Mallojulu Venugopal: మల్లోజుల లొంగుబాట!
ABN , Publish Date - Oct 07 , 2025 | 03:06 AM
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ అలియాస్ సోను.. పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది...
మావోయిస్టు పార్టీని వీడేందుకు సిద్ధమైన పొలిట్ బ్యూరో సభ్యుడు?
పోలీసులతో ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు అనుమానిస్తున్న పార్టీ
తాజాగా మల్లోజుల మరో లేఖ విడుదల
పార్టీ తప్పిదమే పోరాటాన్ని దెబ్బతీసింది
ప్రాణత్యాగాలకు ఫుల్‌స్టాప్ పెట్టాలి
పార్టీ నష్టపోవడంలో నేనూ కారకుడినే
అందుకే తప్పుకొంటున్నా: మల్లోజుల
హైదరాబాద్/చర్ల, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ అలియాస్ సోను.. పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మావోయిస్టు పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన మల్లోజుల.. ఇటీవలి కాలంలో పార్టీ విధానాలను తప్పుబడుతుండడమే అందుకు నిదర్శనమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొద్దిరోజుల క్రితం మావోయిస్టు అభయ్ పేరుతో.. సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా విరమిస్తున్నట్లు లేఖ విడుదల కావడం తెలిసిందే. తాజాగా మల్లోజుల వేణుగోపాల్ పేరుతో మరో లేఖ విడుదలైంది. పార్టీ తప్పిదమే సాయుధ పోరాటాన్ని దెబ్బతీసిందని పేర్కొంటూ 26 పేజీల లేఖను ఆయన విడుదల చేశారు. అభయ్ పేరుతో గతంలో విడుదలైన లేఖపై మావోయిస్టు పార్టీ అప్పుడే స్పందించింది. అభయ్ ప్రకటన ఆయన వ్యక్తిగతమని, దాంతో పార్టీకి సంబంధం లేదని పేర్కొంది. అదే సమయంలో ఇద్దరు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు పోలీసుల ఎదురు కాల్పుల్లో మరణించారు. ఈ నేపథ్యంలో అభయ్ లొంగిపోయేందుకు పోలీసులతో ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు మావోయిస్టు పార్టీ అనుమానిస్తోంది. మరోవైపు కీలక నేతలను బయటకు రప్పించేందుకు పోలీసులు ఆడుతున్న నాటకంలో భాగమనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే మల్లోజుల గానీ, మావోయిస్టు పార్టీ ఇతర కీలక నేతలు గానీ ఎవరూ తమ అదుపులో లేరని తెలంగాణ పోలీసులు అంటున్నారు. అందుకు సంబంధించి సమాచారం లేదని చెబుతున్నారు.
గడువు సమీపిస్తుండడంతో
ఈ ఏడాది మార్చి చివరి నాటికి మావోయిస్టు పార్టీని తుదముట్టిస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అందుకు తగ్గట్లుగానే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో బలగాలు మోహరించి గాలింపు కొనసాగిస్తున్నాయి. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పుల్లో పార్టీ క్యాడర్ ప్రాణాలు కోల్పోతున్నారు. కీలక నేతలు నేలకొరుగుతున్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితుల్ని అంచనా వేస్తున్న పార్టీ క్యాడర్, కీలక నేతలు లొంగుబాటు బాట పట్టారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా కేంద్ర కమిటీ సభ్యులతోపాటు వందల సంఖ్యలో క్యాడర్ పార్టీని వీడి పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. కేంద్రం విధించిన గడువు సమీపిస్తుండడంతో.. మల్లోజుల సైతం లొంగిపోయే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితమే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు సుజాత తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. తాజాగా మరో కేంద్ర కమిటీ సభ్యుడు వైభవ్‌తోపాటు మరొకరు లొంగిపోయినట్లు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈ అంశంపై పోలీసులు ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు.
పరిస్థితులు మారాయి..
