Share News

Food Fraud: తూచారా.. దోచారా?

ABN , Publish Date - Dec 08 , 2025 | 04:32 AM

కిలో అంటే 800 గ్రాములు.. అర కిలో అంటే 400 గ్రాములు.. ఇదేం పిచ్చి లెక్క అనిపిస్తోందా..? ఎక్కడైనా ఏమోగానీ.. అక్కడ మాత్రం అంతే!! మాంస మో.....

Food Fraud: తూచారా.. దోచారా?

  • తూకంలో మోసం చేస్తున్న మాంసం, చేపల వ్యాపారులు

  • కిలోకు 200 గ్రాముల వరకు తేడాలు

  • మటన్‌ కిలో కొంటే రూ.200 దాకా నష్టం

  • సెట్టింగ్స్‌ మార్చి ఏమార్చుతున్న తీరు

  • తూనికలు-కొలతలశాఖ తనిఖీలు

  • పలువురు వ్యాపారులపై కేసులు

హైదరాబాద్‌, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): కిలో అంటే 800 గ్రాములు.. అర కిలో అంటే 400 గ్రాములు.. ఇదేం పిచ్చి లెక్క అనిపిస్తోందా..? ఎక్కడైనా ఏమోగానీ.. అక్కడ మాత్రం అంతే!! మాంస మో, చేపలో కొంటే వచ్చేది అంతే!! అది మామూలు త్రాసైనా.. ఎలకా్ట్రనిక్‌ కాంటైనా చేతికందేది అంతంతే! ఆదివారం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లోని మాంసం, చేపల విక్రయ కేంద్రాల్లో తూనికలు, కొలతల శాఖ అధికారులు ప్రవీణ్‌ కుమార్‌, శ్రీవల్లి, రహీమ్‌ఖాన్‌, సాయికుమార్‌ చేసిన తనిఖీల్లో ఈ సంగతి బయట పడింది. కిలో మటన్‌/చేపలు తీసుకుంటే.. తూకంలో మోసం చేస్తూ, సగటున 800 గ్రాముల మాంసం మాత్రమే ఇస్తున్నారని తేల్చారు. మోసానికి పాల్పడుతున్న వ్యాపారులపై కేసులు నమోదు చేశారు.

సెట్టింగ్‌ మార్చి.. బరువులు పెట్టి..

ఆదివారం వచ్చిందంటే చాలు.. ఎక్కడ చూసినా మటన్‌, చికెన్‌, చేపల దుకాణాలు కిటకిటలాడుతుంటాయి. గల్లీల్లోని దుకాణాల నుంచి ఖాళీ ప్రదేశాలు, ఫుట్‌పాత్‌లపై గల వ్యాపారులంతా బిజీ యే. కొందరు సాధారణ త్రాసుల్లో కనిపించకుండా బరువులు పెడు తూ, ఎలకా్ట్రనిక్‌ కాంటాల్లో సెట్టింగ్స్‌ మారుస్తూ మోసం చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. సగటున కిలోకు 200 గ్రాముల వరకు తక్కువ ఇస్తున్నట్టు తేల్చారు. అసలే ఆదివారం ధరలు పెంచు తా రు. ఆపై తక్కువ తూకంతో వినియోగదారుల జేబులు గుల్ల అవుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో మటన్‌ ఖరీదు కిలోకు సగటున రూ.1,000 వరకు ఉంది. అంటే 200 గ్రాములు తక్కువ ఇస్తే.. వినియోగదారులు రూ.200 నష్టపోయినట్టే. ఇదే తరహాలో చికెన్‌, సాధారణ చేపల కొనుగోలులో రూ.50 వరకు నష్టపోతున్నారు.

మత్స్య సహకారశాఖ ఔట్‌లెట్లలో కూడా..

హైదరాబాద్‌లో 5 చోట్ల రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య లిమిటెడ్‌ (టీజీఎ్‌ఫసీఓఎఫ్‌) ఔట్‌లెట్లలో.. 2 మొబైల్‌ వాహనాల్లో చేపలు విక్రయిస్తున్నారు. ప్రైవేటు వ్యాపారులపై నమ్మకం లేని వినియోగదారులు ఈ ఔట్‌లెట్లలో కొన్నా తూకంలో మోసం తప్పడం లేదు. లిబర్టీ సెంటర్‌లోని ఔట్‌లెట్‌లో కాంటాలను పరిశీలించగా 200 గ్రాములు తేడా వచ్చింది. దీంతో ఔట్‌లెట్‌ నిర్వాహకులపై అధికారులు కేసు నమోదుచేశారు. సెట్టింగ్స్‌ మార్చిన కాంటాలను స్వాధీనం చేసుకున్నారు. రూ.10 వేలు జరిమానా విధించారు. చాలా చోట్ల ఇలాంటి మోసాలు జరుగుతున్నాయని, వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Updated Date - Dec 08 , 2025 | 04:32 AM