వరిలో యాంత్రీకరణ బహుదూరం
ABN , Publish Date - Jul 26 , 2025 | 01:03 AM
వరి నాట్లలో కూలీల కొరతను అధిగమించేం దుకు యాంత్రీకరణ పద్ధతులను వ్యవసాయ నిపుణులు రూపొందించారు.
వరిలో యాంత్రీకరణ బహుదూరం
సాగులో ఎన్నో ఒడిదుడుకులు
రైతుల్లో అనాసక్తత..
శతాబ్దాలుగా వరి నాట్లలో పాత పద్ధతే కొనసాగింపు
- (ఆంధ్రజ్యోతి, మిర్యాలగూడ వ్యవసాయం)
వరి నాట్లలో కూలీల కొరతను అధిగమించేం దుకు యాంత్రీకరణ పద్ధతులను వ్యవసాయ నిపుణులు రూపొందించారు. రైతులు యాంత్రీకరణ వైపు మొగ్గు చూపినా ఆశించిన ఫలితాలు సాధించ లేకపోయారు. వరి నాట్లలో ఇప్పటికే సంప్రదాయ పద్ధతినే రైతులు నమ్ముకున్నారు. వరిలో నాట్లలో వచ్చిన యాంత్రీకరణ పద్ధతులు వాటి వల్ల ఏర్పడే లాభనష్టాలపై కఽథనం..
నాగార్జునసాగర్ ఎడమకాల్వ ఆయకట్టు పరిధి కింద 6.50 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తుండగా 80శాతం మేర వరి నారు పోసుకుని కూలీలతో నా ట్లు వేసే పద్ధతిని పాటిస్తున్నారు. 20శాతం మేర యంత్రంతో వరి నాటు, వెదజల్లే పద్ధతి, డ్రమ్ సీడ ర్, మెట్ట వరి, శ్రీ వరి వంటి అధునాతన పద్ధతుల తో వరి సాగు చేస్తున్నారు.
శ్రీవరి
వరి సాగులో శ్రీ వరి సాగు ప్రాచుర్యంలోకి వచ్చింది. సాధారణ పద్ధతిలో ఎకరం వరి సాగుకు 15-20 కిలోల వరకు విత్తనం అవసరమవుతుంది.
శ్రీవరి పద్ధతిలో ఎకరం నాటు వేయడానికి 2 కిలోల విత్తనం సరిపోతుంది.
వరి నారు 8-12 రోజుల వయస్సు గల రెండు ఆకుల నారును వాడాలి.
నారు మడి నుంచి మొక్కను జాగ్రత్తగా తీసి బురద పొలంతో పైన నాటాలి. ఈ పద్ధతిలో పిలకలు బాగా వస్తాయి.
మొక్కకు మధ్య దూరం 25 సెం.మీ ఉండే విధంగా నాటాలి.
పొలంలో నీటిని నిల్వ ఉంచవద్దు. కలుపు సమస్య అధికంగా ఉంటుంది. రెండు మీటర్ల ఒక కాల్వ ఏర్పాటు చేసుకోవాలి. కోనో వీడర్‌తో పది రోజులకొకసారి సుమారు మూడు సార్లు మొక్కల మధ్య కదిలిస్తే కలుపు మొక్కలు బురదలో కలిసిపోతాయి.
ఈ విధానంలో 60 శాతం నీరు సరిపోతుంది.
సమస్యలు: లేత వరి నారును తీయడం చాలా కష్టం. నాటు వేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరు తడి పద్ధతి వల్ల కలుపు సమస్య తీవ్రంగా ఉంటుంది. బురదలో కోనోవీడర్ నడపడం చాలా క్లిష్టమైనది. కూలీల అవసరం అధికంగా ఉంటుంది. యాజమాన్యంలో సమస్యల వల్ల రైతులు ఈ పద్ధతి వైపు మొగ్గు చూపడం లేదు.
ఆరుతడి వరి (ఎరోబిక్ రైస్)
ఎరోబిక్ వరి పద్ధతిలో ఎకరానికి 8-10 కిలోల విత్తనం సరిపోతుంది. నీటి పారుదల అతి తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ విధానం అనువుగా ఉంటుంది.
వర్షాధారంగా భూమిని మెత్తగా దున్ని మెట్టలోనే నేరుగా ట్రాక్టర్ యంత్రంతో విత్తుకోవాలి. ఆరు తడి పద్ధతిలో నీటిని పెట్టాలి. విత్తనం మెలకెత్తే వరకు జాగ్రత్తలు తీసుకోవాలి.
