Share News

Police Operation: అబూజ్‌మడ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

ABN , Publish Date - Sep 23 , 2025 | 06:40 AM

వరుస ఎన్‌కౌంటర్లలో అగ్ర నాయకత్వాన్ని కోల్పోతున్న మావోయిస్టు ఉద్యమానికి మరో ఎదురుదెబ్బ. ఛత్తీస్‌గఢ్ లోని నారాయణపూర్‌ జిల్లా అబూజ్‌మడ్‌ అడవుల్లో సోమవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీకి చెందిన కేంద్ర కమిటీ(సీసీ) సభ్యులు...

Police Operation: అబూజ్‌మడ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

  • మావోయిస్టు కేంద్రకమిటీ సభ్యులు కట్టా రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణరెడ్డి మృతి

  • రాజుదాదా(వికల్ప్‌), కోసా పేరిట 30 ఏళ్లుగా దండకారణ్యంలో ఉద్యమ జీవితం

  • ఇద్దరూ కరీంనగర్‌ వాసులే

  • కేంద్ర కమిటీ సభ్యులిద్దరు ఒకే ఎన్‌కౌంటర్‌లోచనిపోవడం గత పాతికేళ్లలో ఇదే తొలిసారి

  • ఈ ఒక్క నెలలోనే నలుగురు సీసీలు మృతి

  • మరో సీసీ సుజాత లొంగుబాటు

  • కేంద్రకమిటీలో మిగిలింది ఎనిమిది మందే

  • ఆయుధాలు దించేది లేదు!

  • సోనూది ఉద్యమ ద్రోహం: మావోయిస్టు పార్టీ

  • సోనూ స్థానంలో అధికార ప్రతినిధిగా ‘కోసా’

  • వికల్ప్‌తో కలిసి ప్రకటన.. ఇంతలో ఎన్‌కౌంటర్‌

  • కోవర్టు ఆపరేషన్‌ ద్వారా ఎన్‌కౌంటర్‌!

చర్ల, చింతూరు, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): వరుస ఎన్‌కౌంటర్లలో అగ్ర నాయకత్వాన్ని కోల్పోతున్న మావోయిస్టు ఉద్యమానికి మరో ఎదురుదెబ్బ. ఛత్తీస్‌గఢ్ లోని నారాయణపూర్‌ జిల్లా అబూజ్‌మడ్‌ అడవుల్లో సోమవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీకి చెందిన కేంద్ర కమిటీ(సీసీ) సభ్యులు కట్టా రామచంద్రారెడ్డి (రాజుదాదా, వికల్ప్‌, ఉసెండీ) (63), కడారి సత్యనారాయణ రెడ్డి (కోసాదాదా, గోపన్న, బుచ్చన్న) (67) మృతిచెందారు. వీరిద్దరిదీ తెలంగాణలోని కరీంనగర్‌ జిల్లా. వీరిద్దరిపై రూ.40 లక్షలు చొప్పున రివార్డు ఉంది. ఘటనాస్థలం నుంచి ఏకే 47, ఇన్సాస్‌ రైఫిల్‌, బీజీఎల్‌ లాంచర్‌, భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. గత పాతికేళ్లలో ఒకరి కంటే ఎక్కువ మంది కేంద్రకమిటీ సభ్యులు ఒక ఎన్‌కౌంటరులో చనిపోవడం ఇదే తొలిసారి. 1999లో జరిగిన కొయ్యూరు ఎన్‌కౌంటరులో కేంద్ర కమిటీ సభ్యులు నల్లా ఆదిరెడ్డి (శ్యామ్‌, రఘు), ఎర్రంశెట్టి సంతోశ్‌రెడ్డి (మహేశ్‌) చనిపోయారు. ఇక.. ఈ ఒక్క నెలలోనే నలుగురు కేంద్ర కమిటీ సభ్యులు మరణించగా, మరో సీసీ మెంబరు, పశ్చిమ బెంగాల్‌లో ఎన్‌కౌంటర్‌ అయిన మల్లోజుల కోటేశ్వర్‌రావు (కిషన్‌జీ) భార్య పోతుల కల్పన (సుజాత) తెలంగాణ పోలీసులకు లొంగిపోయారు. పోలీసు వర్గాల కథనం ప్రకారం.. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లోని అబూజ్‌మడ్‌ అడవుల్లో మావోయిస్టులు ఉన్నట్లు కేంద్ర బలగాలకు సమాచారం అందింది. దీంతో కేంద్ర బలగాలు కూంబింగ్‌ చేపట్టాయి. సోమవారం ఉదయం నుంచి మావోయిస్టులు, బలగాల మధ్య అడపాదడపా కాల్పులు జరిగాయి. అనంతరం ఘటనాస్థలంలో గాలించగా, ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలు కనిపించినట్టు నారాయణపూర్‌ ఎస్పీ రాబిన్‌సన్‌ తెలిపారు. వారిని అగ్ర మావోయిస్టులుగా గుర్తించినట్టు పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్‌ను ఛత్తీస్‌గఢ్ ఉపముఖ్యమంత్రి విజయశర్మ, ఐజీ సుందర్‌రాజ్‌ ధ్రువీకరించారు. అడవుల్లో వర్షాలు కురుస్తూ కఠిన పరిస్థితులున్నా బలగాలు విజయాలు సాధిస్తున్నాయని అన్నారు.


