Share News

MP Raghu Nandan Rao: ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్డును మింగి.. మూసీ ఎఫ్‌టీఎల్‌లో భారీ అక్రమ నిర్మాణం

ABN , Publish Date - Oct 01 , 2025 | 02:59 AM

మూసీ ఎఫ్‌టీఎల్‌లో వాంటెజ్‌ పేరుతో శ్రీ ఆదిత్య సంస్థ అక్రమంగా భారీ వాణిజ్య భవన నిర్మాణం చేపట్టిందని ఎంపీ రఘునందన్‌రావు తెలిపారు...

MP Raghu Nandan Rao: ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్డును మింగి.. మూసీ ఎఫ్‌టీఎల్‌లో భారీ అక్రమ నిర్మాణం

  • ఆదిత్య వాంటెజ్‌కు అనుమతులిచ్చిందెవరు..?

  • హైడ్రాకు కనబడటం లేదా: ఎంపీ రఘునందన్‌

హైదరాబాద్‌/నార్సింగ్‌, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): మూసీ ఎఫ్‌టీఎల్‌లో వాంటెజ్‌ పేరుతో శ్రీ ఆదిత్య సంస్థ అక్రమంగా భారీ వాణిజ్య భవన నిర్మాణం చేపట్టిందని ఎంపీ రఘునందన్‌రావు తెలిపారు. నార్సింగ్‌లో ఔటర్‌ రింగ్‌ రోడ్డు సర్వీస్‌ రోడ్డును తొలగించి మరీ బహుళ అంతస్థుల భవనాన్ని కడుతుంటే హైడ్రా ఏం చేస్తోందని ప్రశ్నించారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రఘునందన్‌ మీడియాతో మాట్లాడారు. ‘‘బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో మునిసిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌.. నార్సింగ్‌లో శ్రీ ఆదిత్య వాంటెజ్‌ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చారు. నాలా, బఫర్‌జోన్‌ను ఆక్రమించి దీనిని కడుతున్నారు. దీంతో రేవంత్‌ సీఎం అయ్యాక నిర్మాణాన్ని నిలిపివేశారు. ఇది అక్రమ కట్టడమని హెచ్‌ఎండీఏ టౌన్‌ ప్లానింగ్‌ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగ్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. తాజాగా మళ్లీ పనులు ప్రారంభించారు. దీని వెనుక ఉన్న మంతుల్రెవరు? సీఎంవో నుంచి ఆదేశాలు వెళ్లాయా? మహేశ్‌గౌడ్‌ ప్రమేయం ఉందా? ఉపముఖ్యమంత్రి ఉన్నారా? ఈ అక్రమ నిర్మాణాన్ని తక్షణం నిలిపివేయాలి. ఈ నిర్మాణానికి అనుమతులు ఇప్పించిందెవరో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌కు తెలుసు. పేదల ఇళ్లను కూల్చుతున్న హైడ్రాకు ఈ భవనం కనిపించకపోవడం దురదృష్టకరం’’ అని రఘునందన్‌ పేర్కొన్నారు. ఈ మేరకు సీఎంకు బహిరంగ లేఖ రాశారు.

Updated Date - Oct 01 , 2025 | 02:59 AM