ఈ పద్ధతిలో నీటి వినియోగం 40 రోజుల వరకు తక్కువగా ఉంటుంది. పిలక దశ నుంచి సాధారణ వరి లాగానే నీటిని పెట్టాలి. కలుపు సమస్యకు 30 రోజుల నివారణ మందును పిచికారీ చేయాలి.
నాటు కూలీలు ఖర్చు సుమారు రూ.6వేలు, బురద పొలంలో దమ్ము చేయాల్సిన అవసరం లేదు. ట్రాక్టర్ ఖర్చులు సుమారు రూ.3వేల వరకు ఆదా అవుతుంది.
సమస్యలు: మెట్ట పద్ధతిలో విత్తనం వేసినప్పు డు భారీ వర్షాలు పడితే విత్తనం కొట్టుకుపోయి నష్టం వాటిల్లుతుంది. విత్తనం వేసినప్పటి దగ్గర నుంచి సుమారు నెల రోజుల వరకు యాజమా న్యం చాలా కష్టంగా ఉంటుంది. కలుపు సమస్య తీవ్రంగా ఉండటంతో రైతులు ఈ పద్ధతిపై ఆసక్తి చూపడం లేదు.
వెద జల్లే పద్ధతి : ఈ బురద పొలంలో మొలక కట్టిన విత్తనాలను నేరుగా చల్లవచ్చు. నాటు కూలీల ఖర్చు ఉండదు. విత్తనం 10 కిలోల వరకు సరిపోతుంది.
సుమారు నెల రోజుల వరకు ఆరుతడి పద్ధతిలో నీటిని అందించాలి.
సమస్యలు: పొలం చదును సరిగా లేకపోతే విత్తనం మొలకెత్తదు. నెల రోజుల వరకు నీటి యాజమాన్యం చాలా క్లిష్టంగా ఉంటుంది. కలుపు సమస్య తీవ్రంగా ఉంటుంది.
పాత పద్ధతే మేలు..
వరి నారు పోసుకుని కూలీలతో నాటు వేయడం వల్ల నీటి యాజమాన్యం చాలా సులువుగా ఉంటుంది. ఈ పద్ధతి నాట్లు వేయడం వల్ల అధిక వర్షాలు పడినా పంట దెబ్బతినదు. అందుకే పాత పద్ధతే మేలని రైతులు చెబుతున్నారు.
యంత్రంతో నాటు: వరి నాటు యంత్రం
వరినాటు యంత్రం ద్వారా నాటు వేయడానికి ఎకరానికి పది కిలోల విత్తనం పడుతుంది.
ప్లాస్టిక్ షీటు వేసి బురద మట్టిలో విత్తనాలు వేస్తారు. 20-26 వయస్సు నారును బెడ్లుగా తీసి యంత్రంలో పెట్టి నాటు వేస్తారు.
ఈ యంత్రంతో ఒక గంటలోనే ఎకరం నాటు వేసుకోవచ్చు.
పిలకలు బాగా వస్తాయి. ఈ పద్ధతిలో దిగుబడులు పెరిగే అవకాశం ఉంది.
సమస్యలు: నారు ఎత్తు తక్కువగా ఉండటం వల్ల నాటు వేసేటప్పుడు బురద మడిని చాలా చదునుగా లేక పోతే నారు మునిగిపోయి చనిపోయే ప్రమాదం ఉంది. నాటు వేసిన దగ్గర నుంచి కర్ర నిలబడే వరకు ఆరుతడి పద్ధతిలో నీరు పెట్టాల్సి రావడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కూలీలతో వరి నాట్లు
నేను 30 ఎకరాల్లో వరి సాగు చేస్తాను. సాధారణ నాటు పద్ధతిలో కూలీల కొరత ఉండటంతో వివిధ పద్ధతుల్లో నాట్లు వేశాను. యాజమాన్యంలో సమస్యలు ఎదుర్కొంటున్నాను. కొంత మేరకు నష్టం వాటిల్లింది. పాత పద్ధతిలో కూలీల ద్వారా నాట్లు వేయిస్తున్నాను.
- సారెడ్డి సత్యనారాయణరెడ్డి,బి.అన్నారం,మిర్యాలగూడ