Share News

Maoist party: కొత్త అభయ్‌ ఎవరు

ABN , Publish Date - Oct 22 , 2025 | 04:17 AM

వరుసగా అగ్రనేతల ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లు జరుగుతున్నా.. మావోయిస్టు పార్టీ ఎప్పటికప్పుడు మీడియాకు, ప్రజలకు ప్రకటనలు విడుదల చేస్తూ...

Maoist party: కొత్త అభయ్‌ ఎవరు

  • మావోయిస్టు పార్టీ నుంచి ఆ పేరుతో ప్రకటనలు ఇస్తోంది ఎవరు?.. పోలీసు నిఘా వర్గాల ఆరా

  • గతంలో ఆ బాధ్యతల్లో మల్లోజుల

  • ఆయన లొంగుబాటు తర్వాత ఆ స్థానంలోకి తిప్పిరి తిరుపతి?

  • ఆపరేషన్‌ కగార్‌ యుద్ధాన్ని నిరసిస్తూ 24న దేశవ్యాప్త బంద్‌

  • మావోయిస్టు పార్టీ పిలుపు

హైదరాబాద్‌/చర్ల/ములుగు, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): వరుసగా అగ్రనేతల ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లు జరుగుతున్నా.. మావోయిస్టు పార్టీ ఎప్పటికప్పుడు మీడియాకు, ప్రజలకు ప్రకటనలు విడుదల చేస్తూ తమ వైఖరిని స్పష్టం చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై పోలీసు నిఘా వర్గాలు ప్రస్తుతం ఆరా తీస్తున్నట్లు సమాచారం. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్‌ పేరిట విడుదలవుతున్న పత్రికా ప్రకటనలను ఎవరు రాస్తున్నారు అనేదానిపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. సుదీర్ఘకాలంపాటు మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ అధికార ప్రతినిధిగా కొనసాగిన మల్లోజుల వేణుగోపాల్‌రావు అలియాస్‌ సోనూ.. అభయ్‌ పేరిట పత్రికా ప్రకటనలు విడుదల చేస్తుండేవారు. ఆయన ఇటీవల మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ ఎదుట భారీ సంఖ్యలో అనుచరులతో కలిసి, తుపాకులను కూడా సమర్పించి లొంగుపోయిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో మరో అగ్రనేత తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్‌ ఆశన్న ఛత్తీ్‌సగడ్‌లో అనుచరులతో లొంగిపోయారు. ఈ పరిణామాల నేపథ్యంలో.. వీరిద్దరినీ విప్లవద్రోహులుగా ప్రకటిస్తూ, ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా పీడిత ప్రజల కోసం సాయుధపోరు కొనసాగుతుందని, దానికి కట్టుబడి ఉంటామని అభయ్‌ పేరిట మావోయిస్టు పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ క్రమంలో.. అభయ్‌గా బాధ్యతలు స్వీకరించింది ఏవరన్నదానిపై నిఘావర్గాలు ఆరా తీస్తున్నాయి. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్‌ బసవరాజ్‌ మరణం తర్వాత ఆ బాధ్యతలను తిప్పిరి తిరుపతి తీసుకున్నారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో, కేంద్ర కమిటీ అధికార ప్రతినిధిగా ఆయనే వ్యవహరిస్తున్నారని, అభయ్‌ పేరిట ప్రకటనలు విడుదల చేస్తున్నారని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా తిరుపతి నియమితులయ్యారన్న ప్రచారంలో వాస్తవం లేకపోవచ్చునని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. తాజాగా ఆయుధాలతోసహా మావోయిస్టులు పెద్ద సంఖ్యలో లొంగిపోవడంతో ఆ పార్టీలో అంతర్మథనం జరుగుతోందని, ఇంకా లొంగుబాట్లు ఉంటాయా లేక పోరుబాట కొనసాగిస్తారా? పార్టీ పునర్నిర్మాణం చేయగలుగుతారా? అనువైన పరిస్థితులు లేనపుడు మిగతా వారి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయనే విషయాలను తెలుసుకోవడానికి నిఘావర్గాలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.


24న దేశవ్యాప్త బంద్‌

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేషన్‌ కగార్‌ ద్వారా మావోయిస్టు పార్టీ కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులను హత్య చేయడాన్ని నిరసిస్తూ ఈ నెల 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నిరసనవారాన్ని, 24న దేశవ్యాప్త బంద్‌ పాటించాలని మావోయిస్టు పార్టీ ప్రజలకు పిలుపునిచ్చింది. కేంద్రకమిటీ అధికార ప్రతినిధి అభయ్‌ పేరుతో ఈ నెల 15వ తేదీన విడుదలైన ప్రకటన మంగళవారం వెలుగు చూసింది. కార్పొరేట్‌ కంపెనీల ప్రయోజనాల కోసం జరుపుతున్న ఆపరేషన్‌ కగార్‌ యుద్ధంలో గత 22 నెలల్లో దేశవ్యాప్తంగా 700 మందిని హత్య చేశారని ఆరోపించారు. నారాయణపూర్‌లోని మాడ్‌, నేషనల్‌ పార్కు, కర్రెగుట్టలు, సుకుమా జిల్లాలో సాగుతున్న కగార్‌ యుద్ధాన్ని నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలని అభయ్‌ లేఖలో పేర్కొన్నారు.

మావోయిస్టుల లొంగుబాటు

ములుగు జిల్లా పోలీసుల ఎదుట నలుగురు మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ శబరీశ్‌ వివరాలు వెల్లడించారు. ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లాకు చెందిన మావోయిస్టు మిలీషియా కమాండర్‌ మడకం బంది, దళ సభ్యులు మడావి కోసి, మడావి ఎడుమే, తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి చెందిన ముచకి దేవ లొంగిపోయారని తెలిపారు. వీరు కొన్నేళ్లుగా మావోయిస్టు పార్టీలో కొనసాగుతూ పలు ఘటనల్లో పాల్గొన్నారన్నారు. లొంగిపోయిన నలుగురికి తక్షణ సహాయం కింద రూ.25 వేల చొప్పున అందిస్తున్నామని ఎస్పీ తెలిపారు. ఆదివాసి ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం ‘పోరు కన్నా ఊరు మిన్న- మన ఊరికి తిరిగి రండి’ అనే నినాదంతో పోలీసు శాఖ చేపట్టిన కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని పేర్కొన్నారు ములుగు జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకు 84 మంది మాయిస్టులు లొంగిపోయారని, వీరిలో ముగ్గురు డీడీసీఎం, 11 మంది ఏసీఎం క్యాడర్‌ కాగా, 28 మంది పార్టీ సభ్యులు, 32 మంది మిలీషియా సభ్యులు, ఒకరు ఆర్పీసీ మెంబర్‌, ఇద్దరు డీఏకేఎవె్‌స/కేఏఎంఎస్‌ సభ్యులు, ఏడుగురు సీఎన్‌ఎం సభ్యులు ఉన్నారని వివరించారు.

Updated Date - Oct 22 , 2025 | 04:18 AM