Maoist Factions Signal Mass Surrender: జనవరి 1న అంతా లొంగిపోతాం
ABN , Publish Date - Nov 29 , 2025 | 03:49 AM
మావోయిస్టుల ఏరివేత అంశంలో కేంద్ర ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తున్న వేళ.. వారి నుంచి కీలక ప్రకటన విడుదలైంది. ఒక్కొక్కరుగా కాకుండా మావోయిస్టులమంతా ఒకేసారి.
ఆయుధాలు కూడా అప్పగిస్తాం.. ఆపరేషన్ కగార్‌ను నిలిపివేయండి
మూడు రాష్ట్రాల స్పెషల్ జోనల్ కమిటీప్రతినిధి అనంత్ పేరిట లేఖ
ఆపై గంటల్లోనే లొంగిపోయిన అనంత్
మహారాష్ట్రలో అనంత్ సహా 15 మంది లొంగిపోయినట్లు వార్తలు
ఛత్తీ్‌సగఢ్‌లో మరో 10 మంది
చర్ల, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టుల ఏరివేత అంశంలో కేంద్ర ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తున్న వేళ.. వారి నుంచి కీలక ప్రకటన విడుదలైంది. ఒక్కొక్కరుగా కాకుండా మావోయిస్టులమంతా ఒకేసారి.. 2026 జనవరి 1న ఆయుధాలు వదిలి లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నామని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీ్‌సగఢ్(ఎంఎంసీ) స్పెషల్ జోనల్ కమిటీ ప్రకటించింది. అయితే, అందుకు జనవరి 1 దాకా కాల్పుల విరమణ పాటించాలని షరతు పెట్టింది. అలాగే, తమ భద్రతకు, పునరావాస ప్రక్రియ పారదర్శకంగా జరిగేందుకు ఆయా రాష్ట్రాలు తమకు స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ ఎంఎంసీ స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి అనంత్ పేరిట శుక్రవారం ఓ లేఖ విడుదలైంది. అయితే ఈ లేఖ విడుదలైన కొద్ది గంటల్లోనే అనంత్ సహా 15 మంది మావోయిస్టులు మహారాష్ట్రలోని గొండియా జిల్లా సరిహద్దుల్లో లొంగిపోయారు. కాగా, అనంత్ రాసిన లేఖలో, ‘‘మూడు రాష్ట్రాల సీఎంలకు ఈ లేఖ రాస్తున్నాం. జనవరి 1న సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా విరమించుకుని, ఆయుధాలు వదిలిపెట్టి జనజీవన స్రవంతిలో కలుస్తాం. అప్పటిదాకా మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు సంయమనం పాటించి.. కూంబింగ్‌లు నిలిపివేయాలి. ఎక్కడా అరెస్టులు, ఎన్‌కౌంటర్లు వంటివాటికి పాల్పడవద్దు. కూంబింగ్‌లు జరిగితే అందరినీ కలవడం కష్టం. మేమే పెద్ద సంఖ్యలో లొంగిపోతాం. సతీశ్‌దాదా, సోనూ దాదాలు సీఎంల సమక్షంలో లొంగిపోయినట్లు మేం కూడా ఆయుధాలతో సహా వచ్చి మాకు భరోసానిచ్చే ప్రభు త్వం వద్ద లొంగిపోతాం. మా లొంగుబాటుపై ఛత్తీ్‌సగఢ్ ప్రభుత్వం నుంచి స్పందన వచ్చింది. ఇంకా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రభుత్వాల నుంచి స్పందన రాలేదు. వారు కూడా స్పందించాలి. మేం లొంగుబాటు ప్రక్రియ పూర్తయ్యేవరకు ఎలాంటి ఘటనలకు పాల్పడబోం. మా సహచరులందరికీ ఆడియో ద్వారా ఈ విషయం తెలియజేశాం. మావోయిస్టులు అందరూ లొంగిపోవడానికి బావొఫెంగ్ యొక్క ఫ్రీక్వెన్సీ నంబరును 435.715 జారీ చేస్తున్నాం. జనవరి 1లోపు ఉదయం 11 నుంచి 11:15 గంటల మధ్య ఒకరితో ఒకరు కనెక్టయి చర్చించాలి’’ అని పేర్కొన్నారు. కాగా, జనవరి 1న లొంగిపోతామంటూ శుక్రవారం లేఖ రాసిన మావోయిస్టు పార్టీ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీ్‌సగఢ్ స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి అనంత్.. ఆ తరువాత కొద్ది గంటల వ్యవధిలోనే లొంగిపోయారు. తనతో సహా 15 మంది అనుచరుల బృందంతో మహారాష్ట్రలోని గొండియా జిల్లా సరిహద్దుల్లో లొంగిపోయినట్లు వార్తలు వచ్చాయి. వారి బృందంతో కూడిన ఓ ఫొటో కూడా విడుదలైంది. ఛత్తీ్‌సగఢ్‌కు చెందిన ఓ జర్నలిస్టు ద్వారా అనంత్ బృందం లొంగిపోయినట్లు సమాచారం. మరోవైపు ఛత్తీ్‌సగఢ్‌లోని జగదల్‌పూర్‌లో శుక్రవారం మరో 10 మంది మావోయిస్టులు బస్తర్ ఐజీ సుందర్‌రాజ్ సమక్షంలో లొంగిపోయారు. వారిలో దర్బా డివిజన్ ఇన్‌చార్జ్ చైతూ అలియాస్ శ్యామ్ ఉన్నారు. 2013లో సల్వా జుడుం నేత మహేంద్రకర్మను హత్య చేసిన ఘటనలో చైతూ ప్రధాన నిందితుడు.
దేవా లొంగిపో.. తల్లి అభ్యర్థన
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మాద్వి హిడ్మా ఇటీవల ఎన్‌కౌంటర్‌లో మరణించడంతో.. ఆయన తర్వాత ఆ స్థాయి నాయకుడు బర్సె దేవా అని తెలుస్తోంది. దేవా పీఎల్‌జీఏ మొదటి బెటాలియన్ కమాండర్‌గా వ్యవహరిస్తున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో దేవా గురించి తెలుసుకోవడానికి తెలంగాణ మీడియా శుక్రవారం ఛత్తీ్‌సగఢ్‌లోని వోయో పార గ్రామానికి వెళ్లింది. హిడ్మా, దేవా తల్లులు ఇద్దరూ అక్కాచెల్లెళ్లని గ్రామస్తులు తెలిపారు. దేవా చిన్నతనంలోనే మావోయిస్టు పార్టీలోకి వెళ్లారని ఆయన తల్లి సింఘే చెప్పారు. దేవాకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని, పిల్లలు సుకుమా జిల్లాలో చదువుకుంటుండగా, భార్య గ్రామంలోనే ఉంటున్నారని తెలిపారు. దేవా లొంగిపోవాలని ఆమె కోరారు.