Maoist Leader Damodar Arrested: మావోయిస్టు నేత దామోదర్ అరెస్ట్?
ABN , Publish Date - Dec 17 , 2025 | 05:01 AM
మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్‌తోపాటు అతడి అనుచరులను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిసింది......
ఆయనతో పాటు మరో 15 మంది మావోయిస్టులను కూడా అదుపులోకి తీసుకున్న ఆసిఫాబాద్ పోలీసులు!
సిర్పూర్ పరిధిలోని అటవీ ప్రాంతంలో కూంబింగ్
ఎదురు కాల్పులకు ఆస్కారం లేకుండా అరెస్టులు
హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయానికి తరలింపు!
ఛత్తీ్‌సగఢ్‌లో 34 మంది మావోయిస్టుల లొంగుబాటు
ఆసిఫాబాద్/చర్ల/ములుగు/కామారెడ్డి, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్‌తోపాటు అతడి అనుచరులను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిసింది. కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యూ) మండలంలోని పెద్దదోబ అటవీ ప్రాంతంలో సోమవారం రాత్రి 16 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ ఇంట్లో మావోయిస్టులు తలదాచుకున్నారన్న సమాచారం మేరకు ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. ఎదురు కాల్పులకు తావు లేకుండానే వారందరినీ అదుపులోకి తీసుకున్నాయి. పట్టుబడిన వారిలో తొమ్మిది మంది మహిళలు, ఏడుగురు పురుషులు ఉన్నారు. వీరందరూ ఛత్తీ్‌సగఢ్‌కు చెందిన వారని పోలీసులు చెబుతున్నా.. మాయిస్టు పార్టీ కీలక నేత బడే చొక్కారావు సైతం వారిలో ఉన్నట్లు తెలుస్తోంది. మిగతా వారందరూ అతడి అనుచరులుగా భావిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న మావోయిస్టులను హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయానికి తరలించినట్లు సమాచారం. ఈ విషయమై స్థానిక పోలీసు ఉన్నతాధికారులు ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. అదుపులోకి తీసుకున్న మావోయిస్టుల వివరాలను స్వయంగా డీజీపీ కార్యాలయంలోనే వెల్లడించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
దామోదర్‌ది ములుగు జిల్లా...
బడే చొక్కారావు అలియాస్ దామోదర్‌ది ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామం. మావోయిస్టు పార్టీలో కీలక నేతగా ఉండి 2008లో తాడ్వాయి అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన బడే నాగేశ్వర్‌రావుకు సోదరుడైన దామోదర్.. చిన్న వయసులోనే మావోయిస్టు పార్టీ భావాజాలానికి ఆకర్షితులయ్యారు. 1993లో అప్పటి పీపుల్స్‌వార్‌లో చేరి.. మావోయిస్టు పార్టీలో అంచలంచెలుగా రాష్ట్ర కార్యదర్శి స్థాయికి ఎదిగారు. ఏటూరునాగారం ఎస్టీ హాస్టల్‌లో పదోతరగతి వరకు చదువున్న దామోదర్‌కు ములుగు, భూపాలపల్లి అటవీ ప్రాంతంపై మంచి పట్టు ఉంది. రిక్రూట్‌మెంట్‌తోపాటు ఇన్‌ఫార్మర్లపై దాడులు చేయడంలో దిట్టగా ఆయనకు పేరుంది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం అలుబాకలో బీఆర్‌ఎస్ నేత భీమేశ్వర్‌రావు, ములుగు జిల్లా మల్లంపల్లి గ్రామానికి చెందిన హోంగార్డు ఈశ్వర్ హత్యల వెనుక దామోదర్ వ్యూహం ఉన్నట్లుగా అప్పట్లో నిఘా వర్గాలు గుర్తించాయి. గత ఏడాది జనవరిలో ఛత్తీ్‌సగఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో దామోదర్ మృతి చెందినట్లు వార్తలు రాగా.. మావోయిస్టు పార్టీ ఖండించింది. తాజాగా పోలీసుల అదుపులో దామోదర్ ఉన్నారన్న వార్త.. బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. కాగా, పోలీసులకు దామోదర్ చిక్కలేదని ఆయన స్వగ్రామంలో ప్రచారం జరుగుతోంది. దామోదర్ అరెస్టు విషయమై దామోదర్ తల్లి మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. తన కొడుకును కొట్టవద్దని పోలీసులను వేడుకున్నారు. తన కొడుకును చూపించాలని అభ్యర్థించారు. తన ఆరోగ్యం క్షీణిస్తోందని, కళ్లు సరిగ్గా కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, పోలీసులు అరెస్టు చేసిన వారిలో కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఆరేపల్లికి చెందిన ఎర్రగోల్ల రవి అలియాస్ దినేష్ అలియాస్ సంతోష్ సైతం ఉన్నట్లు తెలిసింది. 2001లో అజ్ఞాతంలోకి వెళ్లిన రవి.. ప్రస్తుతం దళకమాండర్ హోదాలో డివిజన్ కమిటీ సభ్యుడిగా పని చేస్తున్నారు. రవిపై రూ.5లక్షల రివార్డు ఉంది.
బీజాపూర్‌లో 34 మంది లొంగుబాటు
ఛత్తీ్‌సగఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఎస్పీ జితేందర్ యాదవ్ ఎదుట మంగళవారం 34మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ లొంగిపోయిన 34మంది మావోయిస్టులు.. దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ, తెలంగాణ రాష్ట్ర కమిటీ, ఏవోబీ కమిటీలకు చెందిన సభ్యులని తెలిపారు. వీరిపై 84లక్షల రివార్డు ఉందని పేర్కొన్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పిస్తున్నామని, ఉపాధి మార్గాల వైపు శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. వచ్చే మార్చి 31నాటికి మావోయిస్టులు లేని జిల్లాగా బీజాపూర్ ఉంటుందని స్పష్టం చేశారు.