టార్గెట్‌ కేంద్ర కమిటీ..మిగిలింది ఎనిమిది మందే

వచ్చే ఏడాది మార్చి 31నాటికి ఆపరేషన్‌ కగార్‌ను ముగించాలన్న కేంద్రం ఆదేశాలతో బలగాలు కూంబింగ్‌ ముమ్మరంగా చేస్తున్నాయి. కేంద్ర కమిటీ సభ్యులే లక్ష్యంగా ఎన్‌కౌంటర్లు చేస్తున్నాయి, ఇందుకుకోసం ప్రత్యేక శాటిలైట్‌ టెక్నాలజీని బలగాలు వినియోగించుకుంటున్నట్టు తెలుస్తోంది. గతేడాది నుంచి చూస్తే కేంద్రకమిటీ సభ్యులు చలపతి, మాం ఘీ, గణేశ్‌, మోడెం బాలకృష్ణ, సహదేవ్‌, తాజాగా రాంచంద్రారెడ్డి, సత్యనారాయణ రెడ్డి...మొత్తం 8మంది మృతి చెందారు. ఈ ఏడాది మే 25న ఎన్‌కౌంటర్‌ అయిన కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాళ కేశవరావు అలియాస్‌ బస్వరాజ్‌ను కలుపుకొంటే ఈ సంఖ్య తొమ్మిదికి చేరింది. మరో సీసీ మెంబరు సుజాత పోలీసులకు లొంగిపోయారు. మొత్తం కేంద్ర కమిటీలో ప్రస్తుతం ఎనిమిది మందే ఉన్నట్టు పోలీసువర్గాలు భావిస్తున్నాయి. కాగా, తాజా ఎన్‌కౌంటర్‌పై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నచోట మూడంచెల భద్రత ఉంటుందని, అందులో ఎవరూ చనిపోకుండా కేవలం ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు ఎలా చనిపోతారని ప్రజాస్వామిక, పౌర హక్కుల సంస్థలు ప్రశ్నిస్తున్నాయి. లొంగిపోయిన వారు ఇచ్చిన సమాచారంతో పట్టుకుని చంపి ఉంటారని ప్రచారం జరుగుతోంది. కాగా, కటా ్టరామచంద్రారెడ్డిది కరీంనగర్‌ జిల్లా కోహిడ్‌పేట మండలం తీగలకుంట. కడారి సత్యనారాయణది అదే జిల్లాలోని సిరిసిల్ల మండలం గోపాలరావుపల్లి. వీరిద్దరూ దండకారణ్య స్పెష ల్‌ జోనల్‌ కమిటీ కార్యకలాపాల్లో చురుగ్గా ఉన్నారు. జవాన్లను చంపివేసిన ఘటనల్లో పలు కేసులు వీరిపై నమోదయ్యాయి.


  • బడితె వదిలి బందూకు పట్టి

  • 36ఏళ్ల క్రితం టీచర్‌ ఉద్యోగాన్ని వదిలేసి

  • అజ్ఞాతంలోకి వెళ్లిన కట్టా రామచంద్రారెడ్డి

  • గుడ్సా ఉస్సెండి, విజయ్‌, వికల్ప్‌ పేర్లతో ప్రసిద్ధి

  • అంచలంచెలుగా కేంద్ర కమిటీ సభ్యుడి దాకా..

