Family Tragedy: మైక్రో ఫైనాన్స్ వేధింపులకు వివాహిత బలి
ABN , Publish Date - Nov 24 , 2025 | 04:29 AM
మైక్రోఫైనాన్స్ ఏజెంట్ల వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో ఆదివారం చోటుచేసుకుంది...
మెదక్ జిల్లా తూప్రాన్‌లో ఘటన
తూప్రాన్, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): మైక్రోఫైనాన్స్ ఏజెంట్ల వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో ఆదివారం చోటుచేసుకుంది. తూప్రాన్ ఎస్‌ఐ శివానందం కథనం ప్రకారం... తూప్రాన్‌కు చెందిన ఎన్నెల్లి కృష్ణ, వరలక్ష్మి (35) దంపతులు. వారు క్రిష్ బ్యాంకులో రూ.70వేలు, బంధన్ బ్యాంకులో రూ.69వేలు, ఫైవ్ స్టే బ్యాంకులో రూ.4 లక్షల వరకు ఇంటి అవసరాల నిమిత్తం రుణాలు తీసుకున్నారు. అయితే కొన్ని నెలల నుంచి కృష్ణ ఆరోగ్యం సరిగా లేకపోవడంతో రుణాలు చెల్లించలేకపోయారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఓ బ్యాంకు ఏజెంట్లు ఇంటికి వచ్చి రుణం చెల్లించాలని పట్టుబట్టారు. దీంతో వరలక్ష్మి తీవ్ర మనస్తాపానికి గురై భర్తతో గొడవపడింది. అనంతరం ఇంట్లో నుంచి వెళ్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.