Maoist peace talks: శాంతి చర్చలకు మావోయిస్టు పార్టీ సిద్ధం
ABN , Publish Date - Apr 10 , 2025 | 05:32 AM
శాంతి చర్చలకు మావోయిస్టు పార్టీ సిద్ధమని, అయితే బస్తర్ ప్రాంతంలో పోలీస్ ఆపరేషన్లను నిలిపివేస్తేనే చర్చలకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని మావోయిస్టు నేత రూపేష్ తెలిపారు. ప్రభుత్వం నిర్ధిష్ట చర్యలు ప్రకటించి చర్చలు ప్రారంభించాలంటూ, పీఎల్‌జీఏ దళాలకు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

అనుకూల వాతావరణం ఏర్పరచాలి
ప్రభుత్వం నిర్దిష్ట చర్యలు ప్రకటించాలి
ఆపరేషన్ కగార్‌ను నిలిపివేయాలి
ప్రభుత్వం స్పందించే వరకు పీఎల్‌జీఏ దళాలు అప్రమత్తంగా ఉండాలి
ఉత్తర, పశ్చిమ సబ్ జోనల్ బ్యూరో
అధికార ప్రతినిధి రూపేష్ బహిరంగ లేఖ
హైదరాబాద్, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): శాంతి చర్చల కోసం మావోయిస్టు పార్టీ సిద్ధంగా ఉందని, అయితే ప్రభుత్వం అందుకు అనువైన వాతావరణం ఏర్పరచాలని బస్తర్ ఏరియా ఉత్తర పశ్చిమ సబ్ జోనల్ బ్యూరో అధికార ప్రతినిధి రూపేష్ బహిరంగ లేఖలో పేర్కొన్నారు. అనుకూల వాతావరణం తమవైపు నుంచి ఉందని, ప్రభుత్వం నిర్ధిష్ట చర్యలు ప్రకటించాలని కోరారు. శాంతి చర్చలపై కేంద్ర కమిటీ లేఖ తర్వాత ఛత్తీ్‌సగఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్‌శర్మ స్పందిస్తూ అనుకూల వాతావరణం డిమాండ్‌ను నిరాకరించారని, లొంగుబాటు విధానమే సమస్యకు పరిష్కారమన్న వైఖరితోనే ప్రభుత్వం ఉందని రూపేష్ పేర్కొన్నారు. శాంతి చర్చల ప్రక్రియపై ఒక నిర్ణయం తీసుకునే ముందు తాము స్థానిక నాయకత్వ అభిప్రాయం తీసుకోవడం తప్పనిసరి అని, నిరంతరాయంగా సాగుతున్న పోలీసు ఆపరేషన్ల వల్ల ఇది సాధ్యం కాబోదన్నారు. అనుకూల వాతావరణం కోసం ఆపరేషన్ కగార్‌ను, బస్తర్‌లో హత్యాకాండను వెంటనే ఆపాలని ప్రభుత్వాన్ని కోరారు. పీఎల్‌జీఏ సైన్యాల కార్యక్రమాలు శాంతి చర్చలకు అనుకూల వాతావరణం ఏర్పరిచేలా ఉండాలన్నారు. తమ డిమాండ్‌కు ప్రభుత్వం నుంచి ఇంకా అంగీకార ప్రకటన రాలేదు కాబట్టి అన్ని జాగ్రత్తలు పాటించాలని, దాడులకు గురికావద్దని పీఎల్‌జీఏ దళాలకు సూచించారు. పోలీసు జవాన్లను మావోయిస్టు పార్టీ ఎప్పుడూ శత్రువుగా చూడదని, పరస్పరం పోరాడే స్థితిని సృష్టించారని పేర్కొన్నారు.