సిద్దిపేట, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): బడిలో పాఠాలు చెప్పిన మాస్టారు బడితెను వదిలి బందూకు పట్టారు. రేపటి పౌరులను తీర్చిదిద్దడం కంటే నేటి సమాజాన్ని చక్కదిద్దడమే తక్షణ కర్తవ్యంగా అజ్ఞాతంలోకి వెళ్లారు. మూడున్నర దశాబ్దాల అలుపెరుగని పోరాటానికి సెలవు పలుకుతూ అబూజ్‌మడ్‌ ఎన్‌కౌంటర్‌లో అసువులు బాశారు కట్టా రామచంద్రారెడ్డి అలియాస్‌ అలియాస్‌ రాజు దాదా, గుడ్సా ఉసెండీ, విజయ్‌, వికల్ప్‌. కరీంనగర్‌ జిల్లా కోహెడ మండలం తీగలకుంటపల్లికి చెందిన కట్టా వజ్రవ్వ, మల్లారెడ్డి దంపతులకు జన్మించిన రామచంద్రారెడ్డి.. భూపాలపల్లి, సిద్దిపేట జిల్లాల్లో ఉపాధ్యాయుడిగా పని చేశారు. అప్పట్లోనే శాంతి అనే మహిళను కులాంతర వివాహం చేసుకున్నారు. 1989లో విప్లవోద్యమానికి ఆకర్షితులై భార్యతో కలిసి అప్పటి పీపుల్స్‌వార్‌లో చేరారు. వీరికి కొడుకు, కూతురు ఉండగా, కొద్దిరోజుల తర్వాత ఆయన భార్య శాంతి లొంగిపోయారు. ప్రస్తుతం పిల్లలతో కలిసి ఆమె హైదరాబాద్‌లో ఉంటున్నారు. మావోయిస్టు పార్టీలో గుడ్సా ఉస్సెండీ, విజయ్‌, వికల్ప్‌ పేర్లతో ఈస్ట్‌ బస్తర్‌ ప్రాంతంలో అనేక కార్యక్రమాలు చేపట్టిన రామచంద్రారెడ్డి.. కొన్నేళ్ల క్రితమే పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టారు. ఆయనపై రూ.40లక్షల రివార్డు ఉంది. రామచంద్రారెడ్డి మృతితో తీగలకుంటపల్లిలో విషాదం నెలకొంది. రామచంద్రారెడ్డి మృతదేహాన్ని తీసుకురావడానికి కుమారుడు రాజు, ఇతర బంధువులు..ఛత్తీస్‌గఢ్ తరలివెళ్లారు.


  • 45 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లి!

  • కోసగా పేరొందిన కడారి సత్యనారాయణరెడ్డి

  • అంచలంచెలుగా సెంట్రల్‌ కమిటీ సభ్యుడి స్థాయికి..

  • మృతి వార్తతో సిరిసిల్ల జిల్లా గోపాలపురంలో విషాదం

సిరిసిల్లక్రైం, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణరెడ్డి అలియాస్‌ కోస అలియాస్‌ గోపన్న అలియాస్‌ సాధు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారన్న వార్తతో ఆయన స్వగ్రామమైన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గోపాల్‌రావుపల్లిలో విషాద చాయలు నెలకొన్నాయి. కడారి అన్నమ్మ, కృష్ణారెడ్డి దంపతులకు 1955లో సత్యనారాయణరెడ్డి జన్మించారు. ఎల్లారెడ్డిపేటలో 10వ తరగతి వరకు చదివిన సత్యనారాయణరెడ్డి.. పెద్దపల్లిలో ఐటీఐ చదువుతుండగా(1975-77 మధ్య) ర్యాడికల్‌ విద్యార్థి ఉద్యమం వైపు ఆకర్షితులయ్యారు. రామగుండంలోని కేశోరాం సిమెంట్‌ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తూ మల్లోజుల కోటేశ్వర్‌రావు(కిషన్‌జీ) నాయకత్వంలో అప్పటి పీపుల్స్‌వార్‌లో చేరారు. 45ఏళ్లుగా పీపుల్స్‌వార్‌, మావోయిస్టు పార్టీలో పని చేస్తూ గెరిల్లా యుద్ధ నిపుణుడిగా పేరు పొందిన కోస... దండకారణ్య స్పెషల్‌ జోన్‌ కమిటీ కార్యదర్శిగా, మిలిటరీ కమాండర్‌గా, సెంట్రల్‌ కమిటీ సభ్యుడిగా పని చేశారు. 1980లో ఉగాది పండుగ నాడు గోపాల్‌రావుపల్లికి వచ్చి కుటుంబ సభ్యులను కలిసిన కోస.. ఆ తర్వాత మళ్లీ ఇటువైపు కన్నెత్తి చూడలేదు. పోలీసులకు ఎలాంటి ఆనవాళ్లు దొరకకుండా అప్పట్లోనే తన ఫొటోలు, సర్టిఫికెట్లు తీసుకెళ్లారు. పార్టీలో ఉంటూనే 1984లో రాధను వివాహం చేసుకున్నారు. 2012లో తల్లి అన్నమ్మ, 2013లో తండ్రి కృష్ణారెడ్డి మరణించిన సందర్భాల్లో కోసా వస్తారని పోలీసులు నిఘా ఉంచినా.. రాలేదు. దేశవ్యాప్తంగా కోసపై రూ.3కోట్ల మేర రివార్డు ఉంది. తాజాగా ఎన్‌కౌంటర్‌లో ఆయన మృతి చెందారన్న వార్తతో గోపాల్‌రావుపల్లిలోలో విషాదచాయలు అలుముకున్నాయి. మీడియాలో వస్తున్న ఫొటోల్లో ఉన్నది తన సోదరుడు కాకపోవచ్చని కోస సోదరుడు కరుణాకర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.


