తుది ఫలితాల్లో.. సచిన్ సబ్ రిజిస్ట్రార్ పోస్టుకు ఎంపికయ్యారు. అపాయింట్‌మెంట్ ఆర్డర్ రాగానే ఈ పోస్టులో జాయిన్ అవుతానని తెలిపారు. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం ఉజలంపాడ్ గ్రామ వాసి మనోహర్‌రావు గ్రూప్ 2 ఫలితాల్లో సత్తాచాటి సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగాన్ని సాధించారు. మారుమూల గ్రామమైన ఉజలంపాడ్ గ్రామ వాసి బి.పండరినాథ్, కమలమ్మ దంపతుల రెండో కుమారుడైన మనోహర్‌రావు గతంలో పీజీటీ, టీజీటీలో ఉద్యోగాలు సాధించారు. గ్రూప్-2లో కూడా సత్తా చాటి, డిప్యూటీ తహసీల్దార్‌గా విధులు నిర్వహించారు. అనంతరం స్కూల్ అసిస్టెంట్‌గా, జేఎల్‌గాను అవకాశాలు దక్కించుకున్నప్పటికీ, ఉన్నతమైన ఉద్యోగం కోసం మరోసారి గ్రూప్-2 పరీక్షలు రాసి తన ప్రతిభను నిరూపించుకున్నారు.