Share News

Manjeera River: మంజీర ఉగ్ర రూపం

ABN , Publish Date - Sep 29 , 2025 | 03:34 AM

భారీ వర్షాలకు మంజీర ఉగ్ర రూపం దాల్చింది. నిజాంసాగర్‌ నుంచి వస్తున్న వరదతో నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. మరోవైపు మహారాష్ట్ర నుంచి గోదావరికి భారీగా వరద వస్తోంది....

Manjeera River: మంజీర ఉగ్ర రూపం

  • జల దిగ్బంధంలో పరీవాహక గ్రామాలు

  • బోధన్‌, సాలూర మండలాల్లో వరద పోటు

  • బాసరను మరోసారి చుట్టుముట్టిన గోదావరి

  • శ్రీశైలం, సాగర్‌కు 5.9 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

  • 1న అల్పపీడనం.. 3,4 తేదీల్లో భారీ వర్షాలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): భారీ వర్షాలకు మంజీర ఉగ్ర రూపం దాల్చింది. నిజాంసాగర్‌ నుంచి వస్తున్న వరదతో నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. మరోవైపు మహారాష్ట్ర నుంచి గోదావరికి భారీగా వరద వస్తోంది. దీంతో ఈ రెండు నదులు కలిసే నిజామాబాద్‌ జిల్లాలోని కందకుర్తి ప్రాంతంలో మంజీర పోటెత్తుతోంది. అప్పటికే ఆ ప్రాంతంలో భారీగా శ్రీరాంసాగర్‌ బ్యాక్‌ వాటర్‌ కూడా నిలిచి ఉండటంతో.. సమీప గ్రామాల్లోకి మంజీర వరద పారింది. దీంతో బోధన్‌ మండలంలోని హంగర్గ, బిక్‌నెల్లి, ఖండ్‌గావ్‌, కొప్పర్గ.. సాలూర మండలంలోని మందర్నా, ఖాజాపూర్‌, హున్స గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. 40 ఏళ్ల తర్వాత ఇంతటి వరద వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. కలెక్టర్‌ ఆదేశాలతో రెవెన్యూ అధికారులు గ్రామస్థులను బస్సుల్లో పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హంగర్గ సరిహద్దు గ్రామాల్లోని 7 వేల ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. తెలంగాణ సరిహద్దు గ్రామమైన ఖండ్‌గావ్‌ నుంచి మహారాష్ట్రలోని కొండల్‌వాడికి రాకపోకలు నిలిచిపోయాయి. మంజీర ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రెండు ప్రాంతాల మధ్య ఉన్న బ్రిడ్జిపై నుంచి వరద పారుతోంది. మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల వద్ద మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఘనవురం ప్రాజెక్టు దిగువన ఉన్న మొదటి బ్రిడ్జి, ఎల్లాపూర్‌ బ్రిడ్జి నీట మునిగాయి. రెండు రోడ్లను మూసి వేయడంతో పాపన్నపేట, టేక్మాల్‌, పెద్దశంకరంపేట, అల్లాదుర్గం, రేగోడ్‌ మండలాల ప్రజలు జిల్లా కేంద్రానికి వెళ్లడానికి అవకాశం లేకుండాపోయింది. నిర్మల్‌ జిల్లా బాసరను శ్రీరాంసాగర్‌ బ్యాక్‌ వాటర్‌ మరోసారి ముంచెత్తింది. ఆలయ పరిసరాలు, స్నాన ఘట్టాలు పూర్తిగా జలమయమయ్యాయి. బాసరలోని ప్రైవేటు హోటళ్లు, సత్రాల చుట్టూ నీరు చేరడంతో, అందులో బస చేసిన భక్తులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆలయానికి వెళ్లే రెండు ప్రధాన రహదారులపై భారీగా వరద నీరు చేరింది. గోదావరి పరీవాహక ప్రాంతంలో సుమారు వెయ్యి ఎకరాల పంట మరోసారి నీట మునిగింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. నెల రోజుల్లోనే ఈ స్థాయిలో వరద రావడం ఇది రెండోసారి కావడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ఎంజీబీఎస్‌ నుంచి బస్సులు ప్రారంభం

మూసీ వరదతో జలదిగ్భంధంలో చిక్కుకున్న హైదరాబాద్‌లోని మహాత్మాగాంధీ స్టేషన్‌(ఎంజీబీఎ్‌స) ఆదివారం తేరుకుంది. నీటి ప్రవాహం తగ్గడంతో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు పారిశుధ్య సిబ్బం ది శ్రమించి ప్లాట్‌ఫాంలు, బస్‌ స్టేషన్‌ ఆవరణలో బురదను తొలగించారు. ఆదివారం ఉదయం 11 తర్వాత బస్సుల రాకపోకలు ప్రారంభమయ్యాయి.

మేడిగడ్డకు 7.7 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీకి ఆదివారం 7.71 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. దీంతో గేట్లన్నీ ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లు వదిలేస్తున్నారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు ఆదివారం 3 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. దీంతో 39 గేట్లను ఎత్తి 4.5 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కృష్ణా పరీవాహకంలో గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు 5.05 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 39 గేట్లను ఎత్తి 5.20 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. శ్రీశైలం జలాశయానికి 5.93 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. పది గేట్లను 23 ఫీట్ల మేర ఎత్తి 5.18 లక్షల క్యూసెక్కులు.. కుడి, ఎడమ విద్యుత్‌ కేంద్రాల ద్వారా 64,759 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, 202.9 టీఎంసీల నీరు ఉంది. నాగార్జునసాగర్‌కు 5.88 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో 26 గేట్ల ద్వారా 5.45 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు సామర్థ్యం 312 టీఎంసీలు కాగా, 299.7 టీఎంసీల నిల్వ ఉంది.

నేడు, రేపు ఈదురుగాలులతో వర్షాలు

బంగాళాఖాతంలో అక్టోబరు 1 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మంగళవారం నాటికి ఉత్తర అండమాన్‌ సముద్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం, మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో అక్టోబరు 3, 4 తేదీల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కాగా నేడు, రేపు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Updated Date - Sep 29 , 2025 | 03:34 AM