  • కోవర్టు ఆపరేషన్‌లో భాగమే ఎన్‌కౌంటర్‌

  • న్యాయ విచారణ చేపట్టాలి: పౌరహక్కుల సంఘం

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): అబూజ్‌మడ్‌ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కడారి సత్యనారాయణ రెడ్డి అలియాస్‌ కోస, కట్టా రామచంద్రారెడ్డి అలియాస్‌ రాజు మృతి చెందడంపై పౌర హక్కుల సంఘం అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ ఎన్‌కౌంటర్‌ ఓ బూటకమని, కోవర్టు ఆపరేషన్‌లో భాగంగానే కేంద్ర కమిటీ సభ్యులను పోలీసులే కాల్చి చంపారని సంఘం నాయకులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇతరులు ఎవ్వరూ మరణించకుండా, పటిష్ఠ భద్రత ఉండే కేంద్ర కమిటీ సభ్యులు ఇద్దరు మాత్రమే మరణించినట్లు పోలీసులు వెల్లడించడం విడ్డూరంగా ఉందన్నారు. 21నెలలుగా మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం అనైతిక యుద్ధం సాగిస్తోందని పౌరహక్కుల సంఘం నేత గడ్డం లక్ష్మణ్‌ ఆరోపించారు. ఆపరేషన్‌ కగార్‌ను వెంటనే ఆపి, ప్రజాసమస్యలపై మోదీ ప్రభుత్వం దృష్టిపెట్టాలని డిమాండ్‌ చేశారు. డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డు దళాల చర్యలు చట్టవ్యతిరేకమని పౌరహక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎన్‌. నారాయణరావు అన్నారు. బూటకపు ఎన్‌కౌంటర్లపై న్యాయవిచారణ జరిపించాలని, దండకారణ్యంలో ఉన్న పోలీసు బలగాలనువెనక్కి పిలిపించాలని డిమాండ్‌ చేశారు.


ఆయుధాలు దించేది లేదు!

సోనూది ఉద్యమ ద్రోహమే

మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రకటన

సోనూ ప్రకటనను తీవ్రంగా ఖండిస్తూ అభయ్‌, వికల్ప్‌ పేరిట ఈనెల 20వ తేదీన వెలువడిన ప్రకటనలోని ముఖ్యాంశాలివి...

‘‘సాయుధ పోరాటమే పార్టీ విధానం. దానికే కట్టుబడి ముందుకు సాగుతాం. అలాగే... శాంతి చర్చలను కూడా బలంగా కోరుకుంటున్నాం. శాంతి చర్చలను సులభతరం చేసే ప్రయత్నాలకు ప్రతిస్పందనగా మా పార్టీ ప్రధాన కార్యదర్శి, అమరవీరుడు బస్వరాజు ఆయుధాలు విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారని సోనూ చేసిన ప్రకటన సత్యాన్ని వక్రీకరించడమే. ఆయుధాలు విడిచిపెట్టేందుకు అందరి అభిప్రాయాలను కోరడం పార్టీని విచ్ఛిన్నం చేయడానికి చేసిన దుష్టకుట్ర. దీనిని విరమించుకోవాలని సోనూను కోరుతున్నాం. పార్టీ సాయుధ విప్లవ పంథా ఓడి పోయిందని, అనేక వ్యూహాత్మక, అతివాద తప్పిదాల వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని సోనూ రాశారు. ఈ విప్లవ విధానాన్ని విడిచిపెట్టి బయటకు వెళ్లాలని ఆయన నిర్ణయించుకున్నారు. పార్టీ విధానం తప్పయితే, ఆయన ప్రత్యామ్నాయ విధానాన్ని రూపొందించి అంతర్గత చర్చ ప్రారంభించవచ్చు. కానీ, ఆయన అలా చేయడానికి ఇష్టపడటం లేదు. ఆయుధాలు వీడటం అంటే శత్రువుకు లొంగిపోవడమే. సోనూ, అతని సహచరులు శత్రువుకు లొంగిపోవాలనుకుంటే లొంగిపోవచ్చు. అలా లొంగిపోవాలనుకుంటే వారి వద్ద ఉన్న ఆయుధాలను పార్టీకి అప్పగించాలి. లేదంటే వాటిని స్వాధీనం చేసుకోవాలని పీఎల్‌జీఏను కోరుతున్నాం.’’

Updated Date - Sep 23 , 2025 | 06:44 AM