ప్రస్తుతం పరిస్థితులు మారాయని, శత్రువులు బలమైన నెట్‌వర్క్‌ను ఏర్పరుచుకున్నారని, తాము ఎక్కడికి వెళ్లినా వెంటనే సమాచారం వెళ్లిపోతోందని మల్లోజుల వివరించారు. దీనిని బట్టి రహస్య పార్టీ నిర్మాణం, విప్లవ నిర్మాణం, ప్రజల మధ్య ఆర్గనైజేషన్ టీం వల్ల జరగదని అర్థమైపోయిందన్నారు. అలాగే జనతన సర్కార్ స్కూళ్లలో చదివే పిల్లలకు ఎంత చదివినా గుర్తింపు లేదని, మళ్లీ బయట స్కూల్‌కు వెళ్తే వారు ఒకటి నుంచి చదవాల్సిందేనని గుర్తు చేశారు. దీనినీ కేంద్ర కమిటీ గుర్తించలేదని తప్పుబట్టారు. ఆధార్ కార్డులు తెచ్చుకోవడాన్ని కూడా పార్టీ వ్యతిరేకించిందని, కొందరు దొంగచాటుగా వెళ్లి కార్డులు తెచ్చుకున్నారని, ఇలాంటి తప్పిదాలు సెంట్రల్ కమిటీ అనేకం చేసిందని ఆరోపించారు. జరిగిన తప్పిదాలపై మాట్లాడితే కమిటీ ఎద్దేవా చేసిందని, నేడు ఫలితం అనుభవిస్తోందని అన్నారు. కగార్ కారణంగా అనేక మంది చనిపోయారని, కొంతమంది లొంగిపోతున్నారని, మరికొంత మంది ప్రమాదవశాత్తు అరెస్టవుతున్నారని తెలిపారు. ఇలాంటి పరిణామాలు సమస్యలకు పరిష్కారాలు కావని, తీవ్రనిర్బంధంలో ఉద్యమాన్ని కొనసాగించలేమని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉద్యమాన్ని కాపాడుకుని, క్యాడర్‌ను రక్షించుకోవాలని, అనవసర త్యాగాలను ఆపాలని మల్లోజుల సూచించారు.
పార్టీ తప్పిదమే సాయుధ పోరాటాన్ని దెబ్బతీసింది: మల్లోజుల
పార్టీ తప్పిదమే సాయుధ పోరాటాన్ని తెబ్బతీసిందని, అందుకే పట్టున్న ప్రాంతాల్లో పార్టీ క్యాడర్‌ను కోల్పోయిందని మావోయిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు మల్లోజులు వేణుగోపాల్ పేర్కొన్నారు. తన ఆవేదనను వినిపిస్తూ ఆయన తాజాగా ఓ లేఖను విడుదల చేశారు. అయితే ఆ లేఖపై ఆగస్టు అని రాసి ఉంది. దీంతో రెండు నెలల క్రితమే ఈ లేఖను ఆయన విడుదల చేసినట్టు తెలుస్తోంది. ఆ లేఖలో పార్టీ చేసిన తప్పిదాలు, ప్రస్తుత పరిస్థితులను ఆయన వివరించారు. ఈ లేఖ చదివి కామ్రేడ్‌లతో చర్చిస్తారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. సుదీర్ఘ ఉద్యమంలో పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీ చేసిన తప్పిదాలే ఉద్యమ పోరాటాన్ని దెబ్బతీశాయని మల్లోజుల పేర్కొన్నారు. కేంద్ర కమిటీ, పొలిట్‌బ్యూరోలో 28 ఏళ్లుగా పని చేస్తూ ఇంతటి నష్టాలు, బలిదానాలు కావడానికి తాను కూడా ఓ కారణమేనని, అందుకే తన బాధ్యతల నుంచి తప్పుకొంటున్నానని తెలిపారు. ఉద్యమంలో పార్టీ అనేక విజయాలు సాధించిందని, కానీ.. దానిని నిలబెట్టుకోలేక పోయిందని పేర్కొన్నారు. ఏడాదికి రెండు, మూడు దాడులు చేసి తమ బలాన్ని ఎక్కువగా ఊహించుకున్నామన్నారు.