Scam Drains Bank Accounts: టచ్ చేశారో.. ఖాతా ఖాళీ.!
ABN , Publish Date - Nov 24 , 2025 | 04:13 AM
సైబర్ నేరగాళ్లు సరికొత్త ఎత్తుగడతో మళ్లీ పంజా విసిరారు. ఆదివారం ఒకేరోజు పెద్దసంఖ్యలో సెల్‌ఫోన్ వినియోగదారుల వాట్సా్‌పలకు మోసపూరిత పంపి డబ్బులు కొల్లగొట్టేశారు. ఆదివారం బ్యాంకులకు సెలవుదినం కావడంతో దీన్ని అవకాశంగా మల్చుకున్న సైబర్ నేరగాళ్లు రాష్ట్రంలోని లక్షలాది మందికి ......
ఏపీకే ఫైల్స్‌తో సైబర్ నేరగాళ్ల పంజా.. ఎస్‌బీఐ పేరిట లక్షలాది మందికి సందేశాలు
వేలాది ఖాతాల్లో డబ్బు కాజేసిన వైనం
మంత్రులు, జర్నలిస్టుల గ్రూపుల హ్యాక్
ఆధార్ అప్‌డేట్ చేసుకోమంటూ వాట్సాప్ సందేశం
హైదరాబాద్, హైదరాబాద్ సిటీ, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): సైబర్ నేరగాళ్లు సరికొత్త ఎత్తుగడతో మళ్లీ పంజా విసిరారు. ఆదివారం ఒకేరోజు పెద్దసంఖ్యలో సెల్‌ఫోన్ వినియోగదారుల వాట్సా్‌పలకు మోసపూరిత పంపి డబ్బులు కొల్లగొట్టేశారు. ఆదివారం బ్యాంకులకు సెలవుదినం కావడంతో దీన్ని అవకాశంగా మల్చుకున్న సైబర్ నేరగాళ్లు రాష్ట్రంలోని లక్షలాది మందికి ఆదివారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) పేరిట ఏపీకే ఫైల్స్ రూపంలో సందేశాలు పంపి.. ‘మీ ఆధార్ నెంబర్ ఈ రోజు అర్ధరాత్రి లోపు అప్‌డేట్ చేసుకోవాలి. లేదంటే మీ బ్యాంకు ఖాతా క్లోజ్ అవుతుంది. ఆధార్ అప్‌డేట్ చేసుకోవడానికి వెంటనే ఎస్‌బీఐ ఆధార్ ఆప్‌డేట్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి’ అని సూచిస్తూ హెచ్చరించారు. మరోవైపు వేలాది వాట్సాప్ గ్రూపుల్లోకి చొరబడి వాటి అడ్మిన్‌లను కంట్రోల్ తీసుకుని డీపీని ఎస్‌బీఐ చిహ్నం కింద మార్చివేశారు. జర్నలిస్టులు, మంత్రులు, ఆఖరికి సీఎంఓ వాట్సాప్ గ్రూపుల్లోకి సైతం సైబర్ నేరగాళ్లు చొరబడ్డారు. ఆదివారం ఉదయం ఒక జర్నలిస్టుకు సంబంధించిన వాట్సా్‌పకు వచ్చిన సందేశాన్ని అతను పొరపాటున ఓపెన్ చేయడంతో ఆయన ఫోన్‌లో ఉన్న అన్ని వాట్సాప్ గ్రూపుల్లోకి సైబర్ నేరగాళ్లు చొరబడి తీవ్ర కలకలం సృష్టించారు. వీరు పంపించిన ఏపీకే ఫైలును తెరిచిన వెంటనే ఫోన్లు హ్యాంగ్ అయిపోతుండటం, బ్యాంకు ఖాతాల్లో సొమ్ములు ఖాళీ అవుతుండటంతో వేలాది మంది సైబర్ క్రైం విభాగానికి ఫిర్యాదులు చేశారు. సీనియర్ సిటిజన్లు చాలామంది తమ వాట్సా్‌పకు అది బ్యాంకు నుంచి వచ్చిన నిజమైన సందేశమని నమ్మి ఏపీకే ఫైళ్లను ఓపెన్ చేసి ఫోన్లు హ్యాక్ కావడంతో గందరగోళానికి గురవుతున్నారు. ఎస్‌బీఐ పేరిట వచ్చిన ఏపీకే ఫైల్‌ను పొరపాటున ఇన్‌స్టాల్ చేస్తే వెంటనే హ్యాకర్లు ఆ ఫోన్‌కు సంబంధించిన ఓటీపీలు, ఎస్‌ఎంఎ్‌సలు, యూపీఐ పిన్‌లు తెలుసుకుంటారు. నిమిషాల వ్యవధిలో బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తారు. హ్యాకింగ్‌కు గురైన వారి ఫోన్‌లోని కాంటాక్ట్స్‌లో పలువురికి వాట్సాప్ ద్వారా డబ్బు పంపాలని సందేశాలు పంపుతారు. లేదా వాట్సాప్ ద్వారా భయపెట్టే సందేశాలను పంపుతారు. స్ర్కీన్ రికార్డింగ్ ఆటోమేటిక్‌గా ఆన్ అయిపోతుంది. యూపీఐ పేమెంట్ యాప్స్‌కు వారు లాగిన్ అయిపోతారు.
తల్లికి సీరియ్‌సగా ఉందంటూ
ఆదివారం ఒక మహిళా జర్నలిస్టు ఇలాంటి ఏపీకే ఫైల్‌ను ఓపెన్ చేయడంతో హ్యాకర్లు ఆమెకు చెందిన కాంటాక్ట్స్‌లోకి చొరబడి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు వాట్సాప్ సందేశాన్ని పంపించారు. ఆమె తల్లికి సీరియ్‌సగా ఉందని, వెంటనే డబ్బు పంపాలని కోరారు. కొద్దిసేపటికి ఆమె ఖాతాల్లో జమ అయిన రూ.12 లక్షలను సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టారు. మీ ఖాతాలో ఇతరుల ద్వారా డబ్బు వేయించి కొల్లగొట్టడం కొత్త యత్నమని నిపుణులు అంటున్నారు.
వాటిని ఓపెన్ చేయొద్దు: సైబర్ సెక్యూరిటీ బ్యూరో
మోసపూరిత సందేశాల నేపథ్యంలో సెల్‌ఫోన్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలంటూ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఆదివారం హ్యాకర్లు ఎస్‌బీఐ పేరిట ఫిషింగ్ స్కామ్‌కు పాల్పడ్డారని, ఎస్‌బీఐ పేరిట వచ్చిన ఏ సందేశాన్ని ఓపెన్ చేయవద్దని అలర్ట్ సందేశాన్ని విడుదల చేశారు. ఆధార్ అప్‌డేట్ కోసం బ్యాంకులు తమ వినియోగదారుల సెల్‌ఫోన్లకు ఎలాంటి సందేశాలు పంపించవని, దీన్ని అందరూ గమనించాలన్నారు. ఇలాంటి సందేశం వచ్చిన నెంబర్‌ను బ్లాక్ చేయాలని పేర్కొన్నారు. ఒకవేళ ఏపీకే ఫైల్‌ను ఇన్‌స్టాల్ చే సి ఉంటే వెంటనే ఆ ఫోన్‌ను ఏరోప్లేన్ మోడ్‌లో పెట్టాలని, మీ బ్యాంకులకు సంబంధించిన కస్టమర్ కేర్‌కు కాల్ చేసి నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డులను బ్లాక్ చేయించుకోవాలని అధికారులు సూచించారు.