Maoist Randheer Surrender: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రాంధేర్ లొంగుబాటు
ABN , Publish Date - Dec 09 , 2025 | 03:27 AM
మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు రాంధేర్ మాంజీ సోమవారం లొంగిపోయాడు. ఆయనతో పాటు మరో 11 మంది మావోయిస్టులు కూడా లొంగిపోయారు....
ఆయనపై రూ.కోటి రివార్డు.. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో లొంగిపోయిన 22 మంది మావోయిస్టులు
పామేడు అడవుల్లో కాంట్రాక్టర్ హత్య
చర్ల, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు రాంధేర్ మాంజీ సోమవారం లొంగిపోయాడు. ఆయనతో పాటు మరో 11 మంది మావోయిస్టులు కూడా లొంగిపోయారు. రాంధేర్‌పై సుమారు రూ.కోటి రివార్డు ఉన్నట్లు తెలుస్తోంది. ఏకే 47తో సహా 10 తుపాకులను పోలీసులకు అప్పగించారు. మాంజీ గత 30 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో పని చేస్తున్నాడు. అబూజ్‌మడ్ ప్రాంతంలో ఎంఎంసీ కమిటీతో పాటు రాంధేర్ కమిటీ సభ్యులు కూడా ఇంతకాలం ఉద్యమాన్ని నడిపించారు. వారం క్రితం ఎంఎంసీ సభ్యుడు అనంత్ తన సహచరులతో కలిసి లొంగిపోయాడు. ఈ క్రమంలో రాంధేర్ మాంజీ కూడా సోమవారం ఉదయం ఛత్తీ్‌సగఢ్‌లోని ఖైరాఘాట్ జిల్లా బకర్‌గట్ట పోలీస్ స్టేషన్‌లో 11 మంది మావోయిస్టులతో కలిసి లొంగిపోయాడు. వీరిలో ఐదుగురు మహిళలున్నారు. అనారోగ్య సమస్యలకు తోడు 14 మంది బృందంలో ఇద్దరు సభ్యులు వెళ్లిపోవడంతోనే తాను లొంగిపోయినట్లు మాంజీ తెలిపారు. వీరి లొంగుబాటును మంగళవారం పోలీసులు అధికారికంగా ప్రకటించనున్నారు. మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలో 10 మంది నక్సలైట్లు లొంగిపోయారు. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఎదుట వీరంతా లొంగిపోయారు. వీరిలో నలుగురు మహిళలు కూడా ఉన్నారు. ఏకే47, ఇన్సాస్ సహా ఆధునిక రైఫిళ్లను పోలీసులకు అప్పగించారు. 10 మందిపై రూ.2.36 కోట్ల రివార్డు ఉన్నట్లు తెలిపారు. ఈ నక్సలైట్ల లొంగుబాటుతో దిండోరి, మండ్ల ప్రాంతాలు పూర్తిగా నక్సల్స్ రహితంగా మారిపోయాయని సీఎం మోహన్ యాదవ్ ప్రకటించారు. లొంగిపోయిన వారికి 15 ఏళ్ల పాటు పునరావాస ప్యాకేజీని అమలు చేస్తామన్నారు.
కాంట్రాక్టర్‌ని చంపేసిన నక్సల్స్..
రోడ్డు పనులు చేస్తున్న ఓ కాంట్రాక్టరును మావోయిస్టులు కిడ్నాప్ చేసి, హత్య చేశారు. ఈ ఘటన పామేడు అడవుల్లో ఆదివారం రాత్రి జరిగింది. ఇంతియాజ్(44) అనే కాంట్రాక్టర్ బీజాపూర్ జిల్లా పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రపల్లి అడవుల్లో పీఎంజీఎస్ నిధులతో రోడ్డు పనులు చేస్తున్నాడు.ఆదివారం పనులు జరుగుతున్న ప్రాంతం నుంచి ఎక్స్‌కవేటర్ డ్రైవర్‌ను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. విషయం తెలుసుకున్న ఇంతియాజ్ అక్కడికి వెళ్లగా.. మావోయిస్టులు డ్రైవర్‌ని వదిలేసి, అతన్ని పట్టుకొన్నారు. అనంతరం ఇంతియాజ్‌ను హత్య చేశారు. రోడ్ల పనులు ఎవరూ చేయొద్దని, చేస్తే ఇదే గతి పడుతుందని పామేడు ఏరియా కమిటీ పేరిట లేఖ వదిలారు. మృతుడు యూపీకి చెందిన వ్యక్తిగా తెలిసింది.