Maoist Letters Spark Controversy: మావోయిస్టు లేఖల కలకలం
ABN , Publish Date - Sep 18 , 2025 | 04:46 AM
ప్రాణంతో సమానంగా చూసుకుంటున్న ఆయుధాలను వదిలేస్తామని మావోయిస్టులు నిజంగానే నిర్ణయించారా? ఆయుధాలను వదిలేస్తామంటూ మావోయిస్టు పార్టీ అధికార....
మావోయిస్టుల లేఖలు నిజమైనవేనా?
ఆయుధాలు వదిలేందుకు సిద్ధమయ్యారా?
ఏది అసలు..? ఏది నకిలీ..?
ప్రజాసంఘాలు, మాజీ మావోయిస్టుల భిన్నాభిప్రాయాలు
అదంతా మైండ్‌గేమ్ అంటున్న పోలీసులు
చీలిక దిశగా మావోయిస్టు పార్టీ?
హైదరాబాద్, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): ప్రాణంతో సమానంగా చూసుకుంటున్న ఆయుధాలను వదిలేస్తామని మావోయిస్టులు నిజంగానే నిర్ణయించారా? ఆయుధాలను వదిలేస్తామంటూ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట విడుదలైన లేఖ నిజమైనదేనా? మావోయిస్టులు లేఖల పేరిట మైండ్‌గేమ్ ఆడుతున్నారా? అంటే.. భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అభయ్ పేరిట విడుదలైన లేఖ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మావోయిస్టు పార్టీ పంథాకు పూర్తి విరుద్ధమైన అంశాలు లేఖలో ఉండడం, లేఖపై అభయ్ ఫొటో ముద్రించి ఉండడం, ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడం కోసమంటూ ఈమెయిల్, ఫేస్‌బుక్ ఐడీలు ఇవ్వడం చూస్తుంటే అది పక్కాగా నకిలీ లేఖేనని ప్రజా సంఘాల నేతలు, మాజీ మావోయిస్టులు పేర్కొంటున్నారు. ఒకవేళ ఈలేఖ నిజమైనదే అయితే మాత్రం మావోయిస్టు పార్టీ చీలిక దిశగా పయనిస్తోందన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి మావోయిస్టు పార్టీ కేంద్ర అధికార ప్రతినిధి ఇటీవల ఓ లేఖ విడుదల చేశారు. అందులో ఆపరేషన్ కగార్‌ను ప్రస్తావిస్తూ.. తమ పార్టీ క్యాడర్ పలు సందర్భాల్లో పోలీసులను సమర్థంగా ఎదుర్కొంటోందని, పోలీసులకు జరిగిన నష్టాన్ని, మరణాలను వెల్లడించడం లేదని పేర్కొన్నారు.
కర్రెగుట్టల వద్ద అమర్చిన బూబీ ట్రాప్‌ల్లో చిక్కుకుని దాదాపు 50 మందికి పైగా పోలీసులు మరణించారని, ఈ విషయాన్ని ప్రభుత్వం దాచిపెడుతోందని ఆరోపించారు. అలాగే కర్రెగుట్టల సమీపంలో తమకు, గ్రేహౌండ్స్ పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు కానిస్టేబుళ్లు మరణించారని, పోలీసులు ఆ విషయాన్ని మార్చి చెప్పారని లేఖలో ప్రస్తావించారు. ఇటీవల మావోయిస్టు సీనియర్ నేత పోతుల పద్మావతి డీజీపీ జితేందర్ సమక్షంలో లొంగిపోయిన క్రమంలో మావోయిస్టు లేఖ, గ్రేహౌండ్స్ కానిస్టేబుళ్ల మరణాలపై ‘ఆంధ్రజ్యోతి’ విలేకరి అడిగిన ప్రశ్నకు.. మైండ్‌గేమ్‌లో భాగంగానే మావోయిస్టులు ఆ లేఖను జారీ చేసి ఉండొచ్చని డీజీపీ బదులిచ్చారు. అంటే మావోయిస్టులు లేఖల ద్వారా మైండ్‌గేమ్ ఆడుతున్నారని ఆయనే అంగీకరించారన్నమాట. మావోయిస్టులతో చర్చలు జరపాలని శాంతి సంఘా లు కోరుతుండగా.. ఆయుధాలు వదిలి లొంగిపోవాలని, వారితో చర్చల ప్రసక్తే లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పలుమార్లు స్పష్టం చేశారు.
పార్టీలో సమన్వయ లోపం?
ఆయుధాలు వదిలిపెట్టే విషయంలో మావోయిస్టు పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు సమాచారం. ఆపరేషన్ కగార్ ప్రారంభమైన తర్వాత మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు, పొలిట్‌బ్యూరో మధ్య సమాచార, సమన్వయ లోపం ఉన్నట్లు తెలుస్తోంది. పోతుల పద్మావతి లొంగుబాటుకు మే నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాను లొంగిపోవాలనుకుంటున్న విషయాన్ని పద్మావతి కేంద్ర కమిటీ బాధ్యులకు, పొలిట్ బ్యూరోకు తెలియజేసింది. కానీ, వారి నుంచి అనుమతి రావడానికి 4 నెలలు పట్టింది. మావోయిస్టు పార్టీ నూతన సారథిగా పోటీలో ఉన్న మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ తనకు ఆ స్థానం దక్కకపోవడంతోనే ఈ లేఖ విడుదల చేశారా? పార్టీ నుంచి ఆయన విడిపోవడానికి నిర్ణయించుకున్నారా? లేక మల్లోజుల పేరిట లేఖను సృష్టించి, పార్టీలో ఆయనపై అనుమానాలు రేకెత్తించడానికి పోలీసులు చేసిన ప్రయత్నమా? అన్న విషయంలో వామపక్ష మేధావుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.